
సీరియల్స్, సినిమాల్లో మనం చూసేదంతా నటన అని తెలిసినా కొందరు అందులో లీనమైపోతారు. విలన్లను ద్వేషిస్తారు.. హీరోలను ఆరాధిస్తారు.. హీరోయిన్లను ఇష్టపడతారు. వారికి నచ్చిన పాత్రను ఎవరైనా ఏమైనా అన్నా, హేళన చేసినా అసలు తట్టుకోలేరు. ఇది తనకు అనుభవమైందంటున్నాడు నటుడు నిశాంత్ దహియా. సన్యా మల్హోత్రా, నిశాంత్ దహియా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మిసెస్ (Mrs Movie). మలయాళంలో వచ్చిన ద గ్రేట్ ఇండియన్ కిచెన్ (The Great Indian Kitchen)కు ఇది రీమేక్‌గా తెరకెక్కింది.
అంచనాలను మించిపోయిన Mrs
జీ5లో రిలీజైన ఈ మూవీ విశేష ఆదరణ దక్కించుకుంది. ఈ సినిమా రెస్పాన్స్ గురించి నిశాంత్ (Nishant Dahiya) మాట్లాడుతూ.. ఇంత ఆదరణ లభిస్తుందని అస్సలు ఊహించలేదు. ఎంతోమంది జనాలకు మా సినిమా చేరువైంది. ఒకరు సినిమా తెరకెక్కించేటప్పుడు ఇది కచ్చితంగా జనాలకు చేరాలన్న ఆశతోనే తమ పని కొనసాగిస్తారు. మిసెస్ నా అంచనాలను మించిపోయింది. నాకే కాదు ఈ సినిమాకు పనిచేసిన అందరి అభిప్రాయం కూడా బహుశా ఇదే అయి ఉంటుంది.

ముందే చెప్పాలిగా!
ఎక్కడెక్కడినుంచో నాకు మెసేజ్‌లు వచ్చేవి, అందుకు నేను చాలా గర్విస్తున్నాను. కేవలం యాక్షన్, అడ్వెంచర్ సినిమాలు చూసేవారు కూడా నాకు కాల్ చేసి మాట్లాడటంతో ఆశ్చర్యపోయాను. మీ భార్యలతో మాత్రం సినిమా చూడొద్దని ఒక్క ముందుమాట వేయాల్సిందని నా ఫ్రెండ్స్ అన్నారు. నేను పోషించిన దివాకర్ పాత్ర వల్ల ప్రేమ, ద్వేషం అన్నీ పొందాను. ఆడవాళ్లు నా రోల్‌ను ద్వేషిస్తున్నామంటూనే నా పనితనాన్ని మెచ్చుకున్నారు. కానీ మగవాళ్లు చాలా కోపంగా మెసేజ్‌లు చేశారు.
బండబూతులు తిట్టారు
మూర్ఖుడా.. వెళ్లి ఎలుకల మందు తిను, నువ్వు ఇంకా బతికే ఉన్నావా.. చావలేదా? అని ఆగ్రహించారు. ఇలాంటి అమ్మాయిలు మెసేజ్ చేసుంటే అర్థం చేసుకునేవాడిని. నా పాత్రను ద్వేషించారు.. అది వారి మనసుని బాధపెట్టడం వల్లే ఇలా మాట్లాడుండొచ్చు అనుకుంటున్నాను. ఇంకొకరైతే నేను నటుడిగా పనికిరానన్నారు. ఇలాంటి పాత్రలు ఎంపిక చేసుకోవడం దగ్గరే నా వైఫల్యం కనిపించిందన్నారు. ఎలాంటి రోల్స్ సెలక్ట్ చేసుకోవాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేదా? అని విమర్శించారు.
అదే పెద్ద సమస్య
కానీ రియాలిటీకి వస్తే.. మన చుట్టూ ఉన్న సమాజంలో 95% మంది మగవాళ్లు దివాకర్‌లాగే ఉన్నారు. ఇదే నిజం. చాలామందికి వారేం చేస్తున్నారో కూడా తెలీదు. మిసెస్ సినిమాలో రిచా వెళ్లిపోయాక దివాకర్ రెండో పెళ్లి చేసుకుంటాడు. అంటే దివాకర్‌కు, అతడి కుటుంబానికి సమస్య ఏంటో అర్థం కాలేదు. అదే అన్నింటికన్నా పెద్ద ప్రాబ్లమ్. గ్రేట్ ఇండియన్ కిచెన్ చూసినప్పుడు హీరోయిన్ భర్త పాత్రను ద్వేషించాను. చివరకు అది మిసెస్ రూపంలో మళ్లీ నా దగ్గరకే వచ్చింది. మొదట ఒప్పుకోలేదు. కానీ తర్వాత అంగీకరించాను అని చెప్పుకొచ్చాడు.
చదవండి: ఆ సినిమా చేసేందుకు సౌత్ హీరోలు ముందుకురావట్లేదు: దర్శకుడు