
అక్కినేని నాగేశ్వరరావు మనవడిగా, కింగ్ నాగార్జున తనయుడిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు నాగచైతన్య (Naga Chaitanya). జోష్ చిత్రంతో హీరోగా పరిచయమయ్యాడు. ఈ సినిమా వచ్చి నేటికి (సెప్టెంబర్ 5) 16 ఏళ్లు పూర్తవుతుంది. ఇన్నేళ్లలో ఎన్నో సక్సెస్‌ఫుల్ సినిమాలు చేశాడు. కొన్నిచోట్ల తడబడ్డా రెట్టింపు వేగంతో ముందుకు వచ్చి సూపర్ హిట్లు కొట్టాడు. తాజాగా తన జర్నీని గుర్తు చేసుకుంటూ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
సినిమానే నా జీవితం
ఓ ఇంటర్వ్యూలో నాగచైతన్య మాట్లాడుతూ.. వెనక్కు తిరిగి చూసుకుంటే సంతృప్తిగా ఉంది. సినిమానే నా జీవితం అని అర్థమవుతోంది. మొదట్లో ఫ్లాప్స్ వచ్చినప్పుడు కష్టంగా అనిపించేది. కానీ రానురానూ పరిణతి పెరిగింది. ఎదురుదెబ్బ తగిలినప్పుడు తప్పు ఎక్కడ జరిగిందని పరీశీలిస్తున్నాను. ఫలితాన్ని కాకుండా, సినిమా నుంచి వచ్చిన అనుభవంతో ముందుకు వెళ్లాలని నాన్న చెప్తూ ఉండేవారు. ఆయన మాటలు నాపై ప్రభావం చూపించాయి.
అక్కినేని ఫ్యామిలీ అంటేనే..
మజిలీ, లవ్‌స్టోరీ సినిమాలు చేశాక నా ఆలోచనా విధానమే మారిపోయింది. అక్కినేని కుటుంబం అంటేనే ప్రేమమయం. తాత మొదలుకొని మేం చేసిన ప్రేమకథా చిత్రాలను ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. వ్యక్తిగతంగా నాక్కూడా లవ్ స్టోరీలంటేనే ఇష్టం. ఈ మధ్య వాటిని బాగా మిస్ అవుతున్నా.. ఏడాదికి రెండు మూడు సినిమాలు చేయాలనే ఆతృత కంటే కూడా ఆరునెలలు లేటైనా మంచి సినిమాతోనే రావాలనుకుంటున్నాను.
ట్రోలింగ్..
సోషల్ మీడియా అనగానే ట్రోలింగ్ అని చాలామంది భయపడతారు. కానీ అక్కడ మన గురించి మనం చాలా తెలుసుకోవచ్చు. నన్ను ప్రేమించేవాళ్లు, విమర్శించేవాళ్లు.. ఇద్దరూ ఉంటారు. అందరి అభిప్రాయాల్ని పరిగణనలోకి తీసుకుంటాను అని చై చెప్పుకొచ్చాడు. నాగచైతన్య ప్రస్తుతం కార్తీక్ దండుతో మైథలాజికల్ సినిమా చేస్తున్నాడు.