
భారత్ – పాకిస్తాన్ మధ్య జరిగిన ఆపరేషన్ సింధూర్‌లో తెలుగు జవాన్ మురళీ నాయక్ (22) వీర మరణం పొందిన విషయం తెలిసిందే. అయితే, వీర జవాన్ జీవిత కథ ఇప్పుడు సినిమాగా రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటించారు. బిగ్‌బాస్ ఫేమ్ గౌతమ్ కృష్ణ ఈ చిత్రంలో టైటిల్ పాత్ర పోషిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు నిర్మాత కె.సురేశ్‌బాబు తెలిపారు.

ఈ సినిమా ప్రకటన సందర్భంగా గౌతమ్ కృష్ణ పలు వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్ మన దేశ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక ముఖ్య అధ్యాయమని అన్నారు. దేశ ప్రజల కోసం వీరమరణం పొందిన మురళీ నాయక్ కథను ఈ ప్రపంచానికి చెప్పాలని అందరూ తెలుసుకోవాలని ఈ చిత్రం తీస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అయితే, ఈ సినిమా నిర్మించేందుకు మురళీ నాయక్ తల్లిదండ్రుల అనుమతి తీసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా జరిగిన ఈ కార్యక్రమంలో మురళీ నాయక్ తల్లిదండ్రులు ముదావత్ శ్రీరామ్ నాయక్, జ్యోతిబాయి పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలోని గోరంట్ల మండలం కల్లి తండాకు చెందిన మురళీ ‘ఆపరేషన్ సిందూర్’ సందర్భంగా నియంత్రణ రేఖ వద్ద పని చేస్తూ మరణించారు.