
ఇంట్లో వేధింపులు తట్టుకోలేకపోతున్నానంటూ కొద్దిరోజుల క్రితం బోరున ఏడ్చేస్తూ హీరోయిన్ 'తనుశ్రీ దత్తా' (Tanushree Dutta) ఒక వీడియో విడుదల చేసింది. తన ఇంట్లోనే తనకు భద్రత లేదంటూ చెప్పింది. అయితే, తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొని సంచలన కామెంట్స్ చేసింది. ఇంట్లో వేధింపులపై తాను చేసిన వ్యాఖ్యలు చాలా వైరల్ కావడంతో ఫోన్ కాల్స్ ఎక్కువ అయ్యాయని పేర్కొంది. తన జీవితం ఆధ్యాత్మిక మార్గం వైపు ప్రయాణించడంతో తాను ఎక్కువగా ఎవరినీ కలవడంలేదని చెప్పింది.
'కొంత కాలంగా నేను ఆరోగ్యంపరంగా ఇబ్బందులు పడుతున్నాను. నాకు జరిగిన అన్యాయాన్ని అందరికీ చెబుతాను. అయితే, నన్ను కాస్త ప్రశాంతంగా ఉండనీయండి. ఇండియాలో బాలీవుడ్ మాఫియా గ్యాంగ్ చాలా పెద్దది, ప్రమాదమైంది కూడా.. నేను నోరు విప్పితే ముంబైలో నా ప్రాణానికి ప్రమాదం ఉంది. నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాదిరే నా ప్రాణం కూడా ప్రమాదంలో చిక్కుకుంది. ప్రస్తుతం కొందరు నన్ను కూడా చంపాలని చూస్తున్నారు.' అని ఆమె చెప్పింది.
ఇంట్లో వేధింపులు తట్టుకోలేకపోతున్నానంటూ హీరోయిన్ తనుశ్రీదత్తా మొదట ఒక వీడియో విడుల చేసింది. నాలుగైదేళ్లుగా ఈ బాధను భరిస్తున్నా.. 2018లో మీటూ ఉద్యమం అప్పటినుంచి వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. నా ఇంట్లోనే నాకు భద్రత లేకుండా పోయింది అంటూ ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో కన్నీళ్లు పెట్టుకుంది. మీటూ ఉద్యమం తర్వాతే ఈ వేధింపులు ఎక్కువయ్యాయని బయటపెట్టింది. నానాపటేకర్ ఇదంతా చేయిస్తున్నాడని ఆరోపిస్తోంది. ఎన్జీవోలో జరుగుతున్న కార్యకలాపాలను బయటపెడతానన్న భయంతో చుల్మాన్ భాయ్ (సల్మాన్ ఖాన్)కు రూ.5 కోట్లిచ్చి తనకు బ్రేకులు వేయమని చెప్పాడంది. దాంతో చుల్మాన్ ఇలా కొందరు మనుషులను పెట్టించి.. రాత్రిపూట తన ఇంటి ఎదుట ఏవేవో శబ్ధాలు చేయిస్తూ మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడని చెప్పుకొచ్చింది. సినిమాల విషయానికొస్తే 2005లో వీరభద్ర సినిమాలో బాలక్రిష్ణతో తనుశ్రీదత్తా నటించింది. అయితే, 2013లో ఆమె చివరి సినిమా బాలీవుడ్లో నటించి తర్వాత బ్రేక్ ఇచ్చింది.