సాంగ్‌ చూపించేశాం మావా...  | Sakshi
Sakshi News home page

సాంగ్‌ చూపించేశాం మావా... 

Published Wed, Aug 3 2022 8:26 AM

Here is Special Songs From Recent Telugu Movie Details Inside - Sakshi

పాట వినిపించి ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే ప్రయత్నం చేసేవారు.. ఇది ఒకప్పటి ట్రెండ్‌. పాట చూపించి థియేటర్లకు రప్పించే ప్రయత్నం చేస్తున్నారు.. ఇది ఇప్పటి ట్రెండ్‌. ప్రేక్షకులను థియేటర్‌కి రప్పించాలంటే గతంలో ఆడియో, సినిమా పోస్టర్స్‌ని పబ్లిసిటీలో భాగంగా విడుదల చేసేవాళ్లు. పాటలు బాగుంటే సినిమా కూడా బాగుంటుందని థియేటర్‌కి వెళ్లేవారు. ఇప్పుడు ‘సాంగ్‌ చూపించేశాం మావా..’ అంటూ పాట వీడియోను కూడా చూపించి ప్రేక్షకులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. సినిమా మేకింగ్‌ మారినట్లుగానే పబ్లిసిటీలో కూడా కొత్త ట్రెండ్‌ మొదలైంది. ఈ మధ్య కాలంలో విడుదలైన కొన్ని సినిమాల వీడియో పాటలను ఓ లుక్కేద్దాం.. 

ఐయామ్‌ రెడీ.. 
‘‘నేను రెడీ.. రా రా రెడ్డి..’ అంటూ నితిన్‌ని ఆటపట్టించారు అంజలి. వీరిద్దరి మధ్య వచ్చే ఈ మాస్‌ సాంగ్‌ ‘మాచర్ల నియోజక వర్గం’ లోనిది. నితిన్‌ హీరోగా ఎంఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృతీ శెట్టి, క్యాథరిన్‌  హీరోయిన్లు. అంజలి స్పెషల్‌ సాంగ్‌ చేశారు. రాజ్‌కుమార్‌ ఆకెళ్ల సమర్పణలో ఎన్‌. సుధాకర్‌ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న రిలీజవుతోంది. మహతి స్వర  సాగర్‌ స్వరపరచిన ఈ చిత్రంలోని ‘రా రా రెడ్డి..’, ‘అదిరిందే..’ అంటూ సాగే పాటల ఫుల్‌ వీడియోను చిత్రబృందం రిలీజ్‌ చేసింది. ‘మాచర్ల సెంటర్లో మాపటేల నొనొస్తే.. ఐయామ్‌ రెడీ.. రా రా రెడ్డి..’ అంటూ అంజలి, నితిన్‌లపై చిత్రీకరించిన సాంగ్, నితిన్, కృతీపై తీసిన ‘అదిరిందే పసిగుండె.. తగిలిందే హై ఓల్టే’ పాటల వీడియోలు మంచి వ్యూస్‌ దక్కించుకున్నాయి.

పలికిందేదో ప్రాణం..
‘మోడువారిన మనసుల్లోనే పలికిందేదో ప్రాణం.. ఆ కన్నుల్లోనే గంగై పొంగిన ఆనందం, కాలంతో పరిహాసం చేసిన స్నేహం’ అంటూ ఉల్లాసంగా పాడారు కల్యాణ్‌ రామ్‌. వశిష్ఠ్‌ దర్శకత్వంలో కల్యాణ్‌ రామ్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘బింబిసార’. కేథరిన్, సంయుక్తా మీనన్‌  హీరోయిన్లు. హరికృష్ణ .కె నిర్మించిన ఈ సినిమా ఈ నెల 5న రిలీజ్‌ కానుంది. ఎంఎం కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘నీతో ఉంటే చాలు..’ అనే ఫుల్‌ వీడియో సాంగ్‌ని రిలీజ్‌ చేశారు. ‘మోడువారిన మనసుల్లోనే పలికిందేదో ప్రాణం..’ అంటూ సాగే ఈ ఫ్యామిలీ సాంగ్‌కి మంచి స్పందన వస్తోంది. 

అడిగా.. నన్ను నేను అడిగా... 
‘అడిగా.. నన్ను నేను అడిగా.. నా కెవ్వరూ నువ్వని..’ అంటూ అనుపమా పరమేశ్వరన్‌ని అడుగుతున్నారు నిఖిల్‌. ఈ ప్రేమ పాట నిఖిల్, అనుపమ జంటగా నటించిన ‘కార్తికేయ 2’లోనిది. కాలభైరవ స్వరపరచిన ఈ చిత్రంలోని ‘అడిగా.. నన్ను నేను అడిగా.. నా కెవ్వరూ నువ్వని, అడిగా.. నిన్ను నేను అడిగా.. నే నిన్నలా నేనని..’ అంటూ సాగే పాటను చిత్రయూనిట్‌ విడుదల చేసింది. నిఖిల్, అనుపమల మధ్య వచ్చే ఈ ఫీల్‌ గుడ్‌ సాంగ్‌కి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ఇవే కాదు... మరికొన్ని చిత్రాల్లోంచి కూడా వీడియో సాంగ్స్‌ విడుదలయ్యాయి. ఇవన్నీ ప్రేక్షకులను థియేటర్స్‌కి రప్పించడానికి కొంతవరకైనా ఉపయోగపడతాయని చెప్పొచ్చు.                                    

Advertisement
 
Advertisement
 
Advertisement