‘ది కశ్మీరీ ఫైల్స్‌’.. బెదిరింపులకు భయపడను

Director Abhishek Responded On Threatening Calls For His New film - Sakshi

వివేక్‌ రంజన్‌ అగ్నిహోత్రి దర్శకత్వంలో అభిషేక్‌ అగర్వాల్, వివేక్‌ రంజన్‌ అగ్నిహోత్రి, పల్లవి జోషి నిర్మించిన చిత్రం ‘ది కశ్మీరీ ఫైల్స్‌’. మిథున్‌ చక్రవర్తి, అనుపమ్‌ ఖేర్, దర్శన్‌ కుమార్, ప్రకాశ్‌ బెల్వాడి, మృణాల్‌ కులకర్ణి, పునీత్‌ ఇస్సార్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని తీసినవాళ్లను, చూసే ప్రేక్షకులను వదిలేదు లేదంటూ కశ్మీరీ మిలిటెంట్‌ గ్రూప్‌ బెదిరించినట్లుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా అభిషేక్‌ అగర్వాల్‌ మాట్లాడుతూ– ‘‘కశ్మీరీ హిందువులపై సాగిన మారణహోమం గురించిన నిజాలు ఇప్పటి తరంలో చాలామందికి తెలియదు. అందుకే ఈ సినిమా తీయాలనుకున్నాను. ఏప్రిల్‌లో సినిమా రిలీజ్‌ అనుకుంటున్నాం. ఈ సినిమా షూటింగ్‌ను జమ్మూ–కశ్మీర్‌లో చేసినప్పుడు ఇబ్బందులు ఎదురవలేదు. కశ్మీరీ మిలిటెంట్‌ గ్రూప్‌ నన్ను డైరెక్ట్‌గా బెదిరించలేదు. కానీ బెదిరిస్తున్నట్లు ముంబైలో ఉన్న నా స్నేహితులు చెప్పారు. మా సినిమా పోస్టర్, టీజర్‌ కూడా రిలీజ్‌ చేయలేదు. అలాంటప్పుడు సినిమా ఎలా ఉంటుందో వారి కెలా తెలుస్తుంది? ప్రజలకు వాస్తవాలు చూపిస్తున్నప్పుడు భయమెందుకు? ఎవరి బెదిరింపులకూ భయపడి సినిమా రిలీజ్‌ ఆపం. ఈ సినిమా వెనక ఏ రాజకీయ పార్టీ ప్రోద్బలం లేదు. ఇలాంటి వాస్తవ కథలను తెరకెక్కిస్తున్నప్పుడు ప్రభుత్వాలు అండగా ఉండాలి. అప్పుడే మరిన్ని సినిమాలను ధైర్యంగా తీయగలుగుతాం. ప్రస్తుతం ‘ది కశ్మీరీ ఫైల్స్, ఏ1 ఎక్స్‌ప్రెస్‌’, ‘రాజ రాజ చోర’ చిత్రాల పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ‘కార్తికేయ 2, గూఢచారి 2, అబ్దుల్‌ కలాం బయోపిక్‌’ త్వరలో ఆరంభమవుతాయి. ‘టైగర్‌ నాగేశ్వరరావు’ బయోపిక్‌ని హిందీ–తెలుగులో నిర్మిస్తాం’’ అన్నారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top