
అందం అపురూపం. అభినయం స్ఫూర్తి దీపం.. దక్షిణాది ఎవర్‌గ్రీన్ సూపర్ హీరోయిన్ రమ్యకృష్ణ.. రమ్య కృష్ణన్... మన రమ్యకృష్ణ... భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యంత విజయవంతమైన ప్రసిద్ధ సినీ నాయిక. ఎంత మందికి తెలుసో గానీ... ఇప్పటికీ అంటే దాదాపు 55 ఏళ్ల వయసులో కూడా ఆమె దేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఒకరు. విశ్వసనీయ నివేదికల ప్రకారం చూస్తే ఈ దిగ్గజ నటి ఒక్కో చిత్రానికి రూ. 3-4 కోట్లు వరకూ వసూలు చేస్తుందని సమాచారం. గతేడాది ఆమె రెండు చిత్రాల్లో నటించింది. అందులో ఒకటి గుంటూరు కారం కాగా మరొకటి పురుషోత్తముడు. సినిమా సినిమాకీ గ్లామర్‌తో పాటు స్టార్ డమ్‌ని పెంచుకుంటూ పోతున్న ఈ ఎవర్ గ్రీన్ బ్యూటీ క్వీన్ తన నటనా నైపుణ్యాన్ని నిరూపించుకోవడంలో కూడా ఎప్పుడూ వెనుకడుగు వేయలేదు.
13ఏళ్లకే అభినయ యాత్ర ప్రారంభం...
రమ్య సెప్టెంబర్ 15, 1970న మద్రాసులో (ప్రస్తుత చెన్నై) జన్మించారు. ఆమె తమిళ సినీ నటుడు మాజీ పార్లమెంటు సభ్యుడు చో రామస్వామి మేనకోడలు. రమ్య కృష్ణ నటనా ప్రయాణం 13 సంవత్సరాల వయస్సులో ప్రారంభమైంది ప్రసిద్ధ తమిళ చిత్ర దర్శకుడు, సి.వి. శ్రీధర్ దర్శకత్వంలో 1983లో విడుదలైన వెల్లై మనసుతో ఆమె సినీ రంగ ప్రవేశం చేసింది. మలయాళ చిత్రం నేరం పూలరంబోల్‌తో తన నటనా జీవితాన్ని ప్రారంభించినప్పటికీ, ఇది 1986లో ఆలస్యంగా విడుదలైంది. ఆమె తొలి తెలుగు చిత్రం భలే మిత్రులు (1986). ఆమె కృష్ణ రుక్మిణి చిత్రంతో కన్నడ సినిమాలో తొలిసారిగా నటించింది తన మొదటి హిందీ చిత్రంలో యష్ చోప్రాతో కలిసి పనిచేసింది. విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రనిర్మాత యష్ చోప్రా చిత్రం పరంపర (1993)చిత్రంతో హిందీ చిత్రసీమలో అరంగేట్రం చేసిన తర్వాత ఆమె కెరీర్ తదుపరి స్థాయికి చేరింది. సుభాష్ ఘై 'ఖల్ నాయక్'(1993), మహేష్ భట్ 'చాహత్'(1996) , డేవిడ్ ధావన్ 'బనారసి బాబు' (1997), అమితాబ్ బచ్చన్ మిథున్ చక్రవర్తిలతో కలిసి బడే మియాన్ చోటే మియాన్ (1998)లో గోవిందాతో కలిసి శపత్ లాంటి మరికొన్ని హిందీ చిత్రాలలోనూ నటించింది.
నాలుగు దశాబ్ధాల నటనా ప్రస్థానం..
ఒంపుసొంపుల అందాల భామగా మాత్రమే కాదు అమ్మోరుగానూ తెలుగు ప్రేక్షకుల మనసుల్లో స్థిరనివాసం ఏర్పరచుకున్న ఏకైన సినీ హీరోయిన్ రమ్యకృష్ణ మాత్రమే. దీనితో పాటే మరెవరికీ దక్కని విధంగా నాలుగు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ నట జీవితంలో టాప్ లోనే రాణిస్తున్నారామె. ఐదు భాషలలో 200 కంటే ఎక్కువ చిత్రాలలో పనిచేశారు. కంటె కూతుర్నే కను, స్వీటీ నాన్న జోడి, బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి: ది కన్ క్లూజన్, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, పడయప్ప(నరసింహ), సూపర్ డీలక్స్ సినిమాలు ఆమె మరపురాని నటనా పటిమనకు నిదర్శనాలుగా నిలిచిన వాటిలో కొన్ని మాత్రమే. నరసింహ చిత్రంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌తో ఢీ అంటే ఢీ అన్నట్టుగా సాగిన నీలాంబరిగా ఆమె నట విశ్వరూపం.. నభూతో అంటారు సినీ విమర్శకులు. అద్భుతమైన అభినయానికి నాలుగు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, మూడు నంది అవార్డులు, తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డు, బిహైండ్‌వుడ్స్ గోల్డ్ మెడల్.. ఇలా మరెన్నో పురస్కారాలని స్వంతం చేసుకుంది. కాలక్రమంలో తన కెరీర్‌ను చిన్నితెరకూ విస్తరించి సన్ టీవీ కోసం కలసం, తంగం వంటి టీవీ సీరియల్‌లలో కనిపించింది. థంగా వెట్టై అనే గేమ్ షోను హోస్ట్ చేయడంతో పాటు ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో జోడి నంబర్ వన్ లో జడ్జిగా కనిపించింది.
వివాదాలూ...ఎక్కువే...
ఇటీవల సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ కామన్ అంటూ ఇచ్చిన స్టేట్‌మెంట్ ద్వారా చర్చనీయాంశంగా మారిన రమ్యకృష్ణ గతంలో వ్యక్తిగత జీవితంలో కూడా కొన్ని వివాదాలు ఉన్నాయి. అందులో ప్రముఖంగా చెప్పుకోదగింది.. ప్రఖ్యాత దక్షిణ భారత దర్శకుడు కె.ఎస్. రవికుమార్‌తో వివాహేతర సంబంధం. 1999లో రమ్య కె.ఎస్.రవికుమార్‌తో పడయప్ప, పాటాలి (1999), పంచతంతిరం (2002) చిత్రాలలో కలిసి పనిచేసింది. తర్వాత వారి స్నేహం త్వరలోనే సంబంధంగా మారిందని వార్తలు వచ్చాయి. ఆ సమయంలో రమ్య ఒంటరిగా ఉన్నప్పటికీ, కెఎస్ రవికుమార్ కర్పగం అనే మహిళను వివాహం చేసుకున్నాడు. ఒక వార్తా సంస్థ నివేదిక ప్రకారం, రమ్య కెఎస్ రవికుమార్ ద్వారా గర్భవతి అయిందని గర్భస్రావం కోసం రూ. 75 లక్షలు తీసుకుందని వార్తలు వినిపించాయి. ఆ తర్వాత వారు విడిపోయారని తెలుస్తోంది. ఇది భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యంత అపకీర్తికరమైన వ్యవహారాలలో ఒకటి, అయితే ఇలాంటి వ్యక్తిగత సంక్షోభాలను సమర్ధంగా ఎదుర్కుని తిరిగి కెరీర్‌ను పట్టాలెక్కించుకోగలిగింది రమ్య. ఆ తర్వాత, ఆమె ప్రముఖ దర్శకుడు కృష్ణ వంశీని 2003 జూన్ 12న ప్రేమ వివాహం చేసుకుంది. వారి వివాహం జరిగే సమయానికి, రమ్య వయసు 33, కృష్ణ వంశీ వయసు 41. 2005 ఫిబ్రవరి 13నఈ దంపతులకు మగబిడ్డ జన్మించాడు. పిల్లాడి పేరు రిత్విక్ వంశీ.
అందానికి తెరరూపంగా...
–అల్లుడుగారు
–అల్లరిమొగుడు
–అల్లరి ప్రియుడు
–హలో బ్రదర్
–మేజర్ చంద్రకాంత్
అభినయానికి ప్రతిరూపంగా..
–సూత్రధారులు
–అమ్మోరు
–నరసింహ
–బాహుబలి ది బిగినింగ్
–అన్నమయ్య
–కంటే కూతుర్నే కను
చలనచిత్ర రంగంలో అటు అందం ఇటు అభినయం రెండింటినీ కలబోస్తూ అదే సమయంలో సమయానుకూలంగా మార్పు చేర్పులు చేసుకుంటూ సాగించిన రమ్యకృష్ణ ప్రయాణం... చిత్ర పరిశ్రమలోని యువతులకు నిస్సందేహంగా అనుసరణీయం.