ధనుష్‌తో నటి మమితా బైజుకు(Mamitha Baiju) జత కుదిరింది. రీసెంట్‌గా డ్యూడ్‌తో ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. మొదట మలయాళం మూవీతో తెరపైకి వచ్చిన ఈ బ్యూటీ తమిళం, తెలుగు అంటూ చుట్టేస్తోంది. ప్రేమలుతో దక్షిణాది చిత్ర పరిశ్రమనే తన వైపు తిప్పుకున్న ఈ అమ్మడు కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన తొలి చిత్రం రెబెల్ నిరాశపరచడంతో అక్కడ ఈ భామ పప్పులు ఉడకవు అనే విమర్శలను ఎదుర్కొంది. బాలా దర్శకత్వంలో వణంగాన్ చిత్రంలో కొన్ని రోజులు నటించి వైదొలగింది. దీంతో కోలీవుడ్‌లో చిన్న గ్యాప్ కూడా వచ్చింది. అలాంటిది ఇప్పుడు తమిళంలో బిజీ హీరోయిన్ అయిపోయింది.
ప్రదీప్ రంగనాథన్‌తో జతకట్టిన ద్విభాషా ( తమిళం, తెలుగు) చిత్రం డ్యూడ్ దీపావళి సందర్భంగా తెరపైకి వచ్చి ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ప్రస్తుతం విజయ్ హీరోగా నటించిన జననాయకన్ చిత్రంలో ఆయనకు చెల్లెలిగా కీలక పాత్రను పోషించింది. ఈచిత్రం వచ్చే ఏడాది జనవరి 9న తెరపైకి రానుంది. తాజాగా సూర్య కథానాయకుడిగా నటిస్తున్న ద్విభాషా చిత్రంలో కథానాయికిగా నటిస్తోంది. అదేవిధంగా ఇరెండు వారమ్ అనే మరో చిత్రంలో నటించిన మమితబైజు మలయాళంలోనూ ఒక చిత్రంలో నటిస్తోంది. కాగా తాజాగా మరో లక్కీచాన్స్ ఈ అమ్మడిని వరించింది. ధనుష్ సరసన నటించడానికి మలయాళీ బ్యూటీ రెడీ అవుతోంది.
నటుడు ధనుష్ ప్రస్తుతం తేరే ఇష్క్‌మేన్ అనే హిందీ చిత్రంలో నటిస్తున్నారు. తదుపరి వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై ఐసరి కే.గణేశ్ నిర్మించనున్న చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఇది ఈయన నటించే 54వ చిత్రం అవుతుంది. దీనికి పోర్ తొళిల్ చిత్రం ఫేమ్ విఘ్నేష్ రాజా దర్శకత్వం వహించనున్నారు. దీనికి జీవీ.ప్రకాష్‌కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. దీని గురించిన అధికారిక పోస్టర్‌ను నిర్మాతల వర్గం విడుదల చేసింది. వచ్చే నెలలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. ఇందులో మమితబైజు నాయకిగా నటించనుందని సినీ వర్గాల సమాచారం.


