
బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) ఏ ముహూర్తాన కామనర్స్‌ను ఓనర్లు చేశారో కానీ వాళ్లు తెగ రెచ్చిపోతున్నారు. బిగ్‌బాస్ హౌస్ అంతా మాదే అన్నట్లుగా జులుం చూపిస్తున్నారు. టెనెంట్లు.. అదేనండి సెలబ్రిటీలను పనివాళ్లుగా హీనంగా చూస్తున్నారు. మర్యాద మనీష్ అయితే తనో పెద్ద తోపుగా ఫీలవుతున్నాడు. మొన్న రాము రాథోడ్ ఏదో చెప్పడానికి వస్తుంటే కూడా నేను నిన్ను నమ్మను, సింపథీ ఆడతావ్.. అదీ,ఇదీ అంటూ తనను చీదరించుకున్నాడు. నిన్నటి ఎపిసోడ్‌లో అయితే సంచాలక్‌గా ఫెయిలవడమే కాకుండా ఇమ్మాన్యుయేల్‌ను నానామాటలన్నాడు. అసలేం జరిగిందో చూద్దాం..
ఐదుగురు కెప్టెన్సీ కంటెండర్లు
బిగ్‌బాస్ సంజన (Sanjana Galrani)ను కన్ఫెషన్ రూమ్‌కు పిలిచి ఐదుగురిని కెప్టెన్సీ కంటెండర్లుగా ఎంపిక చేసుకోమన్నాడు. ఆమె తన పేరుతో పాటు హరీశ్, డీమాన్ పవన్, ఇమ్మాన్యుయేల్, శ్రష్టిలను సెలక్ట్ చేసింది. అయితే ఇక్కడే బిగ్‌బాస్ ఓ ట్విస్ట్ ఇచ్చాడు. కెప్టెన్ అవ్వాలంటే గేమ్ ఆడాల్సింది కంటెండర్లు కాదు, వారికి సపోర్ట్‌గా నిలబడేవారని బిగ్‌బాస్ చెప్పాడు. అలా శ్రష్టి కోసం రాము, ఇమ్మాన్యుయేల్‌కు భరణి, సంజనకు శ్రీజ, పవన్‌కు ప్రియ, హరీశ్‌కు పవన్ కల్యాణ్ సపోర్ట్‌గా వచ్చారు.

సంచాలక్‌గా మర్యాద మనీష్
వీళ్లకు వదలకు బెదరకు టాస్క్ ఇచ్చారు. ఈ గేమ్‌లో భాగంగా గార్డెన్ ఏరియాలో ఉంచిన గోడకు రాడ్స్ ఉంటాయి. నేలకు ఆనకుండా వాటిని పట్టుకుని ఉండాలి. కంటెండర్స్‌ను సంచాలక్ ఇష్టానుసారంగా పిలుస్తూ ఉంటాడు. గ్రీన్ లైట్ పడ్డప్పుడు వారు ఒక రాడ్ తీసేయాల్సి ఉంటుంది. ఈ గేమ్‌కు మనీష్ సంచాలకుడు. మొదట రాడ్ తీసే ఛాన్స్ డీమాన్ పవన్‌కు ఇచ్చాడు. అయితే రెడ్ సిగ్నల్ ఉండటంతో అతడిని ఆపి గ్రీన్ లైట్ పడ్డాక తీయమన్నాడు.
ఇమ్మాన్యుయేల్‌ను ఎలిమినేట్ చేసిన సంచాలక్
శ్రష్టికి కూడా అలాగే చెప్పాడు. తర్వాత ఇమ్మాన్యుయేల్ వెళ్లినప్పుడు మాత్రం ఏమీ చెప్పకుండా నిల్చుండిపోయాడు. అతడు కూడా రెడ్ సిగ్నల్ చూసుకోకుండా రాడ్ తీసేశారు. దాంతో సంచాలక్ మనీష్.. ఇమ్మాన్యుయేల్ టీమ్‌ను ఎలిమినేట్ చేశాడు. నేను వెళ్లినప్పుడు మీరు ఆపాలి కదా.. కనీసం నేను రాడ్ పట్టుకున్నప్పుడైనా చెప్పాలిగా అని నిలదీశాడు. నేను చెప్పేవరకు ఆగలేదంటూ మనీష్ నసిగాడు.
సంచాలక్‌గా ఫెయిల్
ఇమ్మూ ఆవేశంతో సంచాలక్‌గా ఫెయిల్, మీరు వాళ్లకు సపోర్ట్ చేశారు, అన్‌ఫెయిర్ అంటూ అని మనీష్‌ను తిట్టిపోశాడు. అందుకు మనీష్.. నువ్వు కంటెస్టెంట్‌గా ఫెయిల్, వచ్చాడు పెద్ద ప్లేయర్.. వైల్డ్ కార్డులను తీసుకోండి అని బిగ్‌బాస్‌కే సలహాలు ఇచ్చాడు. అతడి ప్రవర్తన చూస్తుంటే శ్రీముఖి ఎందుకితడిని హౌస్‌లోకి పంపించిందిరా బాబూ అని ప్రేక్షకులు తల పట్టుకుంటున్నారు. ఇలా గొడవలు జరుగుతుండగానే ఎపిసోడ్ పూర్తయింది. అయితే ఇప్పటికే అందుతున్న లీకుల ప్రకారం సంజన ఫస్ట్ కెప్టెన్ అయింది. మరోవైపు సంజనా.. సుమన్ సిగరెట్స్ దాచేసింది. అతడు ఎంత బతిమాలుతున్నా తాను దాచిపెట్టలేదంటూ అబద్ధమాడి ఏడిపిస్తోంది.
చదవండి: ఎంతమంది వద్దన్నా లక్ష్మణ రేఖ నాకే వచ్చింది: నటి జయసుధ