
ఏదైనా ప్రమోషన్ చేసేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుంటుంది హీరోయిన్ సమంత (Samantha Ruth Prabhu). ఏవైనా ఉత్పత్తులు మంచివి కావనిపిస్తే సదరు యాడ్స్ చేయడం లేదని చెప్పింది. అలా గతేడాది 15 వాణిజ్య ప్రకటలను రిజెక్ట్ చేసినట్లు ఇటీవలే వెల్లడించింది. ఏదైనా యాడ్ చేయడానికి ముందు ఆ ప్రోడక్ట్‌ను తన దగ్గరున్న ముగ్గురు డాక్టర్లు పరిశీలిస్తారని.. వారి నిర్ణయాన్ని బట్టే ముందుకు వెళ్తున్నట్లు తెలిపింది.
పూర్తిగా నమ్ముతున్నా..
అయితే ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న సమంత కొన్ని రోజులుగా ఎన్‌ఎమ్‌ఎన్ (నికోటినమైడ్ మోనోన్యూక్లియోటైడ్) అనే సప్లిమెంట్‌ను ప్రమోట్ చేసింది. ఇది డీఎన్‌ఏను రిపేర్ చేసి మన వయసు పెరగనీయకుండా చేస్తుందని చెప్తోంది. అంతేకాదు ఈ ఎన్‌ఎమ్‌ఎన్ ట్యాబ్లెట్స్ తయారు చేస్తున్న గటాకా సంస్థ సహ వ్యవస్థాపకురాలిగా ఉంది. తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో.. ఈ ట్యాబ్లెట్స్ గురించి వాటి ఫలితాలే చెప్తున్నాయి. నేను కేవలం వీటిని తీసుకోవడమే కాదు గటాకా సంస్థ కోఫౌండర్‌గానూ మారాను. ఎందుకంటే నేను ఈ సప్లిమెంట్లను పూర్తిగా నమ్ముతున్నాను. ఇది షార్ట్‌కట్స్ కోసం కాదు మీ భవిష్యత్తు కోసం అని రాసుకొచ్చింది.
ఫ్రాడ్.. నమ్మొద్దు: డాక్టర్
ఇది చూసిన ద లివర్ డాక్టర్.. సామ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. సైన్సు తెలియని నటి అని తిట్టిపోశాడు. వృద్ధాప్యాన్ని తగ్గించే ఔషధం అంటూ నకిలీ సప్లిమెంట్లను ప్రమోట్ చేస్తోందని ఆరోపించాడు. పని చేయని మందులు వాడమంటూ లక్షలాది అభిమానులను ఈ సైన్సు తెలియని సెలబ్రిటీలు ఎందుకు మోసం చేస్తున్నారు? అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎలుకలపై నెలలపాటు ప్రయోగాలు జరిపినప్పుడు అవి వయసు పెరుగుతున్నప్పటికీ కాస్తంత యాక్టివ్‌గా ఉన్నట్లు తేలింది.. అంతేకానీ వాటి జీవితకాలం పెరిగిందనో.. లేదా వృద్ధాప్యంలో వచ్చే వ్యాధులు దూరమయ్యాయనో నిరూపితం కాలేదన్నాడు. పైగా ఈ మందులు శరీరంలోని కీలకమైన కణాల వరకు చేరి వాటిని రిపేర్ చేసినట్లు ఎక్కడా రుజువు కాలేదని విమర్శించాడు.
నిజమైన వైద్యుల్ని నమ్మండి
మీకు నిజంగా వయసు కనిపించకుండా మరింత యంగ్‌గా కనిపించాలనుంటే ఆహారశైలి, వ్యాయామం, నిద్రపై ఫోకస్ పెట్టమని సూచించాడు. సిగరెట్, మద్యపానం వంటివాటికి దూరంగా ఉండమని సలహా ఇచ్చాడు. పాములాంటి ప్రచారకర్తలు చెప్పే మాటల్ని నమ్మవద్దని.. నిజమైన సైన్సును, సాక్ష్యాలను మాత్రమే విశ్వసించమని కోరాడు. అసలైన వైద్యులు చెప్పేదే వినండంటూ క్యాప్షన్ ఇచ్చాడు. కాగా గతంలోనూ సమంత పెట్టిన పలు పోస్టులపై లివర్ డాక్టర్ విమర్శలు గుప్పించాడు.