‘సౌండ్‌ పార్టీ​’లో నా పాత్ర ధోనీలా ఉంటుంది: హీరోయిన్‌

Hrithika Srinivas Talk About Sound Party Movie - Sakshi

‘సౌండ్ పార్టీ’సినిమాలో నేను సిరి అనే పాత్ర పోషించాను. క్రికెట్‌ టీమ్‌లో ధోనీలా నా పాత్ర ఉంటుంది. మ్యాచ్‌ లాస్ట్‌లో వచ్చి ధోని ఎలా సిక్స్ లు కొడతారో అలా నా పాత్ర  ఉంటుంది.క్లైమాక్స్ లో ఎవరూ ఊహించని ట్విస్ట్ ఇస్తాను’ అని హీరోయిన్‌ హ్రితిక శ్రీనివాస్‌ అన్నారు.  వీజే స‌న్నీ, హ్రితిక శ్రీనివాస్ జంట‌గా నటించిన తాజా చిత్రం ‘సౌండ్‌ పార్టీ’. జయ శంకర్ సమర్పణలో  సంజ‌య్ శేరి దర్శకత్వం వహించారు. రవి పొలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర  నిర్మాత‌లు. ఈ నెల 24న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో హీరోయిన్‌ హ్రితిక మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..

సీనియర్ నటి ఆమని మా అత్త అవటంతో చిన్నప్పుడు నుంచి సినిమాలపై ఆసక్తి ఉండేది. చైల్డ్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాల్లో కూడా నటించాను. హీరోయిన్ గా తెలుగులో నాకు ఇది రెండో సినిమా.  అల్లంత దూరాన తర్వాత నటించిన చిత్రమిది. సంజయ్ గారు కథ చెప్పినప్పుడు ఎక్సైటింగ్ గా అనిపించింది. ఇది ఒక కంప్లీట్ ఫన్ ఎంటర్టైనర్. కామెడీ తోపాటు కంటెంట్ కూడా ఉంది. ప్రేక్షకులు కచ్చితంగా ఎంటర్ టైన్  అవుతారని నమ్మకం ఉంది. 

ఇందులో నేను సిరి అనే పాత్రలో నటించాను. సిరి చాలా తెలివైన అమ్మాయి. నా పాత్ర సినిమాలో చాలా ఇంపార్టెంట్ గా ఉంటుంది. సీరియస్ క్యారెక్టర్ అయినా సిచువేషన్ మాత్రం చాలా కామెడీగా ఉంటుంది. నా రియల్ లైఫ్ కి రిలేటబుల్ గా ఈ పాత్ర ఉంటుంది. 

అమాయకులైన తండ్రి కొడుకులు ఈజీ మనీ కోసం ఎలాంటి పనులు చేస్తారనేది ఈ సినిమా మెయిన్ కాన్సెప్ట్. ఈ పాయింట్ నే చాలా ఫన్నీగా దర్శకులు చూపించారు. ఇందులో బిట్ కాయిన్ గురించి కూడా ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. బిట్ కాయిన్ వాల్యూను చూపించారు. 

సన్నీకి టెలివిజన్ లో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. బిగ్ బాస్ లో  ప్రేక్షకులు తనని ఎలా చూశారో సెట్ లోనూ ఆయన అలానే ఉంటారు. చాలా జెన్యూన్ గా, ఓపెన్ గా ఉంటారు. సౌండ్ పార్టీ టైటిల్ కి కరెక్ట్ ఎగ్జాంపుల్ గా నటించారు. సెట్ లో సన్నీ చాలా సపోర్ట్ చేశారు. తెలుగులో మాట్లాడేటప్పుడు కొన్ని పదాలు రాకపోతే ఆయనే  నేర్పించారు. 

ఇందులో సిచువేషన్ కి తగ్గట్టుగా వచ్చే రెండు పాటలు మాత్రమే ఉంటాయి. మనీ మనీ అంటూ వచ్చే టైటిల్ సాంగ్ తో పాటు మరో సాంగ్ ఉంటుంది.  డైరెక్టర్ సంజయ్ రైటింగ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఆయన కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది.  ఎంజాయ్ చేస్తూ షూటింగ్ చేశాం. జయశంకర్ సార్ ప్రజెంటర్  గా ఉండడం ఈ సినిమాకు ప్లస్ అయింది. నిర్మాతలు రవి సార్, మహేంద్ర గజేంద్ర గారు చాలా సపోర్ట్ చేశారు. ఈ బ్యానర్ లో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది.

ఎక్స్పరిమెంట్స్ సినిమాలు చేయాలని ఉంది. తెలుగులో నాకు నచ్చిన హీరోయిన్ సాయి పల్లవి. ఆమె చేసే రోల్స్ లాంటివి చేయాలని ఉంటుంది. హీరోల విషయంలో నాని అంటే నాకిష్టం.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top