
బిగ్‌బాస్ షో (Bigg Boss 9 Telugu)లో మొదటివారం నామినేషన్స్ సిల్లీగా ఉంటాయి. ఆమె నాతో మాట్లాడలేదు, తన దగ్గర పాజిటివ్ వైబ్స్ రావడం లేదు, ఆయన సరిగా ఇల్లు తుడవలేదు, నాకింకో ఆప్షన్ లేదు అంటూ నామినేట్ చేస్తూ ఉంటారు. ఈసారి మాత్రం మీ అందరికీ బలమైన పాయింట్ అందించేందుకు నేనున్నానంటూ సంజనా గల్రానీ అభయమిచ్చింది. చీటికిమాటికి చిరాకు పడుతూ, గొడవలతో విసుగు తెప్పిస్తూ అందరికంట్లో పడింది.
నీ పనిమనిషినా?
ఇంకేముంది ఓనర్స్ అందరూ కలిసి సంజనాను ఏకాభిప్రాయంతో నామినేట్ చేశారు. తర్వాత వాష్‌రూమ్ దగ్గర రచ్చ మొదలైంది. కండీషనర్, షాంపూ బాత్రూంలో పెట్టకండి, బయటపెట్టుకోండి అని ఫ్లోరా చెప్తుంటే సంజనా అడ్డంగా వాదించింది. విసుగెత్తిన ఫ్లోరా.. నేనేమైనా నీ పనిమనిషినా? బాత్రూమ్ క్లీన్ చేసే బాధ్యత నాకు అప్పగించారు. క్లీన్ చేయడానికి వెళ్లిన ప్రతిసారి అవి తీసి బయటపెట్టాలా? అని నిలదీసేసరికి సంజనా కోపం నషాళానికంటింది. మ్యానర్స్ లేదు, అదీ ఇదీ అని చెడామడా తిట్టేసరికి ఫ్లోరా ఏడ్చేసింది.
ఫుటేజ్ కోసమా?
అదంతా చూసిన శ్రీజ.. ఫుటేజ్ కోసమే సంజనా ఇంత సీన్ చేస్తుందని కామెంట్ చేసింది. ఆ మాటతో అగ్గిమీద గుగ్గిలమైన సంజనా.. ఏమన్నావ్? ఫుటేజ్ కోసమా? నా ముందు వేలు చూపించి మాట్లాడకు అని వార్నింగ్ ఇస్తూనే చీప్ అని తిట్టింది. తర్వాత కూడా ఇమ్మాన్యుయేల్‌తో శ్రీజను చూపిస్తూ అది సైకో, దాన్ని చూస్తేనే చిరాకు అని చీదరించుకుంది తర్వాత టెనెంట్స్‌లో మీలో ఒకర్ని మీరే నామినేట్ చేసుకోవాలన్నాడు బిగ్‌బాస్. పోటీదారులు ఇద్దరు టన్నెల్స్‌లో పాకుతూ వెళ్లి అక్కడున్న సుత్తిని అందుకోవాలి.
రీతూ తలకు గాయం
సుత్తిని అందుకున్నవారు నామినేషన్స్ చేస్తారు. ఈ ప్రక్రియలో రీతూ పాకుతూ ఉండగా పక్కనే ఉన్న పోల్ తగలడంతో దెబ్బ తగిలింది. దాంతో ఆమెను మెడికల్ రూమ్‌కు పిలిచి తలకు కట్టు కట్టారు. తనూజ.. సంజనాను, రాము.. సుమన్ శెట్టిని నామినేట్ చేశారు. ఎక్కువగా మౌన వ్రతంలోనే ఉంటున్న సుమన్.. ఎట్టకేలకు నిన్న నోరు విప్పాడు. కానీ సరిగా డిఫెండ్ చేసుకోలేకపోయాడు. మిగతా నామినేషన్స్ నేటి ఎపిసోడ్‌లో కొనసాగనున్నాయి.
చదవండి: నా సినిమా.. అలా చేస్తే ఇండస్ట్రీ వదిలేస్తా: బెల్లంకొండ