దర్శకులుగా రాణిస్తున్న కుప్పం బ్రదర్స్‌

Kuppam Brothers Ramesh, Gopi Excelling as Directors - Sakshi

పట్టుదలతో కల సాకారం చేసుకున్న సోదరులు 

ద్విగిజయంగా మూడో చిత్రానికి డైరెక్షన్‌  

కన్నడ, తెలుగు భాషల్లో చిత్రీకరణ 

కలలు కనండి.. వాటిని సాకారం చేసుకోండి అన్న మహనీయుల పలుకులను ఆ సోదరద్వయం నిజం చేసింది. డైరెక్టర్‌ కావాలి.. సినిమా రంగంలో రాణించాలి.. అని పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధించారు. కూలి పనులు చేసుకునే స్థాయి నుంచి స్టార్ట్‌ కెమెరా చెప్పే స్థాయికి ఎదిగారు. ఇప్పటికే రెండు చిత్రాలు రిలీజ్‌ కాగా, మరో సినిమా విడుదలకు సిద్ధం చేస్తున్నారు. కృషి ఉంటే మనుషులు రుషులవుతారు.. అని సినీకవి పేర్కొన్నట్లు అకుంఠిత దీక్షతో ఏళ్ల తరబడి కష్టించి మనసు పడిన రంగంలో ప్రతిభ కనబరుస్తున్నారు. కుప్పంం బ్రదర్స్‌గా పేరుపొందిన రమేష్, గోపీ దర్శకత్వంలో సత్తా చాటుతున్నారు.  

కుప్పం: తమిళనాడు రాష్ట్రానికి సరిహద్దులోని హోసూరుకు చెందిన మునిరాజు, లక్ష్మీదేవమ్మ దంపతులకు ముగ్గురు సంతానం. బతుకుదెరువు కోసం గతంలో పొట్టచేతబట్టుకుని కుప్పం బాట పట్టారు. స్థానిక మోడల్‌ కాలనీలో అద్దె ఇల్లు తీసుకుని నివాసముండేవారు. రోడ్డుపక్కన ఇరువైపులా చింతచెట్లు.. వాటికింద మునిరాజు రాతి డ్రస్సింగ్‌ పనిచేస్తూ కుమారులు రమేష్, శంకర్, గోపీని పోషించేవారు. కుమారులు కూడా తరచూ రాతి పనికి వెళ్లి కుటుంబానికి అండగా నిలిచేవారు. ఇంటర్‌ పూర్తిచేసిన రమేష్‌ సినీ పరిశ్రమ వైపు అడుగులు వేశాడు.

డైరెక్టర్‌ కావాలన్న లక్ష్యంతో 1995లో హైదరాబాద్‌ వెళ్లాడు. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు దగ్గర అసిస్టెంట్‌గా చేరేందుకు ప్రయత్నించాడు. కనీసం డిగ్రీ పూర్తి చేయాలని ఆయన రమేష్‌కు హితవు చెప్పి పంపించేశాడు. ఈ నేపథ్యంలో 1998లో డిగ్రీ పూర్తి చేసుకున్న రమేష్‌ తన లక్ష్యం కోసం మళ్లీ భాగ్యనగరానికి చేరాడు. సినీ పరిశ్రమలో పని దొరక్క, తినడానికి తిండి లేక తీవ్రంగా ఇబ్బందులు పడ్డాడు. రెండేళ్ల తర్వాత మళ్లీ కుప్పం వచ్చేశాడు. రాతి కూలీగా పనిలో చేరాడు. తర్వాత తండ్రి సూచన మేరకు కర్ణాటక వెళ్లి చిన్న ఫ్యాక్టరీలో ఉద్యోగిగా చేరాడు.  

మలుపు తిరిగింది అక్కడే.. 
2018 శ్రీప్రసన్న తిరుపతి గంగమ్మ జాతర నిర్వహణలో సినీ నటులతో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని అప్పటి కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు గోపీ, రమేష్‌కు బాధ్యతలు అప్పగించింది. అదే వారి జీవితానికి బాటలు వేసింది. ఈ కార్యక్రమంతో సినీ పెద్దల పరిచయాలు పెరిగాయి. కుప్పం దర్శక సోదరులుగా గుర్తింపు లభించింది. అనంతరం హైదరాబాద్‌కు చెందిన మ్యూజిక్‌ యాక్సెస్‌ నిర్మాణ సంస్థలో దర్శకులుగా చేరారు. ఈ సంస్థ ప్రోత్సాహంతో ‘రెడ్డిగారింట్లో రౌడీరాజ్యం’, కన్నడంలో ‘యారికి బేకు ఈలోక’ సినిమాలు పూర్తిచేశారు. ప్రస్తుతం ఈ సినిమా జూన్‌ మొదటి వారంలో విడుదల కానుంది. ప్రస్తుతం రమేష్‌ దర్శకుడిగా, రచయితగా రాణిస్తున్నాడు. ఇది నా లవ్‌ స్టోరీలో మూడు పాటలు, రెడ్డిగారింట్లో రౌడీరాజ్యం సినిమాలో కొన్ని పాటలు రాశాడు.  

అన్న కల.. తమ్ముడితో సాకారం ! 
చనిపోయే లోపు ఒక్క సినిమా అయినా తీస్తానంటూ రమేష్‌ తన తమ్ముడు గోపీకి తరచూ చెబుతుండేవాడు. ఈ నేపథ్యంలో అన్న ఆశయం కోసం గోపీ 2006లో హైదరాబాద్‌ చేరుకుని డీఎఫ్‌టీ పూర్తిచేశాడు. అవకాశాల కోసం హైదరాబాద్, బెంగళూరు తదితర ప్రాంతాలు తిరుగుతూ పట్టువదలని విక్రమార్కునిలా ప్రయత్నించి విజయం సాధించాడు. మీ శ్రేయోభిలాషి, నరహరి, గుండెజారి గల్లంతైంది తదితర సినిమాలకు ఎలాంటి పారితోషికం తీసుకోకుండా అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశాడు. దీంతో పాటు షార్ట్‌ ఫిలిమ్స్‌పై దృష్టిసారించాడు. ఆ సమయంలో ఓ టీవీ సౌజన్యంతో దర్శకుడు రాఘవేంద్రరావు నిర్వహించిన రేపటి దర్శకులు షార్ట్‌ ఫిలిమ్‌ కాంటెస్ట్‌లో పాల్గొన్నాడు.

ఇందులో గోపీ తీసిన షార్ట్‌ ఫిలిమ్‌ ‘ది వే’ ప్రథమ బహుమతి సాధించింది. అనంతరం బెంగళూరులో ఎడిటింగ్‌ కోర్సులో చేరి ఏడాదిపాటు శిక్షణ పొందాడు. కన్నడ దర్శకుడు సునీల్‌కుమార్‌ సింగ్‌ వద్ద మధువేమని కన్నడ చిత్రానికి పనిచేశాడు. తర్వాత ఐదేళ్లపాటు కథలు చేతబట్టుకుని అవకాశాల కోసం బెంగళూరు, హైదరాబాద్‌ తిరిగి తిరిగి అలిసిపోయాడు. 2015లో ఎస్వీ ప్రకాష్‌ నిర్మించిన ఇది నా లవ్‌ స్టోరీ సినిమాతో గోపీ మరో అవకాశం అందుకున్నాడు. తరుణ్, ఓవియా హీరో హీరోయిన్‌లుగా నటించిన ఈ సినిమాను అన్నదమ్ములు రమేష్, గోపీ తెరకెక్కించారు. అయితే ఈ సినిమా అంతగా ఆదరణ పొందలేదు.  

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top