Ichata Vahanamulu Nilupa Radu Review: ‘ఇచ్చట వాహ‌న‌ములు నిలుప‌రాదు’ రివ్యూ

Ichata Vahanamulu Nilupa Radu Movie Review and Rating in Telugu - Sakshi

టైటిల్‌ : ఇచ్చట వాహ‌న‌ములు నిలుప‌రాదు
జానర్‌ : రొమాంటింగ్ యాక్షన్ థ్రిల్లర్‏
నటీనటులు : సుశాంత్, మీనాక్షి చౌదరి,వెంకట్, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, అభినవ్ గోమతం తదితరులు
నిర్మాణ సంస్థలు :ఏఐ స్టూడియోస్‌, శాస్త్ర మూవీస్ బ్యాన‌ర్స్‌
నిర్మాతలు : ర‌వి శంక‌ర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హ‌రీశ్ కోయ‌ల‌గుండ్ల
దర్శకత్వం : ఎస్‌. దర్శన్‌
సంగీతం : ప్ర‌వీణ్ ల‌క్క‌రాజు 
సినిమాటోగ్రఫీ : ఎం.సుకుమార్‌
ఎడిటింగ్‌: గ్యారీ బి.హెచ్‌
విడుదల తేది : ఆగస్ట్‌ 27,2021

టాలీవుడ్‌ కింగ్ నాగార్జున మేనల్లుడు, యంగ్‌ హీరో సుశాంత్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి పుష్కరకాలం కాలం దాటింది. కానీ అనుకున్న స్థాయిలో రాణించలేకపోయాడనే చెప్పాలి. తొలి సినిమా కాళిదాసుతో పాటు కరెంట్, అడ్డా లాంటి చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద పర్వాలేదనిపించినా, సుశాంత్‌కు మాత్రం స్టార్‌డమ్‌ని తీసుకురాలేకపోయాయి. దీంతో కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న ఈ యంగ్‌ హీరో.. ‘చిలసౌ’తో సెకండ్‌ ఇన్నింగ్స్‌ని ప్రారంభించాడు. ఆ చిత్రం సూపర్‌ హిట్‌ కావడంతో పాటు సుశాంత్‌ నటనపై విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు.

ఆ తర్వాత ‘అల వైకుంఠపురములో’ సుశాంత్‌కు మంచి బ్రేక్‌ ఇచ్చింది. హీరోగా చేసినా రాని గుర్తింపు ఆ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించడంతో ద్వారా వచ్చింది. ఇలా సెకండ్‌ ఇన్నింగ్స్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఈ అక్కినేని హీరో.. తాజాగా నటించిన చిత్రం  ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’. ‘నో పార్కింగ్‌’ అనేది ఉపశీర్షిక. కరోనా వైరస్ కారణంగా దాదాపు పలుమార్లు వాయిదా పడిన ఈ మూవీ.. శుక్రవారం(ఆగస్ట్‌ 27) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ట్రైలర్‌, చిత్రంలోని పాటలకు పాజిటివ్‌ రెస్పాన్స్‌  రావడంతో పాటు మూవీ ప్రమోషన్స్‌ గ్రాండ్‌గా చేయడం ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. మరి ఆ అంచనాలను సుశాంత్‌ అందుకున్నాడా? లేదా?, ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ అనే డిఫరెంట్‌ టైటిల్‌తో వచ్చిన సుశాంత్‌ను ప్రేక్షకులను ఏ మేరకు ఆదరించారు? సెకండ్‌ ఇన్నింగ్స్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న సుశాంత్‌కు మరో హిట్‌ని తనఖాతాలో వేసుకున్నాడా? లేదా? రివ్యూలో చూద్దాం.


 కథేంటంటే
హైదరాబాద్‌కు చెందిన అరుణ్‌ (సుశాంత్‌) ఒక ఆర్కిటెక్ట్‌. అతను పనిచేసే ఆఫీస్‌లోనే మీనాక్షి అలియాస్‌ మీను (మీనాక్షి చౌదరి) కూడా ఎంప్లాయ్‌గా జాయిన్‌ అవుతుంది. తొలి చూపులోనే మీనాక్షితో ప్రేమలో పడిపోతాడు అరుణ్‌. ఆమె కోసం డ్రైవింగ్‌ నేర్చుకొని మరీ కొత్త బైక్‌ని కొంటాడు. ఒక రోజు మీనాక్షి ఇంట్లో ఎవరు లేరని తెలుసుకొని, కొత్త బైక్‌ వేసుకొని ఆమె ఇంటికి వెళ్తాడు అరుణ్‌. అదే సమయంలో ఆ ఏరియాలో ఓ సీరియల్‌ నటిపై మర్డర్‌ అటెంప్ట్‌ జరుగుతుంది. ఇది అరుణే చేశాడని భావించి ఆ ఏరియా జనాలంతా అరుణ్‌ కోసం వెతకడం ప్రారంభిస్తారు. వారిని నుంచి అరుణ్‌ ఎలా తప్పించుకున్నాడు? అరుణ్‌ని కాపాడడం కోసం మీనాక్షి ఏం చేసింది? అసలు సీరియల్‌ నటిపై హత్యాయత్నం చేసిందెవరు? పులి(ప్రియదర్శి)కి అరుణ్‌కి మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఇందులోకి నర్సింహ యాదవ్‌(వెంకట్‌) ఎలా ఎంటర్‌ అయ్యాడు? ‘ఇచ్చట వాహ‌న‌ములు నిలుప‌రాదు’అనే టైటిల్‌కి ఈ కథకి మధ్య ఉన్న సంబంధం ఏంటి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎవరెలా చేశారంటే?
అరుణ్‌ పాత్రలో సుశాంత్‌ అద్భుత నటనను ప్రదర్శించాడు. డాన్స్‌తో పాటు ఫైటింగ్‌ సీన్స్‌ కూడా అదరగొట్టేశాడు. గత తన సినిమాల్లో కంటే ఇందులో సుశాంత్‌ కొత్త లుక్ తో ఫ్రెష్ గా కనిపించాడు. ఇక మీను పాత్రలో మీనాక్షి చౌదరి ఒదిగిపోయింది. తెరపై చాలా అందంగా కనిపించింది. ఓ ఏరియా కార్పొరేటర్‌గా వెంకట్‌ పర్వాలేదనించాడు. హీరో ప్రాణ స్నేహితుడు పులి పాత్రలో ప్రియదర్శి అద్భుత నటనను కనబర్చాడు. బైక్‌ షోరూం ఎంప్లాయ్‌గా వెన్నెల కిశోర్‌ తనదైన కామెడితో నవ్వించే ప్రయత్నం చేశాడు.అభినవ్ గోమతంతో పాటు మిగిలిన నటీ నటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.

ఎలా ఉందంటే?
‘ఇచ్చట వాహ‌న‌ములు నిలుప‌రాదు’అనే కొత్త టైటిల్‌ పెట్టి సినిమాపై ఆసక్తి పెంచిన దర్శకుడు దర్శన్‌.. కథనంలో మాత్రం కొత్తదనం లేకుండా, సాదాసీదాగా నడిపించాడు. కథలో పెద్దగా స్కోప్‌ లేకపోవడంతో కొన్ని అనవసరపు సీన్స్‌ని అతికించి అతి కష్టం మీద రెండున్నర గంటల పాటు సినిమాను లాగాడు. ఫస్టాఫ్‌లో కొన్ని సీన్స్‌ అయితే ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడతాయి. అసలు సస్పెన్స్‌ని ఇంటర్వెల్‌ వరకు రివీల్‌ చేయకపోవడం సినిమాకు కాస్త ప్రతికూల అంశమే. ఇక సెకండాఫ్‌లో అయినా ఆకట్టుకునే అంశాలేమైనా ఉంటాయకునే ప్రేక్షకుడికి అక్కడా నిరాశే ఎదురవుతుంది. సినిమాలో చాలా సన్నివేశాల్లో నాటకీయత ఎక్కువగా ఉంటుంది. కానీ, నిర్లక్ష్యంగా చేసే చిన్న తప్పుల వల్ల ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి అనే ఓ మంచి సందేశాన్ని ఇవ్వాలనుకున్న దర్శకుడి ఆలోచనను ప్రశంసించాల్సిందే. ఇక ఈ సినిమా ప్రధాన బలం ఏదైనా ఉందంటే అని  ప్ర‌వీణ్ ల‌క్క‌రాజు  సంగీతమనే చెప్పాలి. పాటలతో పాటు నేపథ్య సంగీతం అదరగొట్టేశాడు. తనదైన బీజీఎంతో కొన్ని సన్నివేశాలకు ప్రాణం పోశాడు. ఎం.సుకుమార్‌ సినిమాటోగ్రఫి బాగుంది. ఎడిటర్‌ గ్యారీ బి.హెచ్‌ చాలా చోట్ల తన కత్తెరకు పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్టుగా ఉన్నాయి. 
- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

Rating:  
(2.5/5)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top