
అధ్యక్షా.. డైలాగ్‌తో పాపులర్ కాదు సెన్సేషన్ అయ్యాడు కమెడియన్ సుమన్ శెట్టి (Suman Shetty). ఒకప్పుడు వెండితెరపై ఓ వెలుగు వెలిగిన ఇతడు ఈ మధ్యకాలంలో సైలెంట్ అయిపోయాడు. చాలాకాలం తర్వాత మరోసారి ప్రేక్షకులకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నాడు. కాకపోతే ఈసారి సినిమా ద్వారా కాదు, బిగ్‌బాస్ షో ద్వారా! తెలుగు బిగ్‌బాస్ 9వ సీజన్ (Bigg Boss 9 Telugu)లో అడుగుపెట్టిన సుమన్ శెట్టి తన జర్నీ గురించి ఇలా చెప్పుకొచ్చాడు.
తొలి సినిమాకే నంది అవార్డు
అధ్యక్షా.. నన్ను గుర్తుపట్టారా? సుమన్‌శెట్టిని.. చిన్నప్పటినుంచే సినిమాలంటే పిచ్చి. ఇంటర్ పూర్తయ్యాక ఓ మ్యాగజైన్‌లో కొత్త ఆర్టిస్టులు కావాలన్న ప్రకటన చూసి వెంటనే హైదరాబాద్ వెళ్లాను. దర్శకుడు తేజ నన్ను ఆడిషన్ చేసి సెలక్ట్ చేశారు. జై మూవీతో కెరీర్ మొదలైంది. ఫస్ట్ సినిమాకే నంది అవార్డు గెలిచాను. జయం, జై, సంబరం, ఔనన్నా కాదన్నా, ధైర్యం, నిజం సినిమాల్లో అవకాశాలిచ్చి తేజ గారు నాకు గాడ్ ఫాదరయ్యారు.
300 సినిమాలు
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, భోజ్‌పురి భాషల్లో దాదాపు 300 సినిమాలు చేశాను. అలా సినిమాలు చేస్తుండగా ఇంట్లోవాళ్లు నాకు పెళ్లి చేశారు. నాకు ఓ కూతురు, కొడుకు సంతానం. 2019లో మా నాన్న చనిపోయారు. నాన్న లేకపోయేసరికి ఒంటరితనం ఆవరించింది. నీ కెరీర్ మళ్లీ మొదలుపెట్టు అని అమ్మ తోడుగా నిలిచింది. బిగ్‌బాస్‌తో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెడతాను. బిగ్‌బాస్ హౌస్‌లో ఈ సుమన్ శెట్టి ఆటేంటో చూపిస్తా అన్నాడు సుమన్ శెట్టి. మరి ఈ కమెడియన్ బిగ్‌బాస్‌లో ఎంతమేరకు మెప్పిస్తాడో చూడాలి!