‘‘లెజెండ్’ మూవీ తర్వాత చాలా సినిమాలు చేశాను. అయితే వాటిలో గుర్తుపెట్టుకునేవి ఓ ఆరు చిత్రాలు ఉంటాయి. ఆ జాబితాలో ‘పెద్ది’ చిత్రంలో నేను చేసిన అప్పలసూరి పాత్ర మొదటి స్థానంలో ఉంటుంది. ఈ పాత్ర చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎమోషనల్‌గా, పెర్ఫార్మెన్స్ పరంగా, గెటప్ పరంగా అన్నింటిలోనూ నాకు చాలా నచ్చిన పాత్ర ఇది’’ అని నటుడు జగపతిబాబు తెలిపారు. రామ్‌చరణ్, జాన్వీ కపూర్ జోడీగా నటించిన చిత్రం ‘పెద్ది’. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు నిర్మించిన ఈ సినిమా జూన్ 4న విడుదల కానుంది.
ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన జగపతిబాబు విలేకరులతో మాట్లాడుతూ– ‘‘నేషనల్ అవార్డు విన్నింగ్ మేకప్ ఆర్టిస్ట్ రషీద్‌తో కలిసి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అప్పలసూరి పాత్ర లుక్‌ని డిజైన్ చేశారు బుచ్చిబాబు. ఈ సినిమా మొత్తం జగపతిబాబు కాకుండా అప్పలసూరి మాత్రమే కనిపిస్తాడు. ఈ పాత్రకు డబ్బింగ్ చెప్పడం ఒక సవాల్‌గా అనిపించింది. ఇప్పటివరకు నేను చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే ‘పెద్ది’ మరో ఎత్తు. ప్రస్తుతం సోనీ లివ్ కోసం ‘బ్లాక్ అండ్ వైట్’ అనే వెబ్ సిరీస్ చేస్తున్నాను’’ అని చెప్పారు.


