
బుల్లితెర జంట గుర్మీత్ చౌదరి (Gurmeet Choudhary) - దెబీనా బెనర్జీ (Debinna Bonnerjee) ఇంట దొంగతనం జరిగింది. అది కూడా గుర్మీత్ ఇంట్లో ఉన్న సమయంలోనే కావడం గమనార్హం. ఈ చోరీ విషయాన్ని నటుడు సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. అలర్ట్: కొత్తగా చేరిన ఓ పనిమనిషి మా ఇంట్లో కొన్ని వస్తువులు దొంగిలించి పారిపోయాడు. అయితే మా ఇంట్లో ఎవరు పనిలో చేరుతున్నా వారి వివరాలను ఒకటికి రెండుసార్లు చెక్ చేస్తాను. దానివల్ల పోయిన వస్తువులు తిరిగి రాబట్టుకోవడం సులువైంది.

చోరీ సమయంలో ఇంట్లోనే..
దొంగతనం జరిగినప్పుడు నేను ఇంట్లోనే ఉన్నాను. నా పిల్లలు వారి రూమ్‌లో సురక్షితంగా ఉన్నారు. ఇలా జరగడం మా దురదృష్టం. కానీ ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని నేర్చుకున్నాను. మీ ఇంట్లో ఎవరు పనికి చేరుతున్నా వారి గురించి ముందే అన్నీ తెలుసుకోండి. వారి వివరాలు సరిగా ఉన్నాయో, లేదో చెక్ చేసుకోండి అని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చాడు.

డేటింగ్.. పెళ్లి
టీవీ సెలబ్రిటీలు దెబీనా బెనర్జీ- గుర్మీత్ చౌదరి రామాయణ్ సీరియల్‌లో సీతారాముడిగా నటించారు. ఈ సీరియల్ కంటే ముందే వీరు సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారు. సీతారాముడిగా పాపులారిటీ పొందడంతో పాటు పెద్దల ఆశీర్వాదాలు అందడంతో 2011 ఫిబ్రవరి 15న పెద్దల సమక్షంలో మళ్లీ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఐవీఎఫ్ ద్వారా లియానా జన్మించింది. తర్వాత దివిషా పుట్టింది. త్వరలోనే గుర్మీత్, దెబీనా.. పతీ పత్ని ఔర్ పంగా- జోడియాన్ కా రియాలిటీ అనే షోలో కనిపించనున్నారు. ఇకపోతే దెబీనా.. అమ్మాయిలు అబ్బాయిలు అనే తెలుగు సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. పేరరసు అనే తమిళ మూవీలో హీరోయిన్‌గా చేసింది. విజయ్‌కాంత్ హీరోగా నటించిన ఈ మూవీ తెలుగులో కాశీ విశ్వనాథ్‌గా డబ్ అయింది.
చదవండి: మురళీమోహన్, అలీని తిట్టిన రాజేంద్రప్రసాద్.. అసలేం జరిగిందంటే