సరిపోదా శనివారం అన్నట్లు నాగార్జున.. తనూజకు ఒక్కదానికే స్పెషల్‌గా సండేరోజు క్లాస్ పీకారు. దాన్ని క్లాస్ పీకడం అని కూడా అనరు. ఎక్కువగా కోప్పడకు, చెప్పే విధానం మార్చుకో, సహనంగా ఉండటానికి ప్రయత్నించు అని తనూజను బుజ్జగించినట్లే ఉంది. ఎలిమినేషన్‌ను మలుపు తిప్పే అస్త్రం తనూజ దగ్గర ఉన్నప్పటికీ దాన్ని వాడకుండా భద్రంగా కాపాడుకుంది. మరి ఆదివారం (నవంబర్ 2వ) ఎపిసోడ్‌లో ఏం జరిగాయో చూసేద్దాం..
పర్ఫామెన్స్ ఇరగదీశారు
ది గర్ల్‌ఫ్రెండ్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా రష్మిక, దీక్షిత్ శెట్టి బిగ్‌బాస్ షోకి వచ్చారు. వీళ్ల ఎదుటే హౌస్‌మేట్స్‌తో కొన్ని సీన్స్ రీక్రియేట్ చేయించారు. వాళ్ల యాక్టింగ్ చూసి రష్మిక కొన్నిసార్లు నోరెళ్లబెట్టేసింది. యాక్టింగ్‌లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ఇమ్మాన్యుయేల్ ఎగరేసుకుపోయాడు. ఇక నామినేషన్స్‌లో ఉన్న అందరినీ నాగార్జున సేవ్ చేసుకుంటూ రాగా చివరకు గౌరవ్, మాధురి మిగిలారు. గౌరవ్, మాధురి.. ఇద్దర్నీ గేటు బయటకు తీసుకొచ్చాక హౌస్‌మేట్స్‌తో ఓ విషయం చెప్పాడు నాగ్.
కాళ్లు పట్టుకున్న రాము
ఓట్ల పరంగా మాధురి చిట్టచివరి స్థానంలో ఉందన్నాడు. అయితే తనూజ దగ్గరున్న గోల్డెన్ బజర్ ఉపయోగించి మాధురిని సేవ్ చేస్తే గౌరవ్ ఎలిమినేట్ అవుతాడని వెల్లడించాడు. అప్పటికే గౌరవ్‌ను నామినేట్ చేసి కుంగిపోతున్న రాము.. అతడ్ని కాపాడమని తనూజ కాళ్లావేళ్లా పడ్డాడు. చివరకు తనూజ గోల్డెన్ బజర్ ఉపయోగించకపోయేసరికి మాధురి ఎలిమినేట్ అయినట్లు ప్రకటించి గౌరవ్‌ను ఇంట్లోకి పంపారు. ఈ సంతోషం పట్టలేక రాము.. తనూజ కాళ్లు మొక్కడం గమనార్హం. మాధురి సంతోషంగానే బయటకు వచ్చేసింది.

నా బంగారం తనూజ: మాధురి
ఎలిమినేట్ అవుతారనుకున్నారా? అని నాగ్ అడగ్గా.. బయటకు రావాలనే కోరుకున్నా.. ఎందుకంటే నవంబర్ 4న మా ఆయన బర్త్‌డే సార్.. అంటూ మాధురి అసలు విషయం చెప్పింది. తన ఏవీ చూసుకుని లైఫ్‌లాంగ్ మెమొరీ అని ఎమోషనలైంది. ముగ్గురికి గులాబీలు, ముగ్గురికి ముళ్లు ఇవ్వమని మాధురికి టాస్క్ ఇచ్చారు. మొదటి గులాబీ.. నా బంగారం తనూజకి ఇస్తా.. తను చాలా స్వీట్, నేను బయట ఉన్నప్పుడు తనూజ మాస్క్‌తో ఆడుతుంది, సీరియల్ యాక్టింగ్ చేస్తుందన్నారు. అంతా అబద్ధం, తను తనలాగే ఉంది అని కంటతడి పెట్టుకుంది. డిమాన్ పవన్, పవన్ కల్యాణ్‌కు సైతం రోజాలు ఇచ్చింది.
100%ఫేక్
ముళ్ల గురించి అడగ్గానే మొదటిది భరణికి ఇస్తానంది. 100% ఫేక్ ఎవరైనా ఉన్నారంటే అది భరణి గారే.. హౌస్‌లో ఉండటానికి తనకు అర్హత లేదు అని కుండబద్ధలు కొట్టి చెప్పింది. దివ్య కూడా అంతే.. తన గేమ్ కంటే పక్కవాళ్ల గేమ్‌పైనే ఎక్కువ శ్రద్ధ పెడుతుంది. వాళ్ల గొంతు కూడా తనే అయిపోతుంది. అవి తగ్గించుకుని ఆడితే బెటర్ అని పేర్కొంది. వెళ్లిపోయేముందు.. తనూజ, నేనొక్కటే కోరుకుంటున్నా.. నువ్వు స్ట్రాంగ్‌గా, నవ్వుతూ ఉండాలి. విన్నర్‌గా చూడాలి.. నువ్వు గెలిస్తే నేను గెలిచినట్లే అని చెప్పి వీడ్కోలు తీసుకుంది.
చదవండి: బిగ్‌బాస్ నుంచి 'మాధురి' ఎలిమినేట్.. భారీగా రెమ్యునరేషన్


