పల్లెకు పోదాం..

Movies That Impressed Us With A Village Backdrop - Sakshi

‘పల్లెకు పోదాం సినిమా చేద్దాం. ఛలో చలో’ అని పాడుకుంటున్నారు కొందరు హీరోలు.  ఈ హీరోలతో వెండితెరపై పల్లె కథలను చూపించేందుకు రెడీ అవుతున్నారు దర్శకులు. ఈ పల్లెటూరి కథల్లోకి వెళదాం.

1990లో ఓ గ్రామం
 నాగార్జున కెరీర్‌లో విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌ మూవీస్‌ చాలానే ఉన్నాయి. మరోసారి నాగార్జున ఓ విలేజ్‌లోకి ఎంట్రీ ఇవ్వ నున్నారట. రచయిత బెజవాడ ప్రసన్నకుమార్‌ ఈ విలేజ్‌ స్టోరీని డెవలప్‌ చేశారు. అంతేకాదు... ఈ సినిమాతో ఆయన దర్శకుడిగా పరిచయం కానున్నారని సమాచారం. అభిషేక్‌ అగర్వాల్‌ ఈ సినిమాను నిర్మిస్తారని తెలిసింది. 1990 నేపథ్యంలో సాగే ఈ చిత్రం షూటింగ్‌ ఈ నెలలోనే ఆరంభం కానుంది.

కేరాఫ్‌ స్టువర్టుపురం
1970లలో స్టువర్టుపురంలోని నాగేశ్వరరావు గురించి తెలియనివాళ్లు ఉండి ఉండరు. ఆయన జీవితంతో ‘టైగర్‌ నాగేశ్వరరావు’ చిత్రం రూపొందింది. రవితేజ హీరోగా వంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో గాయత్రీ భరద్వాజ్, నూపుర్‌ సనన్‌ నాయికలు. టైగర్‌ నాగేశ్వరరావు జీవితం ఏ విధంగా గడిచింది? ఆయన్ను కొందరు దొంగ అని, మరి కొందరు పేదలకు హెల్ప్‌ చేసే ఆపద్భాందవుడు అని ఎందుకు చెప్పుకుంటున్నారు? అనే కోణంలో ఈ సినిమా ఉంటుందట. అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 20న రిలీజ్‌ కానుంది.

పల్లెటూరి ఆటగాడు
హీరో రామ్‌చరణ్‌ కెరీర్‌లో ‘రంగస్థలం’ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. సుకుమార్‌ దర్శకత్వంలో గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో చిట్టిబాబు పాత్రలో రామ్‌చరణ్‌ సూపర్బ్‌. ఇప్పుడు సుకుమార్‌ శిష్యుడు, ‘ఉప్పెన’ ఫేమ్‌ బుచ్చిబాబు సనతో ఓ సినిమా చేసేందుకు రామ్‌చరణ్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇది పల్లెటూరి నేపథ్యంలో సాగే స్పోర్ట్స్‌ ఫిల్మ్‌ అని, ఇందులో అన్నతమ్ములుగా రామ్‌చరణ్‌ డ్యూయల్‌ రోల్‌ చేయనున్నారని భోగట్టా. ఉత్తరాంధ్ర ప్రాంతంలోని ఓ విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌ ఫిల్మ్‌ ఇదని సమాచారం. వెంకట సతీష్‌ కిలారు నిర్మించనున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది.

భైరవకోన మిస్టరీ
శ్రీకృష్ణదేవరాయల కాలంలో చెలామణిలో ఉన్న గరుడ పురాణానికి, ఇప్పటి గరుడ పురాణానికి నాలుగు పేజీలు తగ్గాయట. ఆ గరుడ పురాణంలో మిస్‌ అయిన ఆ నాలుగు పేజీల కథే భైరవకోన అని హీరో సందీప్‌ కిషన్‌ అంటున్నారు. మరి.. ఆడియన్స్‌కు ఈ మిస్టరీ తెలియాలంటే థియేటర్స్‌కు రానున్న ‘ఊరిపేరు భైరవకోన’ సినిమా చూడాలి.  సందీప్‌ కిషన్‌ హీరోగా వీఐ ఆనంద్‌ దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇది. రాజేష్‌ దండా నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది.

రంగబలి రాజకీయం
రంగబలి అనే విలేజ్‌లో జరిగే çఘటనలు, రాజకీయ కోణాల నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘రంగబలి’. నాగశౌర్య, యుక్తి తరేజ జంటగా నటిస్తున్నారు. ఈ సినిమాకు పవన్‌ బాసంశెట్టి దర్శకుడు. సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం జూలై 7న విడుదల కానుంది.

కుప్పంలో హరోంహర
చిత్తూరు జిల్లా కుప్పంలో ‘హరోంహర’ అంటున్నారు సుధీర్‌బాబు. జ్ఞానసాగర్‌ ద్వారక దర్శకత్వంలో సుధీర్‌బాబు హీరోగా నటిస్తున్న చిత్రం ‘హరోం హర’. 1989 చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగే కథగా ‘హరోం హర’ సాగుతుంది. సుమంత్‌ జి. నాయుడు నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబరు 22న రిలీజ్‌ కానుంది. తెలుగు, తమిళ, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు.

ఆదికేశవ ఆగమనం
రాయలసీమలోని ఓ గ్రామంలో ఉన్న దేవాలయంపై మైనింగ్‌ మాఫియా చూపు పడింది. ఈ మాఫియాకు అడ్డుగా నిలబడతాడు రుద్రకాళేశ్వర్‌ రెడ్డి. ఈ గ్రామాన్ని రుద్రకాళేశ్వర్‌ రెడ్డి ఏ విధంగా రక్షించాడు అనేది తెలుసుకోవాలంటే జూలైలో వచ్చే ‘ఆదికేశవ’ సినిమా చూడాలి. రుద్రకాళేశ్వర్‌ రెడ్డి పాత్రలో హీరోగా వైష్ణవ్‌ తేజ్‌ నటిస్తున్నారు. శ్రీలీల హీరోయిన్‌. శ్రీకాంత్‌ ఎన్‌. రెడ్డి దర్శకత్వంలో ఎస్‌. నాగవంశీ, సాయిసౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

స్మగ్లింగ్‌ నేపథ్యంలో...
కథ ప్రకారం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లోని గ్రామాల్లో జరుగుతున్న స్మగ్లింగ్‌ను అడ్డుకోవాలనుకుంటున్నారట విశ్వక్‌ సేన్‌. 1994 నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమాకు కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో కాస్త గ్రే షేడ్స్‌ ఉన్న హీరో క్యారెక్టర్‌లో విశ్వక్‌ సేన్‌ నటిస్తున్నారు. ఇది రూరల్‌ బ్యాక్‌డ్రాప్‌ ఫిల్మ్‌. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

వాస్తవ ఘటన ఆధారంగా....
‘గంగతలపై ఉన్నంత వరకే శివుడు చల్లగా ఉంటాడు. కంట్లోంచి గానీ జారిందా శివమెత్తుతాడు’ అనే పవర్‌ఫుల్‌ డైలాగ్‌ సాయిరామ్‌ శంకర్‌ నోట వచ్చింది ఓ సినిమా కోసం. విలేజ్‌ యాక్షన్‌ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. ప్రకాష్‌ జూరెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ, రమణి జూరెడ్డి నిర్మిస్తున్న  ఈ చిత్రానికి మ్యూజిక్‌ మ్యాస్ట్రో ఇళయారాజా సంగీతం అందిస్తుండటం విశేషం.
ఇలా విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌ కథలతో ప్రేక్షకులను అలరించేందుకు మరికొందరు హీరోలు రెడీ అవుతున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top