
పవన్ కల్యాణ్ ఓజీ మూవీకి ఏపీ ప్రభుత్వం మరో వెసులుబాటు కల్పించింది. ఈ సినిమా కోసం ప్రత్యేక జీవోను జారీ చేసింది. గతంలో ఎన్నడు లేని విధంగా ప్రీమియర్ షోలకు అనుమతి ఇచ్చింది. ముందుగా అర్ధరాత్రి ఒంటిగంటకు బెనిఫిట్ వేసుకోవచ్చని జీవో జారీ చేసిన ఏపీ ప్రభుత్వం.. తాజాగా రిలీజ్‌కు ముందు రోజే రాత్రి 10 గంటలకు ప్రీమియర్ షోలకు ప్రత్యేకంగా అనుమతులు ఇస్తూ జీవోను విడుదల చేసింది.
ఒక్కో టికెట్ రూ.1000..
ఇప్పటికే బెనిఫిట్ షో టికెట్ ధరను భారీగా పెంచారు. ఏకంగా ఒక్కో టికెట్ వెయ్యి రూపాయలుగా నిర్ణయించారు. అంతేకాకుండా విడుదల రోజు నుంచి పది రోజుల పాటు టికెట్ ధరలను భారీగా పెంచుకునే అవకాశం కల్పించారు. సింగిల్ స్క్రీన్స్‌లో రూ.125, మల్టీప్లెక్స్‌ల్లో రూ.150 వసూలు చేసుకోవచ్చని దోపీడికి అవకాశమిచ్చారు. ఓజీ ఇష్టారాజ్యంగా టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతులు ఇవ్వడం కరెక్ట్ కాదని ప్రముఖ టాలీవుడ్ నిర్మాత నట్టి కుమార్ ఖండించారు.
కాగా.. తెలంగాణలోనూ ఓజీ మూవీకి ధరలు పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తెలంగాణలో ఈ నెల 24న రాత్రి 9 గంటలకు ప్రీమియర్ షో టికెట్ ధర రూ.800గా నిర్ణయించారు. అంతేకాకుండా ఈ నెల 25 నుంచి అక్టోబరు 4 వరకు సింగిల్ స్క్రీన్స్‌లో రూ.100, మల్టీప్లెక్స్‌ల్లో రూ.150 పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతులిచ్చింది.