'పోవే పోరా' షోతో పాపులర్ అయింది విష్ణుప్రియ (Vishnu Priya Bhimeneni). బుల్లితెర యాంకర్‌గా మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ తెలుగు బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్‌లోనూ పాల్గొంది. అప్పుడప్పుడూ కొన్ని సాంగ్స్‌లో తళుక్కుమని మెరుస్తున్న విష్ణు యాంకర్‌గా మాత్రం తెరపై పెద్దగా కనిపించడమే లేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఈ బ్యూటీ అనేక ఆసక్తికర విషయాలను పంచుకుంది.
వేరే యాంకర్స్ ఈర్ష్య
విష్ణుప్రియ మాట్లాడుతూ.. నేను యాంకర్‌గా చేసేటప్పుడు వేరే ఛానల్ యాంకర్స్ నాపై కుళ్లుకున్నారు. మేము ఇన్నేళ్లుగా కష్టపడ్డా రాని పేరు ఈమెకు అలా అడుగుపెట్టిన వెంటనే ఎలా వచ్చిందని ఈర్ష్యపడ్డారు. నాతో సరిగా ఉండేవారు కాదు. నాకు యాంకరింగ్ పర్ఫెక్ట్‌గా రాదు. కాబట్టి ఆల్బమ్ సాంగ్స్, సినిమా పాటలు చేస్తున్నాను. బిగ్‌బాస్ షోకి రమ్మని ఆహ్వానం వస్తే అస్సలు వెళ్లను. ఒక్కసారి వెళ్లినందుకే నా చెప్పు తీసుకుని కొట్టుకోవాలనిపించింది.
బిగ్‌బాస్‌పై నా అభిప్రాయం
నన్ను నేను ఎంతో తిట్టుకున్నా.. అక్కడ తిండి, నిద్ర ఏవీ ఉండవు. నాకైతే అదొక నరకమే! ఇల్లు కొనడం కోసమే బిగ్‌బాస్‌కు వెళ్లాను. కానీ ఇంకా టైల్స్ పోయిన పాతింట్లోనే ఉన్నాను. అప్పుడప్పుడు అదే బాధగా అనిపిస్తూ ఉంటుంది. నిజానికి ఆ ఇల్లును బ్యాంకువాళ్లు అమ్మేసేవాళ్లే! మా అమ్మ లోన్ కట్టలేకపోయింది. ఇండస్ట్రీకి వచ్చిన మూడేళ్లలో దాదాపు 12 లక్షల రూపాయల లోన్ మొత్తం తీర్చేశాను. మరో ఐదారు లక్షలు పెట్టి ఇంటిని పునరుద్ధరించాను. సంపాదించిదంతా ఆ ఇంటికే పోయింది.

మూడు బ్రేకప్స్
ఇప్పటివరకు మూడు బ్రేకప్స్ అయ్యాయి. మొదటగా ప్రేమించిన వ్యక్తితో పెళ్లి కూడా అయిపోతుందనుకున్నాను. కానీ, అది జరగలేదు. అయినా ఏది జరిగినా మన మంచికే అని తర్వాత అర్థమైంది. అలా అని ప్రేమ జోలికి వెళ్లననుకునేరు.. కచ్చితంగా ప్రేమ పెళ్లే చేసుకుంటా.. నన్ను పెళ్లి చేసుకునే అబ్బాయికి వేదాల గురించి తెలిసుండాలి. సింగింగ్, డ్యాన్స్ వచ్చుండాలి. వంట రావాలి. అలాంటి అబ్బాయి నాకు తారసపడితే పెళ్లి చేసుకుంటా.. లేదంటే సన్యాసం పుచ్చుకుంటాను. 50 ఏళ్లు వచ్చేసరికి కాశీకి వెళ్లిపోదామా? అన్న ఆలోచనలు కూడా ఉన్నాయి.
అమ్మకు డయాబెటిస్
నా చిన్నతనంలోనే అమ్మానాన్న విడిపోయారు. అమ్మకు ఇష్టం లేదని నాన్నతో మాట్లాడేదాన్ని కాదు. అమ్మ డయాబెటిస్ రోగి. సరిగా మందులు వేసుకునేది కాదు. ఒకరోజు హార్ట్ స్ట్రోక్ రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లాం. మూడు రోజుల కంటే ఎక్కువ బతకదన్నారు. దేవుడి దయ వల్ల ఏడాదివరకు బతికింది. అమ్మ ఆస్పత్రిపాలైనప్పుడు లక్షల్లో బిల్లయింది. నా దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ అయిపోవడంతో మొహమాటం వదిలేసి తెలిసినవాళ్లకు ఫోన్ చేసి డబ్బు సాయం అడిగాను. హాస్పిటల్ బిల్లు కట్టడం కోసమే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాను. 42 ఏళ్లకే అమ్మ చనిపోయింది. రెండేళ్లపాటు డిప్రెషన్‌కు లోనయ్యాను. అమ్మను తీసుకెళ్లి నన్నెందుకు ఉంచావని దేవుడిని తిట్టుకున్నాను.
డిప్రెషన్‌లో..
నేను బాధపడ్డ మరో సందర్భం.. నాపై మార్ఫ్‌డ్ వీడియోలు చేశారు. దాన్ని వాట్సాప్‌లో షేర్ చేశారు. అది చూడటానికి నిజందానిలాగే ఉంది. తట్టుకోలేకపోయాను. ఆరు నెలల నుంచి ఏడాదిపాటు డిప్రెషన్‌కు వెళ్లిపోయాను. సరిగ్గా అదే సమయంలో ఫేస్‌బుక్ హ్యాకై అశ్లీల పోస్టులు పెట్టారు. నేనెక్కడికి వెళ్లినా.. నీదో వీడియో చూశామని అబ్బాయిలు కామెంట్ చేసేవారు. అమ్మ పెంపకం వల్ల ధైర్యంగా నిలబడ్డా.. లేదంటే ఎప్పుడో చచ్చిపోయేదాన్ని అని విష్ణుప్రియ చెప్పుకొచ్చింది.
చదవండి: బిగ్‌బాస్ స్టేజీపై రష్మిక.. భరణి సిగ్గు చూస్తే నిజంగా..


