
బిగ్‌బాస్ 9 (Bigg Boss 9 Telugu) మొదలైంది. ఈసారి చదరంగం కాదు రణరంగమే అని నాగార్జున అన్నది కంటెస్టెంట్లు బాగా వంటపట్టించుకున్నట్లున్నారు. మొదటి రోజే గొడవపడ్డారు. మాస్క్ మ్యాన్ హరీశ్, కమెడియన్ ఇమ్మాన్యుయేట్ మధ్యే ఈ గొడవ జరిగింది. ఈ గొడవకు కారణం కూడా ఓ రకంగా బిగ్‌బాస్ అనే చెప్పాలి! సెలబ్రిటీలను కామనర్స్‌గా, కామనర్స్‌ను సెలబ్రిటీలుగా మార్చేశాడు బిగ్‌బాస్. సెలబ్రిటీలతో పనులు చేయించడమే కాక, ప్రధాన హౌస్‌లోకి వెళ్లకూడదని ఆజ్ఞాపించాడు. నోటి కాడ కూడును లాక్కున్నాడు కూడా!
ఒక్క పూట అన్నం కోసం..
వాళ్లకు వండిపెట్టాలని చెప్పానే తప్ప తినమని ఎవరు చెప్పారన్నట్లుగా సరిగ్గా ప్లేటు ముందు పెట్టుకున్న సమయంలో ఆ ఫుడ్‌ను లోపల పెట్టేయమన్నారు. దీంతో తొమ్మిది మంది సెలబ్రిటీలు చేసేదేం లేక కళ్లతోనే భోజనాన్ని ఆస్వాదించి తిండి మాని పస్తులున్నారు. ఇది హరీశ్ తట్టుకోలేకపోయాడు. తిండి లాక్కోవడం తప్పంటూ బిగ్‌బాస్‌కే క్లాస్ పీకాడు. వాళ్లు తినేవరకు తానూ తినేది లేదని భోజనం ప్లేటు మీద నుంచి లేచాడు. అంతేకాదు, బ్రదర్ నేనున్నా అంటూ సెలబ్రిటీలకు అరటిపండ్లు పట్టుకెళ్లాడు. దాంతో బిగ్‌బాస్ మరోసారి వారించాడు.
గుండు అంకుల్.. బెడిసికొట్టిన కామెడీ
వారిని పస్తులుంచడం తట్టుకోలేని హరీశ్ కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. అయినా బిగ్‌బాస్ మరీ అంత చెడ్డోడు కాదులే.. ఏదో కాసేపు అలా తినొద్దని భయపెట్టినా తనే స్వయంగా ఫుడ్ పంపించాడు. అంటే కామనర్లకు సెలబ్రిటీలు వండిపెడ్తే.. సెలబ్రిటీలకు బిగ్‌బాస్ ఆహారం పంపిస్తాడన్నమాట! ఇకపోతే ఇమ్మాన్యుయేల్ ఏదో కామెడీ చేద్దామని ప్రయత్నించాడు. హరీశ్‌ను గుండు అంకుల్ అన్నాడు. మొదట ఆయన పట్టించుకోలేదు, కానీ రెండుమూడు సార్లు అనేసరికి చూసుకుని మాట్లాడాలి బ్రదర్.. ఎవరు గుండు? ఎవరు అంకుల్? అని ఫైరయ్యాడు.
బాడీ షేమింగ్
అప్పటికే హర్ట్ అయ్యాడని గమనించిన ఇమ్ము.. అన్నా సారీ చెప్పా కదా అని సముదాయించాడు. అయినా తగ్గని హరీశ్.. లిమిట్‌లో ఉండు, బాడీ షేమింగ్ చేయొద్దని హెచ్చరించాడు. నచ్చితే గుండెల్లో పెట్టుకుంటా, నెత్తిమీద ఎక్కాలని చూస్తే తొక్కిపడేస్తా అని వార్నింగ్ ఇచ్చాడు. ఇలా చాలాసేపు వీరిమధ్య ఫైట్ నడిచింది. ఆయన గుండు చేయించుకుందే బిగ్‌బాస్ కోసం! అగ్నిపరీక్ష షోలో అరగుండు చేయించుకోమనగానే క్షణం ఆలోచించకుండా సగభాగం షేవ్ చేసుకున్నాడు. అతడిని ధైర్యాన్ని మెచ్చిన బిందుమాధవి.. మరీ అరగుండుతో ఎంతకాలం ఉంటావని పూర్తిగా క్లీన్ షేవ్ చేసింది.
అపరిచితుడు బయటకొచ్చేశాడు
ఇక బిగ్‌బాస్ షో అంతా అరగుండుతోనే ఉండాలని హరీశ్‌కు కండీషన్ కూడా పెట్టారు. ఈయన ఒక్కరోజులోనే తినమని ప్రేమ, తిననందుకు కన్నీళ్లు, తనపై కామెడీ చేసినందుకు కోపం.. ఇలా అన్నీ చూపించాడు. లైవ్‌లో అయితే వయసెంత అని అడిగితే తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా అంటూ సరదాగా ఉన్నాడట! మొత్తానికి మొదటిరోజే అపరిచితుడిని చూసేశామన్నమాట!
చదవండి: రోడ్డు ప్రమాదంలో కాజల్ అగర్వాల్.. తాను క్షేమం అంటూ పోస్ట్