
‘‘తమ జీవితం ఎలా ఉన్నా అందర్నీ నవ్వించాలనే సిద్ధాంతంతో బతుకుతున్నారు హాస్యనటులు. అందుకే కమెడియన్స్ ని ఆశీర్వదించండి.. వినోదాన్ని బతికించండి. కామెడీ బతికితే అందరూ ఆనందంగా ఉంటారు’’ అని హాస్యనటుడు బ్రహ్మానందం తెలిపారు. ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం జోడీగా విజయేందర్ ఎస్ దర్శకత్వం వహించిన చిత్రం ‘మిత్ర మండలి’.
బీవీ వర్క్స్ సమర్పణలో కల్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా.విజయేందర్ రెడ్డి తీగల నిర్మించిన ఈ సినిమా అక్టోబరు 16న విడుదల కానుంది. ఆర్‌ఆర్ ధృవన్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘జంబర్ గింబర్ లాలా..’ అంటూ సాగే మూడోపాటని బ్రహ్మానందం చేతులమీదుగా లాంచ్ చేశారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడుతూ–‘‘నేను ఈ సినిమాలో ఎలాగైనా ఉండాలని నన్ను తీసుకొచ్చాడు బన్నీ వాసు.
కడుపుబ్బా నవ్వించే హాస్య చిత్రం ‘మిత్ర మండలి’’ అని చెప్పారు. ‘‘మా సినిమా చూసి బాగా నవ్వుతారని హామీ ఇస్తున్నాను’’ అన్నారు ప్రియదర్శి. ‘‘బ్రహ్మానందంగారితో మొదటిసారి వేదికని పంచుకోవడం జీవితంలో మర్చి పోలేని క్షణం’’ అన్నారు చిత్ర సమర్పకులు బన్నీ వాసు. ‘‘నా మొదటి సినిమాలో బ్రహ్మానందంగారు ఉండటం గౌరవంగా భావిస్తున్నాను’’ అని విజయేందర్ ఎస్ తెలిపారు. విజయేందర్ రెడ్డి తీగల, నిహారిక ఎన్.ఎం, సంగీత దర్శకుడు ఆర్‌ఆర్ ధృవన్, నటులు రాగ్ మయూర్, విష్ణు, ప్రసాద్ బెహ్రా మాట్లాడారు.