హీరో విజయ్.. తమిళనాడు ముఖ్యమంత్రి అయిపోయారు. ప్రస్తుతం పాలనలో బిజీగా ఉన్నారు. అయితే ఈయన స్వతహాగా నటుడే కాబట్టి ఇండస్ట్రీకి అనుకూలించే నిర్ణయాలు తీసుకుంటారని సినీ ప్రముఖులు అంతా భావించారు. ఎవరికి వాళ్లే పలు సూచనలతో విజయ్‌ని ఇదివరకే వెళ్లి కలిశారు కూడా. ఇప్పడు సినీ పరిశ్రమకు మొత్తానికి కలిసొచ్చేలా విజయ్ శుభవార్త చెప్పేశారు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)
సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో సీఎం విజయ్.. ఇండస్ట్రీ గురించి ప్రకటన చేశారు. ఇకపై ఏ తమిళ సినిమా అయినా థియేటర్లలో రోజుకు 5 షోలు ప్రదర్శించుకోవచ్చని పేర్కొన్నారు. 1957 తమిళనాడు థియేటర్ల నియంత్రణ చట్టం నిబంధనలను సవరిస్తూ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. దీని ప్రకారం తమిళనాడు వ్యాప్తంగా అన్ని థియేటర్లలో కొత్తగా విడుదలయ్యే తమిళ సినిమాలు విడుదలైన రోజు నుంచి వారం రోజుల పాటు రోజుకు ఐదు షోలు ప్రదర్శించుకోవచ్చు. స్థానిక పండగ రోజులు, ప్రభుత్వ సెలవు దినాలు, శని,ఆదివారాల్లో కూడా రోజుకు ఐదు ఆటలు ప్రదర్శించడానికి అనుమతి లభించింది.
గత కొన్నేళ్లలో తమిళనాడులో ఏ కొత్త సినిమా అయినా సరే మార్నింగ్ షోతోనే మొదలయ్యేది. బెన్‌ఫిట్ షోలు లాంటివి ఉండేవి కావు. ఇప్పుడు సీఎం విజయ్ తీసుకున్న నిర్ణయం వల్ల స్టార్ హీరోల చిత్రాలకు కలెక్షన్స్ పరంగా కలిసొచ్చే అవకాశముంటుంది. అలానే తెలుగు రాష్ట్రాల్లో ముందురోజు రాత్రి వేసే ప్రీమియర్ల ట్రెండ్ కూడా త్వరలో తమిళనాడులో మొదలైన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
ఇకపోతే విజయ్ నటించిన చివరి సినిమా 'జన నాయగణ్' రిలీజ్ ఎప్పుడనేది ఇంకా తేలట్లేదు. కొన్నిరోజుల క్రితం తమిళనాడులోని ఓ ఆలయాన్ని దర్శించుకున్న ఈ చిత్ర నిర్మాత వెంకట్ కె నారాయణ.. ఇంకా సెన్సార్ కాలేదని చెప్పారు. మరోవైపు జూన్ 19న మూవీ థియేటర్లలోకి వచ్చే అవకాశముందని మాట్లాడుకుంటున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే రోజుకు ఐదు షోల నిర్ణయం.. 'జన నాయగణ్'కి ఎక్కువగా లాభించే అవకాశముంటుంది.
(ఇదీ చదవండి: 'ధురంధర్' హీరోపై బాలీవుడ్‌లో నిషేధం)


