
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ ప్రస్తుతం భైరవం మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. చాలా రోజుల విరామం తర్వాత బిగ్ స్క్రీన్‌పై అభిమానులను అలరించనున్నారు. ఈ మూవీలో నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్ కూడా ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 30న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలోనే మంచు మనోజ్ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన మనోజ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తన కుటుంబంలో జరిగిన పరిణామాలను తలచుకుని భావోద్వేగానికి గురయ్యారు. తన కుటుంబం మొత్తం కలిసి కూర్చొని భోజనం చేయాలని.. ప్రేమగా మాట్లాడుకునే రోజు రావాలని ఆ దేవుడిని ప్రార్థిస్తానని అన్నారు.
మా కుటుంబంలో జరిగిన పరిణామాలతో అమ్మను చాలా మిస్ అవుతున్నా. ఎందుకంటే నేను అమ్మను కలవాలంటే పలు కండిషన్స్ పెట్టారు. ఆమెను కలవాలంటే పర్మిషన్ తీసుకోవాలి. లేదంటే నేను వెళ్తే ఆమె ఇంటి బయటకు వచ్చి నన్ను కలవాలి. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు. ఆమె కూడా మమ్మల్ని ఎంతో మిస్సవుతోంది. అప్పుడప్పుడూ మా వద్దకు వస్తుంటుంది. మా పాప అంటే అమ్మకు ఎంతో ఇష్టం. గొడవల కారణంగా అక్కను దూరం పెట్టాను. ఇటీవల తన ఆధ్వర్యంలో జరిగిన టీచ్ ఫర్ ఛేంజ్ ఈవెంట్‌కు నేను వస్తానో రానో కూడా ఆమెకు తెలియదు. కానీ తన కోసమే నేను అక్కడికి వెళ్లాను. నేను ఏమైపోతానోనని అక్క చాలా భయపడింది. కానీ దేవుడి దయ, నా పిల్లలు, అభిమానులు ఇచ్చిన ధైర్యంతోనే నిలబడ్డా. తండ్రి అంటే నాకు చాలా ఇష్టం.. ఆయనపై ఎలాంటి కోపం లేదు. నా కుమార్తెను నాన్న ఎత్తుకుంటే చూడాలనుకుంటున్నా' అని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.