'జయం' సినిమా అప్పట్లో ఎంత సెన్సేషన్ సృష్టించిందో తెలిసిందే. ఈ మూవీలో నటించిన హీరోహీరోయిన్‌తో పాటు మిగిలిన యాక్టర్స్, డైరెక్టర్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇదే చిత్రంలో హీరోయిన్ చెల్లి పాత్ర చేసిన బాలనటి యామిని కూడా బాగానే క్రేజ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈమె.. ఇప్పుడు మరోసారి తల్లికాబోతున్నట్లు శుభవార్త చెప్పేసింది. ఈ మేరకు ఫొటో షేర్ చేసింది.
సీరియల్, సినిమాల్లో నటిగా గుర్తింపు తెచ్చుకున్న జయలక్ష‍్మి కూతురే యామిని శ్వేత. 'జయం' సినిమాలో నటించడాని కంటే ముందు దాదాపు 10 సీరియల్స్‌లో చేసింది. సీతామహాలక్ష‍్మీ అనే సీరియల్ చేస్తున్న టైంలో 'జయం' ఆడిషన్స్ గురించి ప్రకటన వచ్చింది. ఇది చూసిన యామిని తండ్రి.. కూతురు ఫొటోలని డైరెక్టర్ తేజకు పంపారు. స్క్రీన్ టెస్ట్ అయిపోయిన తర్వాత యామిని.. హీరోయిన్ చెల్లి పాత్రకు ఎంపికైంది. తన నటనతో నంది అవార్డ్ కూడా అందుకుంది.
(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీల్లోకి వచ్చిన తెలుగు సినిమాలు)
చైల్డ్ ఆర్టిస్ట్‌గా మాత్రమే శ్వేత.. సినిమాల్లో కనిపించాలని ఆమె తల్లిదండ్రులు భావించారు. దీంతో చిన్నప్పుడు పలు సినిమాలు, సీరియల్స్‌లో నటింపజేశారు. తర్వాత మాత్రం నో చెప్పేశారు. ఉత్సాహం, అనగనగా ఓ కుర్రాడు తదితర మూవీస్ చేసిన తర్వాత యామిని పూర్తిగా చదువుపై దృష్టి పెట్టింది. విదేశాల్లో మాస్టర్స్ చేసి అక్కడే ఉద్యోగం సంపాదించుకుంది. తర్వాత పెళ్లి చేసుకుని విదేశాల్లో స్థిరపడిపోయింది. కొన్నేళ్ల క్రితం ఈమెకు ఓ కూతురు పుట్టింది. ఇప్పుడు మరోసారి ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు యామిని బయటపెట్టింది.
దీపావళి సందర్భంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన యామిని.. ముగ్గురుగా ఉన్న తన కుటుంబం త్వరలో నలుగురిగా మారబోతుందని చెప్పింది. అలానే బేబీ బంప్ ఫొటోని కూడా పంచుకుంది. ఈ క్రమంలోనే నెటిజన్లు ఈమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
(ఇదీ చదవండి: సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పెళ్లి సందడి షురూ)


