
మణికొండ(హైదరాబాద్): గాఢ నిద్రలో ఉన్న ఓ కొరియోగ్రాఫర్ గదిలోని ఏసీకి షార్ట్ సర్క్యూట్ అయి మంటలు చెలరేగి, దట్టమైన పొగ పీల్చటంతో మృతి చెందిన సంఘటన నార్సింగి పోలీస్‌స్టేషన్, పుప్పాలగూడ శ్రీరాంనగర్ కాలనీలో బుధవారం తెల్లవారు జామున చోటు చేసుకుంది.
ఎస్ మునీందర్ తెలిపిన వివరాల ప్రకారం..వరంగల్ జిల్లాకు చెందిన పోరేటి వీరేందర్‌రెడ్డి (38) కొన్ని సంవత్సరాల క్రితం నగరానికి వచ్చి కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. శ్రీరాంనగర్ కాలనీలోని కుతుబ్ ఆర్కేడ్ అపార్ట్‌మెంట్‌లోని 301 ప్లాట్‌లో నివాసం ఉంటున్నారు. రోజు మాదిరిగానే మంగళవారం రాత్రి తన గదిలో వీరేందర్‌రెడ్డి నిద్రకు ఉపక్రమించాడు. అర్ధరాత్రి దాటాక 2.30 గంటల సమయంలో అతని గదిలోని ఏసీకి షార్ట్ సర్క్యూట్ కావటంతో మంటలు చెలరేగాయి. దుస్తులు, ఫర్నిచర్ కాలిపోయి పొగలు వ్యాపించాయి.
గమనించిన చుట్టు పక్కల వారు డయల్ 100 ద్వారా పోలీసు, అగ్నిమాపక శాఖ వారికి సమాచారం ఇచ్చారు. వారు వచ్చి మంటలార్పి గదిలోకి వెళ్లగా వీరేందర్‌రెడ్డి అపస్మారక స్థితిలో కనిపించాడు. సీపీఆర్ చేసినా అప్పటికే దట్టమైన పొగను పీల్చటంతో మృతి చెందినట్టు 108 సిబ్బంది ధ్రువీకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించామని, షార్ట్ సర్క్యూట్ కారణాలను తెలపాలని విద్యుత్ శాఖకు లేఖ రాశామని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.