
హీరోయిన్ల కెరీర్ అంటే పెళ్లికి ముందు పెళ్లి తర్వాత అనే నానుడి ఇండస్ట్రీలో ఉంది. పెళ్లికి ముందు ఫుల్ క్రేజ్‌తో దూసుకెళ్లే నాయికల కెరీర్ మిసెస్ అయ్యాక జోరు తగ్గుతుందని, అవకాశాలు అరకొరగా వస్తాయని అంటుంటారు. అయితే ఇప్పుడు ఈ పరిస్థితి లేదు. ‘మిసెస్ అయితే ఏంటి?’ అని ఇండస్ట్రీ అనుకుంటోంది... పెళ్లయ్యాకా కెరీర్‌లో దూసుకెళ్లాలని హీరోయిన్లు అనుకుంటున్నారు. అయితే పెళ్లి తర్వాత చాన్స్‌లు వచ్చినా అక్క, చెల్లి, వదిన... వంటి పాత్రలకే వారిని పరిమితం చేస్తుంటారనే వారూ ఇండస్ట్రీలో లేకపోలేదు. కానీ ఈ పరిస్థితి కూడా మారింది. ప్రస్తుతం మాత్రం పెళ్లి అయినా కెరీర్‌లో ఏ మాత్రం జోరు తగ్గకుండా దూసుకెళుతున్నారు పలువురు హీరోయిన్లు. మిసెస్ అయినా క్రేజ్, చాన్స్‌ల విషయంలో తగ్గేదే లే అంటూ అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ... ఇలా ఆయా భాషల హీరోయిన్లు వివాహ బంధంలోకి అడుగు పెట్టినా, తల్లిగా ప్రమోషన్ పొందినా అవకాశాల్లో మాత్రం జోరు చూపిస్తున్నారు. పెళ్లి తర్వాత కూడా కెరీర్‌లో విజయవంతంగా దూసుకుపోతున్న హీరోయిన్లు ఎవరో ఓ లుక్ వేద్దాం.
ఇష్టంతో...
తెలుగు చిత్ర పరిశ్రమకు ‘ఇష్టం’తో (2001) వచ్చారు శ్రియ శరణ్. ఆ తర్వాత ‘సంతోషం, నువ్వే నువ్వే, ఠాగూర్, ఎలా చెప్పను, నేనున్నాను, ఛత్రపతి, గౌతమిపుత్ర శాతకర్ణి, పైసా వసూల్’ వంటి పలు విజయవంతమైన సినిమాల్లో నటించి, ప్రేక్షకులను అలరించారు శ్రియ. అదే విధంగా మలయాళ, తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ నటించారామె. కెరీర్ జోరుగా ఉన్న సమయంలోనే 2018 మార్చి 19న ఆండ్రీ కోస్చీవ్‌తో పెళ్లి పీటలెక్కారు శ్రియ. అయితే వివాహం తర్వాత కూడా ఆమె వరుస చాన్స్‌లు అందిపుచ్చుకున్నారు. 2021 జనవరి 10న ఓ ΄ాపకు జన్మనిచ్చారు శ్రియ. ఆ సమయంలో కొంచెం విరామం తీసుకున్న ఆమె 2022 నుంచి వరుస సినిమాలు చేస్తున్నారు. ఈ ఏడాది ఆమె నటించిన సూర్య ‘రెట్రో’ (ప్రత్యేక పాట) సినిమా మే 1న విడుదలైంది. తేజ సజ్జా హీరోగా నటించిన ‘మిరాయ్’ చిత్రం శుక్రవారం ΄ాన్ ఇండియా స్థాయిలో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో తేజ సజ్జా తల్లిగా అంబిక ΄ాత్రలో నటించారు శ్రియ. ఆమె ΄ాత్రకి మంచి ఆదరణ వస్తోంది. ఇంకా శ్రియ చేతిలో మరికొన్ని సినిమాలు ఉన్నాయి. తన తొలి సినిమా (ఇష్టం) లానే కెరీర్ అంటే ఉన్న ఇష్టంతో సినిమాల్లో కంటిన్యూ కావాలనుకుంటున్నారు శ్రియ.
జోరుగా చందమామ
రెండు దశాబ్దాలుగా అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తున్నారు కాజల్ అగర్వాల్. ‘క్యూ! హో గయా నా’ (2004) అనే బాలీవుడ్ మూవీలో అతిథి ΄ాత్రలో కనిపించిన ఈ బ్యూటీ తేజ దర్శకత్వం వహించిన ‘లక్ష్మీ కళ్యాణం’ (2007) సినిమా ద్వారా తెలుగుకి పరిచయమయ్యారు. అయితే కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ‘చందమామ’ (2007) చిత్రంతో ఓవర్ నైట్ ΄ాపులర్ అయ్యారు కాజల్. ఆ సినిమా తర్వాత ఆమెని టాలీవుడ్ చందమామ అంటూ ముద్దుగా పిలుచుకుంటున్నారు అభిమానులు. ఆ తర్వాత తెలుగులో ‘మగధీర, ఆర్య 2, డార్లింగ్, బృందావనం, మిస్టర్ పర్‌ఫెక్ట్, బిజినెస్ మేన్, సారొచ్చారు, నాయక్, బాద్‌షా, టెంపర్, ఖైదీ నంబర్ 150, నేనే రాజు నేనే మంత్రి, భగవంత్ కేసరి’ వంటి పలు విజయవంతమైన సినిమాల్లో నటించారామె. తెలుగు, తమిళ, హిందీ సినిమాలతో ప్రేక్షకులను తనదైన నటనతో అలరించిన ఈ బ్యూటీ 2020 అక్టోబరు 30న గౌతమ్ కిచ్లుతో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలు చేశారు ఈ బ్యూటీ. 2022 ఏప్రిల్ 19న ఓ బాబుకి జన్మనిచ్చారు కాజల్. ఆ సమయంలో కొంచెం విరామం తీసుకున్న ఈ చందమామ సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ మళ్లీ అదే జోరు చూపిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ‘ది ఇండియా స్టోరీ, రామాయణ: పార్ట్ 1, రామాయణ: పార్ట్ 2’ వంటి హిందీ మూవీస్‌తో పాటు ‘ఇండియన్ 3’ అనే తమిళ సినిమా చేస్తున్నారు.
అదే జోరు
చిత్ర పరిశ్రమలో రెండు దశాబ్దాలకుపైగా కెరీర్‌ని సొంతం చేసుకున్నారు నయనతార. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ చిత్రాల్లో నటిస్తూ తనకంటూ స్పెషల్ ఇమేజ్, క్రేజ్‌ని సంపాదించుకున్నారామె. ‘మనస్సినక్కరే’ (2003) అనే మలయాళ సినిమాతో చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ప్రస్తుతం లేడీ సూపర్ స్టార్‌గా కంటిన్యూ అవుతున్నారు. ఓ వైపు హీరోలకి జోడీగా వాణిజ్య సినిమాల్లో నటిస్తూనే మరోవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలతోనూ తానేంటో నిరూపించుకుంటున్నారు.
హీరోయిన్‌గా జెట్ స్పీడ్‌లో దూసుకెళుతున్న సమయంలోనే దర్శకుడు విఘ్నేశ్ శివన్ తో పెళ్లి పీటలెక్కారు నయన్. 2022 జూన్ 9న వీరి వివాహం జరిగింది. వారికి ఉయిర్, ఉలగమ్ అనే ట్విన్స్ ఉన్న సంగతి తెలిసిందే. ఆమెతో పాటు కెరీర్ స్టార్ట్ చేసిన మిగతా హీరోయిన్లు కెరీర్‌లో స్లో అయినప్పటికీ నయన్∙మాత్రం ఇప్పటికీ అదే జోరు కొనసాగిస్తున్నారు. ఇప్పటికీ చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా దూసుకెళుతున్నారామె. నయనతార ప్రస్తుతం తెలుగులో చిరంజీవి సరసన ‘మన శంకరవరప్రసాద్‌గారు’ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ అరడజనుకు పైగా సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు.
బిజీ బిజీగా...
‘గిల్లి’ (2009) సినిమాతో కన్నడ ఇండస్ట్రీలో హీరోయిన్‌గా అడుగుపెట్టారు రకుల్‌ప్రీత్ సింగ్. ‘కెరటం’ (2011) చిత్రంతో తెలుగు పరిశ్రమకు పరిచయమయ్యారామె. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ (2013) సినిమాతో తెలుగులో తొలి హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నారు రకుల్. ఆ తర్వాత ‘లౌక్యం, నాన్నకు ప్రేమతో, సరైనోడు, రారండోయ్ వేడుక చూద్దాం’ వంటి పలు హిట్ మూవీస్ చేశారు. తెలుగులో స్టార్ హీరోయిన్లలో ఒకరిగా వెలుగొందిన ఈ బ్యూటీ హిందీ, తమిళ చిత్రాల్లోనూ నటించి, ప్రేక్షకులను అలరించారు.
హీరోయిన్‌గా బిజీగా ఉన్న సమయంలోనే వ్యాపారవేత్త, నటుడు–నిర్మాత జాకీ భగ్నానీతో 2024 ఫిబ్రవరి 21న ఏడడుగులు వేశారు. పెళ్లి తర్వాత కూడా వరుస చాన్స్‌లతో కెరీర్‌ని కంటిన్యూ చేస్తున్నారామె. ఈ ఏడాది ఫిబ్రవరిలో ‘మేరే హస్బెండ్ కి బీవీ’ చిత్రంతో సందడి చేశారు రకుల్. ప్రస్తుతం హిందీలో ‘దే దే ΄్యార్ దే 2, పతీ పత్నీ ఔర్ ఓ 2’ వంటి మూవీస్‌తో బిజీ బిజీగా ఉన్నారు రకుల్ ప్రీత్ సింగ్. అలాగే కమల్‌హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూ΄÷ందిన ‘ఇండియన్ 3’లో రకుల్ నటించారు. ఈ చిత్రం విడుదల కావాల్సి ఉంది.
షార్ట్ బ్రేక్ తర్వాత...
‘అందాల రాక్షసి’ (2010) సినిమాతో టాలీవుడ్‌కి హీరోయిన్‌గా పరిచయమయ్యారు లావణ్యా త్రి΄ాఠి. ఆ తర్వాత ‘మనం, భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్నినాయనా’ వంటి పలు హిట్ మూవీస్‌లో యాక్ట్ చేశారామె. తెలుగులోనే కాదు... పలు తమిళ చిత్రాల్లోనూ నటించారు లావణ్య. 2023 నవంబరు 1న హీరో వరుణ్ తేజ్‌ని ప్రేమ వివాహం చేసుకున్నారు లావణ్య. వివాహం తర్వాత కూడా ఆమె సినిమాలు చేశారు. లావణ్య నటించిన తమిళ చిత్రం ‘టన్నెల్’, తెలుగు సినిమా ‘సతీ లీలావతి’ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
అథర్వా మురళి, లావణ్యా త్రిపాఠి జంటగా నటించిన చిత్రం ‘టన్నెల్’. రవీంద్ర మాధవ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని తెలుగులో లచ్చురామ్ ప్రొడక్షన్స్‌పై ఎ.రాజు నాయక్ విడుదల చేస్తున్నారు. అదేవిధంగా లావణ్యా త్రి΄ాఠి, దేవ్ మోహ¯Œ జంటగా నటించిన చిత్రం ‘సతీ లీలావతి’. ‘భీమిలీ కబడ్డీ జట్టు, ఎస్.ఎం.ఎస్(‘శివ మనసులో శృతి’) సినిమాల ఫేమ్ తాతినేని సత్య దర్శకత్వం వహించారు. నాగమోహన్ నిర్మించిన ఈ సినిమా విడుదలకు ముస్తాబవుతోంది. ఇదిలా ఉంటే ఈ నెల 10న లావణ్యా త్రి΄ాఠి ఓ బాబుకి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుని, మళ్లీ సినిమాలతో బిజీ అవుతారని ఊహించవచ్చు.
పెళ్లయిన వెంటనే ప్రమోషన్‌తో...
‘పైలెట్స్’ (2000) సినిమాతో బాలనటిగా మలయాళంలో అడుగుపెట్టారు కీర్తీ సురేశ్. 2013లో విడుదలైన ‘గీతాంజలి’ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచి మలయాళ, తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. 2016లో విడుదలైన ‘నేను శైలజ’ సినిమా ద్వారా తెలుగులో హీరోయిన్‌గా పరిచయం అయ్యారామె. ఆ తర్వాత ‘నేను లోకల్, అజ్ఞాతవాసి, మహానటి, రంగ్ దే, సర్కారువారి పాట, దసరా, భోళా శంకర్, ఉప్పు కప్పురంబు’ వంటి పలు సినిమాల్లో నటించారు.
దివంగత నటి సావిత్రి బయోపిక్‌గా రూపొందిన ‘మహానటి’ చిత్రానికిగానూ జాతీయ ఉత్తమ నటి అవార్డు గెలుచుకున్నారు కీర్తి. వరుస అవకాశాలతో బిజీ బిజీగా ఉన్న ఆమె... తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోని తట్టిల్‌ని 2024 డిసెంబరు 12న వివాహం చేసుకున్నారు. గోవాలో హిందు, క్రిస్టియన్ సంప్రదాయ పద్ధతుల్లో వీరి పెళ్లి జరిగింది. వివాహం అనంతరం హనీమూన్‌కి కూడా వెళ్లకుండా తాను కథానాయికగా నటించిన తొలి హిందీ చిత్రం ‘మేరీ జాన్’ ప్రమోషనల్ కార్యక్రమాల్లో మెడలో పసుపుతాడుతో పాల్గొని, టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యారు. పెళ్లి తర్వాత కూడా కీర్తీ సురేశ్ జోరు ఏ మాత్రం తగ్గలేదు. ఆమె నటించిన ‘ఉప్పు కప్పురంబు’ చిత్రం ఈ ఏడాది జూలై 4న రిలీజ్ అయింది. ప్రస్తుతం ‘రివాల్వర్ రీటా, కన్నివెడి’ వంటి తమిళ సినిమాలతో బిజీగా ఉన్నారు కీర్తి.
టాప్ ప్లేస్‌లో...
బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరిగా దూసుకెళుతున్నారు దీపికా పదుకోన్. ‘ఐశ్వర్య’ (2006) అనే కన్నడ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన ఈ బ్యూటీ రెండు దశాబ్దాల కెరీర్‌కి చేరువ అవుతున్నారు. కన్నడ, హిందీ, తమిళ, తెలుగు, ఇంగ్లిష్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించారామె. కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్‌తో ఏడడుగులు వేశారు. 2018 నవంబరు 14న వీరి వివాహం జరిగింది. పెళ్లి తర్వాత కూడా దీపిక క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. వరుస క్రేజీ ్ర΄ాజెక్టులను సొంతం చేసుకుని, ఔరా అని ఆశ్చర్యపరిచారామె.
ఇప్పటికీ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ల జాబితాలో దీపికా పదుకోన్ పేరు టాప్ ప్లేస్‌లో ఉండటం విశేషం. పైగా పెళ్లయినప్పటికీ హిందీలో అత్యధిక ΄ారితోషికం తీసుకుంటున్న హీరోయిన్‌గా కంటిన్యూ అవుతున్నారీ బ్యూటీ. రణ్‌వీర్–దీపిక దంపతులకు దువా పదుకోన్ సింగ్ అనే ΄ాప ఉంది. 2024లో అమ్మగా ప్రమోషన్ పొందారు దీపిక. ప్రస్తుతం మాతృత్వపు మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్న ఆమె సినిమాలకు కొంచెం విరామం ఇచ్చారు. ఆ తర్వాత ఎలాగూ బిజీ అవుతారని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఆమె చేతిలో ‘కింగ్’(వర్కింగ్ టైటిల్) అనే సినిమా ఉంది.
భలే జోరు...
అందం, అభినయంతో ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు ఆలియా భట్. ‘సంఘర్‡్ష’ (1999) సినిమాతో బాలనటిగా వెండితెరపై మెరిసిన ఆమె ఇప్పటికీ కెరీర్‌ని దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు. హీరోయిన్‌గా బిజీ బిజీగా ఉన్న సమయంలోనే హీరో రణబీర్ కపూర్‌ని పెళ్లి చేసుకున్నారు. 2022 ఏప్రిల్ 14న వీరు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. పెళ్లి తర్వాత కూడా పెద్దగా బ్రేక్ తీసుకోకుండానే కెరీర్ కంటిన్యూ చేశారు ఆలియా. వరుస అవకాశాలు అందిపుచ్చుకుని తన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదంటూ నిరూపించారామె. రణబీర్ కపూర్–ఆలియా భట్‌లకు రాహా అనే పాప ఉంది. 2022 నవంబరు 6న వీరు తల్లితండ్రులుగా ప్రమోషన్ పొందారు.
పాప పుట్టిన తర్వాత సినిమాలకు కొంచెం విరామం ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తర్వాత మళ్లీ బిజీ బిజీ అయ్యారు. వరుస ఆఫర్స్ అందుకుంటూ దూసుకెళుతున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో ‘ఆల్ఫా, లవ్ అండ్ వార్’ సినిమాలున్నాయి. ఇదిలా ఉంటే... 2022లో రిలీజైన తెలుగు చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’లో రామ్‌చరణ్‌కి జోడీగా సీత పాత్రలో ఆలియా భట్ నటించిన సంగతి తెలిసిందే.
ఇక బ్రేక్ లేకుండా...
హీరోయిన్ కియారా అద్వానీ క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కేవలం బాలీవుడ్‌లోనే కాదు... టాలీవుడ్‌లోనూ ఈ బ్యూటీకి యూత్‌లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ‘ఫగ్లీ’ (2014) అనే సినిమాతో హీరోయిన్‌గా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన కియారా దశాబ్దానికి పైగా దూసుకెళుతున్నారు. మహేశ్‌బాబు హీరోగా నటించిన ‘భరత్ అనే నేను’ (2018) చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయమైన ఈ బ్యూటీ ‘వినయ విధేయ రామ, గేమ్ ఛేంజర్’ వంటి సినిమాల్లో నటించారు. బాలీవుడ్‌లో వరుస అవశాలతో దూసుకెళుతున్న సమయంలోనే హీరో సిద్ధార్థ్ మల్హోత్రాని వివాహం చేసుకున్నారామె. 2023 ఫిబ్రవరి 7న రాజస్థాన్ లో వీరి పెళ్లి జరిగింది.
వివాహం తర్వాత కూడా సినిమాల్లో నటిస్తున్నారు కియారా. ఆమె నటించిన ‘గేమ్ ఛేంజర్’ ఈ ఏడాది జనవరి 10న, ‘వార్ 2’ మూవీ ఆగస్టులో విడుదలైంది. ఈ ఏడాది జూలై 15న ఒక పాపకు జన్మనిచ్చారామె. ప్రస్తుతం ఆమె చేతిలో ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’ అనే కన్నడ– ఇంగ్లిష్ చిత్రం ఉంది. పెళ్లి, తల్లయిన కారణంగా కొంత గ్యాప్ తీసుకున్నారు కియారా. అయితే ఇక బ్రేక్ లేకుండా వరుసగా సినిమాలు చేయాలనుకుంటున్నారు.
వీళ్లే కాదు... ప్రియాంకా చోప్రా, కరీనా కపూర్, కాజోల్, రాణీ ముఖర్జీ, జ్యోతిక, కత్రినా కైఫ్, విద్యాబాలన్, యామి గౌతమ్, మౌని రాయ్.. ఇలా పలువురు హీరోయిన్లు పెళ్లి తర్వాత కూడా అవకాశాలు అందుకుంటూ తమ జోరు చూపిస్తున్నారు.
– డేరంగుల జగన్ మోహన్