బిగ్‌బాస్ సీజన్-9లో పదో వారం నామినేషన్స్ పూర్తి అయ్యాయి. సీజన్ కూడా అయిపోవస్తుంది. కానీ, హౌస్‌లోని కంటెస్టెంట్స్ మాత్రం నామినేషన్‌లో కూడా చెత్త పాయింట్లతోనే ముగించేశారు. దీంతో బిగ్‌బాస్‌కు కూడా చిరాకు అనిపించినట్లుంది. హౌస్‌లో వారి ఆటకు తిక్కరేగిన బిగ్‌బాస్ సూపర్ ట్విస్ట్‌తో అందరికీ షాకిస్తూ.. కెప్టెన్ ఇమ్మాన్యుయేల్ మినహా ఈ వారం అందరినీ ఎలిమినేషన్‌లో నిలబెట్టాడు. 9 వారాలుగా ఇమ్ము ఎలిమినేషన్‌లో లేడంటూ రీసెంట్ ఎపిసోడ్‌లో నాగార్జున గుర్తుచేశారు. ఇదే క్రమంలో అతన్ని నామినేషన్‌లో పెట్టమని పరోక్షంగా బిగ్‌బాస్ రంగంలోకి దిగి ఛాన్స్ ఇస్తే దానిని కూడా హౌస్‌లో ఎవరూ ఉపయోగించుకోలేదు. ఇలా చెత్తగా నామినేషన్ ప్రక్రియను ముగించేశారు.
తనూజ కోసం భరణి అంటూ ఇమ్మూ ఫైర్
బిగ్‌బాస్ హౌస్‌లో ఆరు వారాల ఆట మాత్రమే ఉంది. ప్రస్తుతం హౌస్‌లో 11మంది ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఒక్కరిని మాత్రమే నామినేట్ చేయాలని.. అందుకోసం ఐదు నిమిషాల టైమ్ లిమిట్ ఇచ్చాడు. నామినేట్ అయిన వారు అక్కడొక కుర్చీలో కూర్చుంటే బురదనీళ్లు వచ్చి వారి మీద పడుతాయి. మొదట ఇమ్మాన్యుయేల్ నామినేషన్ ప్రక్రియ మొదలుపెడుతాడు. భరణిని నామినేట్ చేస్తూ.. కెప్టెన్సీ టాస్క్‌లో మీరు తనూజ కోసం గివప్ చేయడం నచ్చలేదనే పాయింట్ తెరపైకి తెస్తాడు. మీకంటే తనూజనే బెస్ట్ ప్లేయర్ అని ఒప్పుకోవడం ఏంటి అంటూ భరణిని ప్రశ్నిస్తాడు. ఈసారి కొత్త భరణిని చూస్తారన్నారని రీఎంట్రీ ఇచ్చారు. కానీ, రోజురోజుకి ఆ ఫైర్ కనిపించడంలేదంటూ ఇమ్మూ ఫైర్ అవుతాడు. అయితే, భరణి సరైన సమాధానాలు చెప్పలేకపోయాడు. అయితే, ఎక్కువ మంది గౌరవ్, నిఖిల్‌ను నామినేషన్ చేస్తూ సేఫ్ గేమ్ ఆడారు.

దివ్యను నామినేషన్ చేసిన భరణి
ఈ వారం నామినేషన్‌లో ప్రత్యేకత ఏదైనా ఉందంటే.. దివ్యను భరణి నామినేట్ చేయడమని చెప్పాలి. ఈ క్రమంలో భరణి ఇలా చెప్తాడు. 'నా గేమ్ నీ వల్ల పాడవ్వలేదు.. నేను నీ వల్ల హౌస్ నుంచి బయటికి వెళ్లలేదనేది నాకు మాత్రమే తెలుసు. కానీ, హౌస్‌మేట్స్ మాత్రం దివ్య వల్లనే భరణి వెళ్లారు అనుకుంటున్నారు. అది తప్పని ప్రూ చేయాల్సిన బాధ్యత నీపైన కూడా ఉంది కదా.. కాబట్టి నువ్వు నామినేషన్‌కి వెళ్లి సేఫ్‌గా వచ్చి ప్రూ చేసుకో..' అంటూ భరణి చెప్పాడు. దీంతో దివ్య కౌంటర్ గట్టిగానే ఇస్తుంది. నా వల్ల మీ గేమ్ పాడైందా..? ఇది ఏ రకమైన కారణం..? అంటూ భరణిపై విరుచుకుపడింది. నా వల్ల మీరు హౌస్ నుంచి వెళ్లిపోలేదనే విషయంలో మీకు క్లారిటీ ఉన్నప్పుడు నన్ను ఎందుకు నామినేట్ చేస్తున్నారు. మీరు వెళ్లిపోయింది నా వల్లే అని ఎవరూ అనలేదు బాండింగ్స్‌లో నేను ఒక్కదాన్నే ఉన్నానా.. అని దివ్య ఫైర్ అయింది. ఇలా ఇద్దరి మధ్య మాటల యుద్దం గట్టిగానే నడిచింది.
భరణి మాత్రమే ప్రత్యేకం
నామినేషన్స్ తంతు ముగిసిన తర్వాత బిగ్ బాస్ ఒక పెద్ద ట్విస్ట్ ఇస్తూ.. ఈ వారం హౌస్‌లో ఉన్న ప్రతి ఒక్కరినీ నామినేట్ చేస్తున్నట్లు ప్రకటించాడు. అయితే, కెప్టెన్ ఇమ్మాన్యుయేల్‌కి మినహాయింపు ఇవ్వాలా, వద్దా అనేది సీక్రెట్ ఓటింగ్‌తో నిర్ణయించమని కోరుతాడు. అప్పటికీ కూడా ఎవరూ ఇమ్మూను నామినేట్ చేయలేదు. కేవలం భరణి మాత్రమే ఇమ్మాన్యుయేల్‌ను నామినేషన్‌లో ఉంచాలని ఓట్ వేస్తాడు. మిగిలిన అందరూ ఇమ్మూకు మద్దతు తెలుపుతూ నామినేషన్స్ నుంచి తప్పిస్తారు. దీంతో ఈ వారం ఇమ్మాన్యుయేల్‌ను మినహాయించి హౌస్‌లో ఉన్న అందరూ నామినేషన్ లిస్ట్‌లోకి వచ్చారు.


