
కర్ణాటకలోని కొల్లూరు మూకాంబిక అమ్మవారికి ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా రూ. 4 కోట్ల విలువైన వజ్రాలు పొదిగిన వెండి కిరీటాన్ని బహుకరించారు. తాజాగా అమ్మవారి ఆలయాన్ని సందర్శించిన ఆయన.. స్వయంగా ఈ కిరీటంతో పాటు వీరభద్ర స్వామికి వెండి ఆయుధాన్ని అందజేశారు. గుడి అర్చకులు దగ్గర ఉండి ఇళయరాజాతో పూజలు చేయించారు. అనంతరం తీర్థ ప్రసాదాలతోపాటు అమ్మవారి ఫొటో అందజేశారు. ఇళయరాజా వెంట ఆయన తనయుడు కార్తిక్, మనవడు యతీశ్ తదితరులు ఉన్నారు. ఇళయరాజాకు దైవభక్తి ఎక్కువే. తరచు ఆయన మూకాంబిక అమ్మవారి దర్శనానికి వెళ్తుంటారు. 2006లో కూడా ఆయన అమ్మవారికి ఓ కిరీటం బహుమతిగా ఇచ్చారు.
కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరుకు సుమారు 130 కిలోమీటర్ల దూరంలో... దట్టమైన అడవుల మధ్యన నెలకొని ఉంది మూకాంబికాలయం. ఆ రాష్ట్రంలోని ఏడు మోక్షపురాల్లో కొల్లూరు మూకాంబిక గుడి ఒకటి. ఆలయం ఉన్నది కర్ణాటక రాష్ట్రంలో అయినా, ఆమెను ఎక్కువగా సందర్శించుకునేది కేరళీయులే కావడం విశేషం.