
టాలీవుడ్లో హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న సదా ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఈమె తండ్రి సయ్యద్ మరణించారు. వారం క్రితమే ఈయన చనిపోయారు కానీ ఇప్పడు సదా తన ఇన్ స్టాలో పోస్ట్ పెట్టడంతో ఈ విషయం తెలిసింది. ఈ క్రమంలోనే సదా స్నేహితులు, పలువురు నెటిజన్లు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.
'నాన్న చనిపోయి వారం రోజులైంది కానీ ఓ యుగం గడిచినట్లు అనిపిస్తుంది. సినిమా అనేది అమ్మాయిలకు ఏమంత సేఫ్ కాదు అనే రోజుల్లోనే కుటుంబాన్ని ఎదిరించి మరీ నాకు అండగా నిలిచారు. అమ్మకు కుదరకపోవడం వల్ల నాతో పాటు షూటింగ్‌లకు రాలేకపోయేది. దీంతో నాన్న ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు. కొన్నేళ్ల పాటు నాతో కూడా షూటింగ్స్‌కి వచ్చారు. తిరిగి అమ్మ నా బాధ్యతల్ని తీసుకున్న తర్వాత నాన్న ఓ చిన్న క్లినిక్ తెరిచారు. ఎంతో మంది మనుషులు, జంతువులకు ఆపద్బాంధవుడు అయ్యారు'
(ఇదీ చదవండి: హీరో శర్వానంద్ దంపతులు విడిపోయారా?)
'నేను తన కూతురు కావడం గర్వకారణం అని అందరూ ఆయనతో చెబుతున్నారని అనేవారు. కానీ ఈ రోజు ఆయన కూతురిగా నేను ఉండటం గర్వకారణంగా భావిస్తున్నాను. తన చుట్టూ ఉన్నవాళ్ల కోసం ప్రేమ, ఆప్యాయతని పంచిన ఆయనని చూసి గర్వపడుతున్నాను. ఆయన నిజంగా ఓ వెలకట్టలేని మనిషి. మిస్ యూ నాన్న' అని సదా ఎమోషనల్‌గా అవుతూ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది.
మహారాష్ట్రకు చెందిన సదా తండ్రి ముస్లిం కాగా తల్లి హిందూ. ఈయన డాక్టర్‌గా పనిచేసేవారు. తల్లి ప్రభుత్వ ఉద్యోగి. సదా టీనేజీలో హీరోయిన్ అయిపోయింది. 2002లో 'జయం' సినిమాతో నటిగా మారింది. తర్వాత ప్రాణం, నాగ, దొంగా దొంగది, లీలా మహల్ సెంటర్, చుక్కల్లో చంద్రుడు, అపరిచితుడు, వీరభద్ర తదితర చిత్రాల్లో నటించింది. గత కొన్నేళ్లలో హీరోయిన్‌గా ఆఫర్స్ తగ్గిపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ పలు మూవీస్ చేసింది. మరోవైపు రియాలిటీ షోకు జడ్జిగానూ చేసింది. చివరగా 'మదగజరాజా' సినిమాలో కనిపించింది.
(ఇదీ చదవండి: రౌడీ టీ షర్ట్.. మహేశ్ ట్వీట్.. ఇవన్నీ ఫేక్: బండ్ల గణేశ్)