'ధురంధర్' పూర్తి స్టోరీ.. సీక్వెల్ చూడటానికి ముందు మరోసారి | Dhurandhar Movie Recap And Part 2 Explanation | Sakshi
Sakshi News home page

Dhurandhar Recap: తొలి భాగంలో ఏం జరిగింది? సీక్వెల్‌లో ఏం జరగొచ్చు?

Mar 18 2026 1:54 PM | Updated on Mar 18 2026 2:07 PM

Dhurandhar Movie Recap And Part 2 Explanation

కొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేస్తాయి. అలాంటి వాటిలో 'ధురంధర్' ఒకటి. రణ్‌వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఇది. గతేడాది డిసెంబరులో రిలీజయ్యేంత వరకు ఇదో చిత్రం ఉందని కూడా చాలామందికి తెలీదు. ఎప్పుడైతే థియేటర్లలోకి వచ్చిందో సరికొత్త రికార్డులు సృష్టించింది. ఇప్పుడు మూడు నెలలు తిరిగేసరికల్లా సీక్వెల్ రెడీ చేశారు. ఈ రోజే(మార్చి 18) ప్రీమియర్ షోలు పడనుండగా.. రేపటి నుంచి రెగ్యులర్ షోలు వేయనున్నారు. ఈ సందర్భంగా అసలు తొలి భాగంలో ఏం జరిగింది? సీక్వెల్‌లో ఏం జరగొచ్చనేది చూద్దాం.

'ధురంధర్' పూర్తి స్టోరీ
30 డిసెంబరు 1999, అఫ్గానిస్తాన్‌లోని కాందహార్ ఎయిర్‌పోర్ట్‌లో భారతదేశానికి చెందిన విమానాన్ని హైజాక్ చేసిన ఐఎస్ఐ వాళ్లు.. ప్రయాణికుల్ని బందీలుగా చేశారు. మన దగ్గర బందీగా ఉన్న 36 మంది టెర్రరిస్టులు రిలీజ్ చేస్తే గానీ జనాల్ని వదలం అనే దగ్గర నుంచి కేవలం ముగ్గురిని విడుదల చేస్తే చాలు అనేంత వరకు వస్తారు. అప్పుడు విదేశాంగ శాఖ మంత్రి దేవరత కపూర్, ఇంటెలిజన్స్ బ్యూరో చీఫ్ అజయ్ సన్యాల్(మాధవన్).. విమానంలో ఉన్న జనాలకు ధైర్యం ఇచ్చేందుకు వస్తారు. అయితే ఐఎస్ఐ వాళ్లలో ఒకడు.. మన దేశాన్ని కించపరుస్తూ అజయ్ సన్యాల్‌తో దారుణంగా మాట్లాడుతాడు. కానీ మనోడు ఒకడు పాకిస్తాన్‌లోకి వెళ్లి అక్కడున్న గ్యాంగ్స్ ని మట్టుబెట్టేందుకు 'ధురంధర్' అనే మిషన్ ఉందని అజయ్ సన్యాల్.. విదేశాంగ శాఖమంత్రితో చెబుతాడు. కానీ అదంతా చాలా టైమ్ తీసుకునే మిషన్ అని గ్రీన్ సిగ్నల్ ఇవ్వరు.

కట్ చేస్తే 13 డిసెంబరు 2001లో పార్లమెంట్‌పై దాడి జరుగుతుంది. కాందహార్ హైజాక్‌లో భాగమైన ఓ టెరర్రిస్ట్.. దీనికి నాయకత్వం వహిస్తాడు. కొందరు పోలీస్ ఆఫీసర్లని చంపేస్తారు. దొరికిపోయే టైంకి ఆత్మాహుతి దాడి చేసుకుని వాళ్లంతా చనిపోతారు. ఈ దెబ్బకు ప్రభుత్వం షేక్ అయింది. సహనం కోల్పోయింది. అందుకే అజయ్ సన్యాల్ చెప్పిన 'ధురంధర్' ఐడియాకు ఓకే చెబుతారు. కట్ చేస్తే 2004లో మన దేశ ఏజెంట్ హంజా అలీ మజారీ(రణ్‌వీర్ సింగ్) తన ప్రయాణాన్ని మొదలుపెడతాడు. నేరుగా పాకిస్తాన్‌కి వెళ్లకుండా ఆఫ్గానిస్తాన్ మీదుగా పాక్‌లోని లయారీకి చేరుకుంటాడు. అక్కడికి వెళ్లిన తర్వాత హంజా.. ఆలం జ్యూస్ సెంటర్ నడుపుతున్న మన దేశానికి చెందిన మరో ఏజెంట్ ఆలం భాయ్ షాపులో పనికి చేరతాడు. ఓ రోజు సాల్ట్ ఛాయ్ తాగుతూ.. లయారీ టౌన్ జియో పాలిటిక్స్ అంతా వివరిస్తాడు.

లయరీని ఏలుతున్న బాబు డకాయిట్ అక్రమ సంతానం రహమాన్ డకాయిట్ (అక్షయ్ ఖన్నా). ఈ విషయం చిన్నప్పుడే రహమాన్‌కి తెలియడంతో సొంత తల్లిని చంపేసి సవతి తండ్రికి దూరంగా ఉంటాడు. తన సొంత సామ్రాజ్యాన్ని సృష్టించుకుంటాడు. తన కజిన్ ఉజైర్ బలూచ్ తో కలిసి ఆయుధాల అక్రమ రవాణా, రమ్మీ క్లబ్, కిడ్నాపులు, రాజకీయ హత్యలు.. ఇలా అన్ని దారుణాలు చేస్తూ కరాచీ అండర్ వరల్డ్ కి డాన్ లా తయారయ్యాడు. రహమాన్ కి ఇద్దరు కొడుకు నయిమ్, ఫైజల్. రహమాన్ అండతో స్థానిక ఎన్నికల్లో రెండుసార్లు గెలిచిన పాకిస్తానీ అవామీ పార్టీ నాయకుడు జమీల్. కానీ రహమాన్ గ్యాంగ్ కి వ్యతిరేకంగా ముస్లిం మూమెంట్ పార్టీ.. బాబు డకాయిట్, అర్షద్ పప్పు చేతిలో ఉంటుంది. బాబు డకాయిట్ కి పక్షవాతం రావడంతో రహమాన్ ని ఎదుర్కొనేందుకు అర్షద్ తో చేతులు కలుపుతాడు. హంజా.. అక్కడే పనిచేసుకుంటూ ఉంటే కుదరదు కాబట్టి ఈ రెండు గ్యాంగ్స్ లో ఏదో ఒకదానిలో చేరేందుకు ప్లాన్ వేస్తాడు. వీళ్లకు బాబు డకాయిట్ గ్యాంగ్ లో ఉన్న మరో ఏజెంట్ సాయం చేస్తాడు. ఓ పెళ్లిలో రహమాన్ కొడుకులపై బాబు డకాయిట్ గ్యాంగ్ దాడి చేయడానికి ప్లాన్ చేస్తున్నారనే సమాచారాన్ని సదరు ఏజెంట్.. హంజాకి చెబుతాడు.

అనుకున్నట్లే ఆ పెళ్లిలో రహమాన్ కొడుకులపై బాబు-అర్షద్ గ్యాంగ్ దాడి చేస్తారు. ఇందులో రహమాన్ పెద్ద కొడుకు నయిమ్ చనిపోతాడు. ఇతడిని కాపాడి, రహమాన్ గ్యాంగ్‌లో హంజా చేరాలనేది ప్లాన్. కానీ పిల్లాడు చనిపోయినా సరే దాన్ని కూడా తనకు అవకాశంగా మార్చుకుని రమమాన్‌కి హంజా దగ్గరవుతాడు. డబ్బులు ఇస్తానని చెబితే వద్దని.. తనని గ్యాంగ్‌లో చేర్చుకోమంటాడు. అలా రహమాన్ గ్యాంగ్‌లో హంజా జాయిన్ అవుతాడు. ఎన్నికల వరకు ఎలాంటి ప్రతీకారాలు వద్దని జమీల్.. రహమాన్‌కి చెప్పడంతో అంతా సైలెంట్ అవుతాడు. కానీ ఓ రోజు హంజా.. ప్రతీకారం గురించి మాట్లాడటంతో బాబు డకాయిట్‌ని నడిరోడ్డుపై రహమాన్ దారుణంగా చంపుతాడు.

2007లో పీఏపీ పార్టీ 3 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుస్తుంది. రహమాన్ ఫాలోయింగ్ జనాల్లో చాలా పెరిగిపోయింది. ఓ రోజు పార్టీ ఫంక్షన్ లో ఖనానీ బ్రదర్స్.. రహమాన్ ని కలుస్తారు. వీళ్లలో ఒకడు కొత్త రాజకీయ పార్టీ పెట్టాలని రహమాన్ కి సలహా ఇస్తాడు. మరోవైపు హంజా.. జమీల్ కూతురు యలీనాని ప్రేమలో పడేస్తాడు. ఈలోపు ఖనానీ బ్రదర్స్, మన రూ.500,రూ.1000 నోట్లని ప్రింట్ చేసే ప్లేట్లు సంపాదించారని అజయ్ సన్యాల్ కి తెలుస్తోంది. ఇది ఎలా జరిగిందో కనుక్కోమని అజయ్ సన్యాల్ తన తోటి అధికారికి చెబుతాడు. మరోవైపు ఐఎస్ఐ చీఫ్ మేజర్ ఇక్బాల్, రహమాన్ కలిసేలా ఖనానీ బ్రదర్స్ ఏర్పాటు చేస్తారు. తనకు గన్స్ కావాలని, కానీ వాటిపై మేడిన్ అమెరికా, మేడిన్ రష్యా అని ఉండాలని చెబుతాడు. ఇలానే ఎందుకంటే రేప్పొద్దున ఎవరైనా దొరికిపోతే పాకిస్తాన్‌ని ఎవరూ పాయింట్ అవుట్ చేయకూడదనేది మేజర్ ఇక్బాల్ ప్లాన్. అలానే రహమాన్‌కి రాజకీయంగానూ సాయం చేస్తానని చెప్పడంతో డీల్‌కి ఓకే చెబుతాడు.

ఆ తర్వాత రహమాన్.. ఇక్బాల్‌కి గన్స్ అందజేస్తాడు. తర్వాత కొన్నిరోజులకు ముంబైలోని తాజ్ హోటల్‌లో దాడులు జరుగుతాయి. దీనికి కారణం తానే అనుకున్న హంజా.. రహమాన్ ని చంపే అవకాశం కోసం ఎదురుచూస్తుంటాడు. మరోవైపు తను అధికారం ఎక్కడ కోల్పోతానో అని భయపడిన జమీల్.. రహమాన్‌ని కట్టడి చేసేందుకు ఎస్పీ అస్లాం చౌదరిని రంగంలోకి దింపుతాడు. రహమాన్ కి నమ్మకస్తుడిగా ఉన్న హంజా.. జమీల్, ఎస్పీ అస్లాం చౌదరిలతో చేతులు కలిపి చివరకు రహమాన్‌నే చంపేస్తాడు. అక్కడితో తొలి భాగాన్ని ముగించారు.

రెండో భాగంలో స్టోరీ ఏం ఉండనుంది?

మరి రహమాన్ చనిపోయిన తర్వాత లయారీని హమ్జా ఎలా శాసించాడు? రహమన్ సోదరుడు ఉజైర్ బలూర్ ఏమయ్యాడు? అతడిని హమ్జా ఏం చేశాడు?

అసలు హమ్జా అలియాస్.. జస్కీరాత్ సింగ్ రంగీ.. మన దేశంలో ఉన్నప్పుడు ఎందుకు జైలుకెళ్లాడు? ఏం నేరం చేశాడు? ఇతడినే ఎందుకు గూఢచారిగా పంపించారు?

తొలి భాగంలో హమ్జాని ఎవరు గుర్తుపట్టలేదు. కానీ రెండో భాగంలో అది బయటపడుతుందా? ఒకవేళ ప్రేమించి పెళ్లి చేసుకున్న యలీనాకి ఈ విషయం తెలిసిందా?

ఐఎస్ఐకి చెందిన మేజర్ ఇక్బాల్‌కి హమ్జా దొరికేస్తాడా? రహమాన్‌ని చంపేందుకు హమ్జాతో చేతులు కలిపిన ఎస్పీ అస్లాం చౌదరి.. హమ్జాని ఏమైనా అడ్డుకున్నాడా?

స్వయానా అల్లుడే.. భారతీయ గూఢచారి అని జమీల్ కి ఏమైనా తెలిసిందా? ఒకవేళ తెలిస్తే ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు?

తొలి భాగంలో ఎక్కువగా వినిపించిన బడే సాహెబ్.. సీక్వెల్‌లో కనిపిస్తాడా? లేదంటే దీన్ని మూడో భాగం కోసం ఏమైనా దాస్తారా? ఇలా చాలా ప్రశ్నలు మిగిలిపోయాయి. వీటన్నింటికి 'ధురంధర్ 2'లో సమాధానాలు దొరుకుతాయా అనేది చూడాలి?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement