
కేరళ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. వివాదాస్పద మలయాళ చిత్రం ‘హాల్’ను స్వయంగా వీక్షిస్తామని ప్రకటించింది. మలయాళ నటుడు షేన్ నిగమ్ నటించిన తాజా చిత్రం హాల్ వివాదంలో చిక్కుకుంది. త్వరలో విడుదలకు సిద్ధమైన ఈ సినిమాలోని బీఫ్, బిర్యానీ, బురఖా సన్నివేశాలపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏ సర్టిఫికేట్ మంజూరు చేసింది.
‘హాల్’ అనే చిత్రం ముస్లిం మహిళల జీవితం,వారి ఆహారపు అలవాట్లు, మతపరమైన ఆచారాలు వంటి అంశాలపై ఆధారపడి ఉంది. ఈ క్రమంలో ఈ సినిమాను వీక్షించిన సీబీఎఫ్‌సీ ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను తొలగించాలని సూచించింది. ముఖ్యంగా బీఫ్ తినే సన్నివేశం, బురఖా ధరించిన మహిళల సంభాషణలతో పాటు పలు సున్నిత అంశాలపై అభ్యంతరం వ్యక్తం చేసింది.
తన సినిమాపై సీబీఎఫ్‌సీ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ చిత్రదర్శకుడు కేరళ హైకోర్టును ఆశ్రయించారు. సీబీఎఫ్‌సీ సాంస్కృతిక స్వేచ్ఛను హరిస్తుందని కోర్టులో తన వాదనలు వినిపించారు. ‘హాల్ ఒక సామాజిక కథ. మతాన్ని కించపరచడం కాదు. ముస్లిం మహిళల జీవితాన్ని నిజంగా చూపించడమే లక్ష్యం’అని పేర్కొన్నారు.
విచారణ చేపట్టిన కేరళ హైకోర్టు న్యాయమూర్తులు కీలక నిర్ణయం తీసుకున్నారు. హాల్ సినిమాను ఈనెల 25న స్వయంగా వీక్షిస్తామని తెలిపారు. న్యాయస్థానం ఈ చిత్రంలోని సన్నివేశాలు మతపరమైన భావోద్వేగాలను దెబ్బతీసేలా ఉన్నాయా? లేదా? అన్నది పరిశీలించనుంది. సీబీఎఫ్‌సీ అభ్యంతరాలు సరైనవా? లేక సృజనాత్మక స్వేచ్ఛను అడ్డుకుంటున్నాయా? అనే అంశంపై సినిమా చూసిన తర్వాత తీర్పును వెలువరించనుంది.