సినిమా బ్యానర్‌ మార్చి ఓటీటీకి.. సహా నిర్మాతపై ఫిర్యాదు

Ardhashathabdam Movie Producer Complaint On Co Producer In Banjara Hills PS - Sakshi

సాక్షి, బంజారాహిల్స్‌: తనకు తెలియకుండా సినిమా బ్యానర్‌ను మార్చి ఓటీటీకి అమ్ముకున్న సహ నిర్మాతపై చర్యలు తీసుకోవాలని ఓ సినీ నిర్మాత బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. సౌత్‌ సిల్వర్‌ స్క్రీన్‌ స్టూడియోస్‌ ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై ఎం.అయిలయ్య, చిట్టి కిరణ్‌ రామోజు ఇద్దరు నిర్మాతలుగా అర్ధశతాబ్ధం అనే సినిమాను నిర్మించారు. ఈ సినిమా షూటింగ్‌ 2019 నుంచి 2020 వరకు కొనసాగింది. అయితే కోవిడ్‌ కారణంగా కొన్ని దృశ్యాలను చిత్రీకరించలేదు. అదే సమయంలో అయిలయ్య తన స్వగ్రామానికి వెళ్లారు. ఇదే అదునుగా కిరణ్‌ తన స్నేహితులను మరికొంత మందిని కలుపుకొని తన సినిమా బ్యానర్‌ను పక్కనబెట్టి రిషితశ్రీ క్రియేషన్స్‌ ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌గా మార్చారని ఫిర్యాదు పేర్కొన్నారు.

అంతేగాక తమ ఇద్దరితో ఉన్న జాయింట్‌ అకౌంట్‌ను మార్చుకొని మరో బ్యాంక్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేసి తనను మోసం చేయడమే కాకుండా ఆ సినిమాను ఆహా ఓటీటీకి అమ్ముకున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. విషయం తెలిసిన తాను ఇదేమిటని కిరణ్‌ను ప్రశ్నిస్తే పెట్టుబడి డబ్బులు ఇస్తానని గత కొన్ని నెలల నుంచి తిప్పుకున్నాడని, తీరా విడుదల సమయం దగ్గరపడ్డాక ఇవ్వనుపో అంటూ బెదిరిస్తున్నాడని ఆరోపించారు. తనను మోసం చేసిన కిరణ్‌ రామోజుపై చీటింగ్‌ కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

చదవండి: 
ఆహాలో వరల్డ్‌ ప్రీమియర్‌గా ‘అర్థ శతాబ్దం’
'ఉప్పెన' దర్శకుడికి బెంజ్‌ కారు గిఫ్ట్‌

 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top