Aadi Sai Kumar: అది అందరికీ అర్థం కాని పెద్ద పజిల్‌

Aadi Sai Kumar Talk About Top Gear Movie - Sakshi

‘‘ప్రస్తుతం ప్రేక్షకులు ఎలాంటి కంటెంట్‌ను ఇష్టపడుతున్నారన్న విషయం అంచనాలకు అందడంలేదన్న మాటలను నేనూ వింటున్నాను. ఓ సినిమా సెంట్రల్‌ ఐడియా కొత్తగా ఉందంటే సగం పాసైయినట్లే అని నమ్ముతాను’’ అని హీరో ఆది సాయికుమార్‌ అన్నారు. ఆది సాయికుమార్, రియా సుమన్‌ జంటగా కె. శశికాంత్‌ దర్శకత్వంలో కేవీ శ్రీధర్‌ రెడ్డి నిర్మించిన ‘టాప్‌గేర్‌’ ఈ నెల 30న రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా ఆది సాయికుమార్‌ చెప్పిన విశేషాలు.

► ఒక్కరోజులో జరిగే కథతో రూపొందిన చిత్రం ‘టాప్‌ గేర్‌’. ఏ మాత్రం తనకు సంబంధం లేని ఓ సమస్యలో ఇరుక్కునే ఓ క్యాబ్‌ డ్రైవర్‌ అందులో నుంచి ఎలా బయటపడతాడు? అనేది ఈ సినిమా కథనం. మేజర్‌ షూటింగ్‌ అంతా కారులోనే చేశాం. స్క్రీన్‌ప్లే రేసీగా సాగుతుంది. నా గత చిత్రాల మాదిరిగానే ‘టాప్‌ గేర్‌’ కూడా టెక్నికల్‌గా చాలా స్ట్రాంగ్‌ ఫిల్మ్‌. నా ప్రతి సినిమాకు నేను వంద శాతం కష్టపడుతూనే ఉన్నాను. నా సినిమా లను గమనిస్తే అందులోని ప్రధానాంశం కచ్చితంగా కొత్తగా ఉంటుంది. ‘టాప్‌గేర్‌’ కూడా అలాంటి కథాంశమే.

► ప్రస్తుతం మాస్‌ యాక్షన్‌ ఫిల్మ్‌ నిర్వచనం మారింది. ఇప్పుడు ఎక్కువగా ‘కేజీఎఫ్‌’లాంటి స్టయిలిష్‌ యాక్షన్‌ ఫిలింస్‌ని చూస్తున్నారు. భవిష్యత్‌లో నేనూ ఓ స్టైలిష్‌ యాక్షన్‌ ఫిలిం చేస్తాను.

► థియేటర్స్‌లో ఓ హిట్‌ సాధించడం అనేది అందరికీ ఓ సవాలుగా మారింది. రీసెంట్‌గా విడుదలైన నా ‘క్రేజీ ఫెలో’ చిత్రం మంచి బజ్‌ను క్రియేట్‌ చేసుకుంది. కానీ మా సినిమా విడుదలైన మర్నాడే కన్నడ ‘కాంతార’ తెలుగులో విడుదలైంది. ఆ సినిమా ఫ్లోలో మా సినిమాకు ప్రేక్షకుల ఆదరణ దక్కలేదు. బహుశా.. రాంగ్‌ రిలీజ్‌ డేట్‌ కావొచ్చు. ఇలాంటి ఎంటర్‌టైనింగ్‌ సినిమాలను ఆడియన్స్‌ ఓటీటీలోనే చూడాలని ఫిక్స్‌ అయ్యారో లేదా థియేట్రికల్‌ మూవీ అంటే ఏదో ఎక్స్‌ట్రార్డినరీ కంటెంట్‌ ఉండాలని ఫిక్స్‌ అయ్యారా? అన్నది ఇప్పుడు అందరికీ అర్థం కాని పెద్ద పజిల్‌.

► ప్రస్తుతానికి నెగటివ్‌ రోల్స్‌ చేయాలనుకోవడం లేదు. ఏదైనా అద్భుతమైన స్క్రిప్ట్‌ వస్తే అప్పుడు ఆలోచిస్తాను. ప్రస్తుతం లక్కీ మీడియాలో ఓ సినిమా చేస్తున్నాను. ‘పులిమేక’ వెబ్‌ సిరీస్‌ చేశాను. త్వరలో జీ5లో స్ట్రీమింగ్‌ కానుంది. 

► నాన్నగారు చేసిన ‘అసలేం గుర్తుకురాదు..’ (‘అంతఃపురం’) సినిమా పాటను రీమిక్స్‌ చేయా లని ఉంది. అయితే నా సినిమాలో ఆ పాటకు తగ్గ సందర్భం కుదరాలి. ఒకవేళ రీమిక్స్‌ చేస్తే దర్శకుడు కృష్ణవంశీగారే తీయాలి. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top