
నాన్న ఎందుకో వెనకబడ్డాడు. బంధాల మధ్యలో చిక్కుకుని బయటకు రాలేక అవస్థ పడ్డాడు. కూతురు, తమ్ముడు, సోదరుడు, స్నేహితుడు.. ఇలాంటి బంధాల్లో కూరుకుని నిండా మునిగిపోయాడు. బిగ్‌బాస్ ఆటను మర్చిపోయి తనకంటూ ఓ కుటుంబాన్ని ఏర్పరుచుకున్నాడు. అదే ఆయన ఎలిమినేషన్‌కు తొలి, చివరి కారణం!
తన కోసం తగ్గిన భరణి
బిగ్‌బాస్ షో (Bigg Boss Telugu 9) ప్రారభమైన మొదటివారం భరణి మాటతీరు చాలామందికి నచ్చింది. తర్వాతి వారం ఆటతీరు నచ్చింది. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. తనూజ.. నాన్న, నాన్న అంటూ వెనకపడటంతో ఆమె కోసం కొన్నిచోట్ల తగ్గాల్సి వచ్చింది. నాన్న.. నాకోసం నిలబడతాడు, నాకోసం ఏదైనా చేస్తాడు అంటూ గంపెడాశలు పెట్టుకున్న తనూజ కోసం కొన్నిసార్లు ఆటలో వెనకడుగు వేయాల్సి వచ్చింది. అటు రాము రాథోడ్‌ను కొడుకులా దగ్గరకు తీసుకున్నాడు. అతడికి ఇచ్చిన మాట ప్రకారం కెప్టెన్ కూడా చేశాడు.
టాప్ 1 అని..
కానీ, అదే సమయంలో రీతూకు సైతం సాయం చేస్తానని మాటిచ్చి నిలబెట్టుకోలేనందుకు నానామాటలు పడ్డాడు. ఇంతలో అగ్నిపరీక్ష నుంచి వైల్డ్‌కార్డ్‌గా సరాసరి హౌస్‌లోకి వచ్చింది దివ్య. వచ్చీరావడంతోనే భరణి (Bharani Shankar)ని నెం.1 స్థానంలో నిలబెట్టింది. అందరూ తనే టాప్ 1 అని పైకి లేపేసరికి పొంగిపోయాడు. దివ్యను ఇంకో కూతురిగా చూసుకున్నాడు. తనకు ఎదురొచ్చినవారు ఎలిమినేట్ అవుతున్నారంటూ సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నాడు.
ఆ పని చేసుంటే..
కానీ, రోజురోజుకీ తన గ్రాఫ్ పడిపోతుందని అర్థం చేసుకోలేకపోయాడు. బంధాలు పెట్టుకోవడానికి రాలేదు, గేమ్ ఆడండి అని నాగార్జున పదేపదే హెచ్చరించినా దాన్ని పెడచెవిన పెట్టాడు. తమ్ముడు తమ్ముడే.. పేకాట పేకాటే అన్న చందంగా భరణి గేమ్ ఆడుంటే ఇప్పటికీ టాప్ ప్లేస్‌లో ఉండేవాడు. కానీ బంధాలతో నోరు కట్టేసుకున్నాడు, తనకు తానే ఓ బందీ అయిపోయాడు. దీనికి తోడు భరణికి భుజం నొప్పి కూడా ఉంది. ఎలాగో వైల్డ్ కార్డ్స్ వచ్చారు కాబట్టి, ఇక అతడితో పని లేదని భావించిన ప్రేక్షకులు అతడిని బయటకు పంపించేశారు.
చదవండి: బోరుమని ఏడ్చిన తనూజ, దివ్య.. ఆ ఒక్కడికి సారీ చెప్పిన భరణి!