
జడకు పెట్టుకున్న మల్లెపూలు.. ప్రముఖ నటిని చిక్కుల్లో పడేశాయి. ఏకంగా రూ.లక్ష ఫైన్ కట్టించేలా చేశాయి. ఈ విషయాన్ని సదరు నటి బయటపెట్టింది. దీంతో ఇది కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ అసలేం జరిగింది?
మలయాళ నటి నవ్య నాయర్.. రీసెంట్‌గా ఓనం సెలబ్రేషన్స్ కోసం ఓ ఈవెంట్‌కి హాజరయ్యేందుకు ఆస్ట్రేలియా వెళ్లింది. అయితే మెల్‌బోర్న్ విమానాశ్రయంలో దిగేటప్పుడు మల్లెపూలని తన బ్యాగులో పెట్టుకుంది. వీటిని చూసి ఎయిర్‌పోర్ట్ అధికారులు.. ఈమెకు 1980 ఆస్ట్రేలియన్ డాలర్స్ జరిమానా విధించారు. మన కరెన్సీలో చెప్పాలంటే రూ.1.14 లక్షలు.
(ఇదీ చదవండి: నేను వెళ్లిపోవడానికి కూడా రెడీ.. బిగ్‌బాస్ 9 Day 1 ప్రోమోస్ రిలీజ్)
కఠినమైన బయోసెక్యూరిటీ ఉన్న విమానాశ్రయాల్లో మెల్‌బోర్న్ ఒకటి. పండ్లు, విత్తనాలు, పూలు తీసుకెళ్లడం ఇక్కడ నిషిద్ధం. వీటి వల్ల వివిధ రకాల వ్యాధులు, తెగుళ్లు వచ్చే ప్రమాదం ఉండటంతోనే అధికారులు ఈ నిబంధన పెట్టారు. ఇది తెలియని నటి నవ్య నాయర్.. తన బ్యాగులో మల్లెపూలు పెట్టేసింది. దాన్ని గుర్తించిన సిబ్బంది.. జరిమానా విధించారు. 28 రోజుల్లోపు ఈ మొత్తం కట్టాలని లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఈమెకు చెప్పారు.
విమానాశ్రయంలో ఈ తతంగమంతా జరిగిన తర్వాత మెల్‌బోర్న్‌లో ఓనం ఈవెంట్ లో పాల్గొన్న నవ్య నాయర్.. అక్కడ మాట్లాడుతూ ఈ విషయాన్ని బయటపెట్టింది. తాను తీసుకువచ్చిన పూలు.. లక్ష రూపాయలు ఖరీదైనవనని ఫైన్ వేసేవరకు తనకు తెలియదని తనపై తానే కౌంటర్ వేసుకుంది.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 17 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)