
ఆమని, కొమరం ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'బ్రహ్మాండ'. రాంబాబు దర్శకత్వం వహించగా దాసరి సురేష్ నిర్మించారు. అయితే ఈ మూవీ విడుదలవడం చూడకుండానే డైరెక్టర్ రాంబాబు అకాల మరణం చెందారు. దీంతో ఈ చిత్రంపై అందరి చూపు పడింది. తాజాగా (ఆగస్టు 29) ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చింది. ఇంతకీ ఇది ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.
(ఇదీ చదవండి: ఓటీటీలో తమన్నా 'బీర్' స్టోరీ.. ట్రైలర్ రిలీజ్)
కథేంటి?
ఇచ్చోళ గ్రామంలో అర్ధరాత్రి కాగానే హత్యలు జరుగుతుంటాయి. ఆరు నెలల నుంచి వరుసగా ఇలా అవుతుంటుంది. ఈ మర్డర్స్.. పోలీసులకు సవాల్‌గా మారుతాయి. దీంతో సాయంత్రం ఆరు గంటలు కాగానే ఎవ్వరూ బయట తిరగొద్దని గ్రామ ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తారు. ఒకానొక సమయంలో ఆ ఊళ్ళో జరిగే మల్లన్న జాతరని కూడా ఆపేయాలని పోలీసులు భావిస్తారు. మరి ఈ హత్యలకు కారణం ఎవరు? ఎందుకు చేస్తున్నారు? పోలీసులు ఆ మర్డర్ మిస్టరీను చేధించారా? అనేది మిగతా స్టోరీ.
ఎలా ఉందంటే?
గ్రామీణ నేపథ్యం బ్యాక్ డ్రాప్ స్టోరీతో రీసెంట్ టైంలో పలు సినిమాలు వస్తున్నాయి. అలా తీసిన మూవీనే ఇది. ఒగ్గు కళాకారుల కథ, కథనాలతో దీన్ని తెరకెక్కించారు. దీనికి మర్డర్ మిస్టరీ జోడించారు. ప్రారంభం నుంచి క్లైమాక్స్ వరకు వరుస హత్యలతో బెంబేలెత్తిపోయిన గ్రామంలో చివరకు ఏం జరిగిందో అనేది చూపించారు.
ఆమని తన పాత్రకు న్యాయం చేశారు. బలగం జయరాం, కొమరం, బన్నీ రాజు, కనీకా వాధ్వ తదితరులు ఆకట్టుకున్నారు. ఛత్రపతి శేఖర్ ఎప్పటిలాగే తన సహజమైన నటనతో ఆకట్టుకున్నాడు. దర్శకుడు దివంగత రాంబాబు.. ఓ గ్రామీణ నేపథ్యం ఉన్న కళకు... ఆధ్యాత్మికతను జోడించి మూవీని బాగా తీశారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. సినిమాటోగ్రఫీ పర్లేదు. గ్రామీణ వాతావరణం బాగా చూపించారు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
(ఇదీ చదవండి: ‘త్రిబాణధారి బార్బరిక్’ రివ్యూ)