OTT: హాలీవుడ్‌ మూవీ ‘ప్రైమల్‌’ రివ్యూ | Hollywood Movie Primal Review In Telugu | Sakshi
Sakshi News home page

Primal Review : ఈ సినిమా చూసి ‘దేవుడా..ఈ స్థితి ఎవరికీ రాకూడదు’ అనుకుంటారు

Sep 3 2024 12:28 PM | Updated on Sep 3 2024 12:40 PM

Hollywood Movie Primal Review In Telugu

ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్‌ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్‌ అవుతున్న వాటిలో హాలీవుడ్‌ చిత్రం ‘ప్రైమల్‌’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం. దేవుడా... ఈ స్థితి ఎవరికీ రాకూడదు!

థ్రిల్లర్‌ చిత్రాలను మనం గతంలో ఎన్నో చూశాం. అదే జోనర్‌లో ఎప్పటికప్పుడు వినూత్న పంథాను ఎంచుకుంటూ వర్ధమాన దర్శకులు వివిధ భాషలలో సినిమాలు తీయడానికి ప్రయత్నిస్తూనే వున్నారు. థ్రిల్లర్‌ అంటే సినిమా చూసే ప్రేక్షకుడిని తమ స్క్రీన్‌ప్లేతో అలరించాలి... కథను రక్తి కట్టించాలి. 2019లో విడుదలైన హాలీవుడ్‌ చిత్రం ‘ప్రైమల్‌’ ఆ కోవలోనే ఉంటుంది. ఇది ఇటీవలే ఓటీటీలో విడుదలైంది. ప్రముఖ నటుడు నికోలస్‌ కేజ్‌ నటించిన ఈ సినిమా ఓ అసలు సిసలైన థ్రిల్లర్‌ అని చెప్పాలి. నిక్‌ పావెల్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కథ 70 శాతం నడి సముద్రంలోని ఓ ఓడలోనే జరుగుతుంది. 

కథాంశానికొస్తే... వాల్ష్‌ పాత్రలో నటించిన నికోలస్‌ కేజ్‌ ప్రమాద జంతువులను అడవిలో పట్టుకొని నగరంలో జంతు శాలలకు అమ్ముకునే ప్రమాద వృత్తిలో ఉంటాడు. ఈ దశలో అతి ప్రమాదకరమైన వైట్‌ జాగ్వర్‌ను పట్టుకుని జాగ్వర్‌తో పాటు విషపూరిత పాములు, కోతులు మరికొన్ని జంతువులను కూడా ఓ ఓడలో వేరే దేశానికి తరలిస్తుంటాడు. అనుకోకుండా అదే ఓడలో కరడుగట్టిన నేరస్తుడైన రిచర్డ్‌ లోఫర్‌ను కూడా అమెరికా పోలీసులు తరలించడానికి వస్తారు. 

ఓడ ప్రమాదకర జంతువులతో పాటు అతి ప్రమాదకరమైన నేరస్తుడుతో తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. సముద్ర మార్గంలో కొంత దూరం ప్రయాణించాక నేరస్తుడు తాను తప్పించుకొని ఓడలో ఉన్న జంతువులను వాటి చెరసాలనుండి విడిపిస్తాడు. వాల్ష్‌ తన జంతువులతో పాటు ఓడలో వున్న మిగతా పోలీసులను, అలాగే ఓడను ఆ నేరస్తుడి బారి నుండి ఎలా రక్షించాడన్నదే మిగతా కథ. 

విలన్‌ పాత్రలో కెవిన్‌ తన నటనతో సినిమాకే హైలెట్‌గా నిలిచాడు. ఓ టైమ్‌లో ప్రేక్షకుడు దేవుడా... ఈ స్థితి ఎవరికీ రాకూడదు అని కచ్చితంగా అనుకుంటాడు. స్క్రీన్‌ప్లే నిడివి తక్కువ ఉండి థ్రిల్లర్‌ జోనర్‌ ప్రేక్షకులకు సరైన ఎంటర్‌టైనర్‌ అయిన ఈ ‘ప్రైమల్‌’ సినిమా లయన్స్‌ గేట్‌ ఓటీటీలో ఉంది. మరింకేం... వాచ్‌ చేయండి. 
– ఇంటూరు హరికృష్ణ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement