చివరికి పశువులకు మేతగా.. | - | Sakshi
Sakshi News home page

చివరికి పశువులకు మేతగా..

Oct 10 2026 7:56 AM | Updated on Oct 10 2026 7:56 AM

ఎల్‌నినోతో విద్యుత్‌ సమస్య

తరచూ కాలిపోతున్న ట్రాన్స్‌ఫార్మర్లు

జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది 2.94 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. ఇందులో సింహభాగం సన్న వడ్లను పండించారు. దొడ్డురకంతో పోల్చుకుంటే సన్నాలు 20 రోజుల ఆలస్యంగా పంట చేతికందుతుంది. జిల్లాలో చెప్పుకో దగ్గ సాగునీటి ప్రాజెక్టులు లేకపోవటంతో 90 శాతం మంది రైతులు బోరుబావుల ఆధారంగానే పంటలను సాగు చేశారు. జిల్లావ్యాప్తంగా 1.10 లక్షల బోరుబావులు ఉండగా, 26 వేల ట్రాన్స్‌ఫార్మర్లు ఉన్నాయి. ఎల్‌నినో ప్రభావంతో ప్రాజెక్టులు నిండకపోవటంతో విద్యుత్‌ ఉత్పత్తి తగ్గింది. దీంతో రోజుకు 8 నుంచి 9 గంటలు మాత్రమే సరఫరా అవుతుంది. అది కూడా ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. అయితే పై నుంచే ఈ సమస్య ఉందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. జిల్లాలో మెదక్‌, నర్సాపూర్‌, పాపన్నపేట, రామాయంపేట, తూప్రాన్‌లో ట్రాన్స్‌ఫార్మర్‌ రిపేర్‌ (టీఆర్‌) సెంటర్లు ఉండగా, నిత్యం 50 ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతున్నాయని గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ ఉత్పన్నం కాలేదని సంబంధిత అధికారులు చెబుతున్నారు. అంతే కాకుండా లోఓల్టేజీతో బోరు మోటార్లు సైతం తరచూ కాలిపోతున్నాయి. దీంతో ట్రాన్స్‌ఫార్మర్లతో టీఆర్‌ రిపేర్‌ సెంటర్లు కిటకిటలాడుతున్నాయి.

పంట చేతికందే వరకు

మరో 20 రోజుల్లో పంట చేతికందుతుందనగా లో ఓల్టేజీ సమస్యతో తరచూ ట్రాన్స్‌ఫార్మర్లు, బోరు మోటార్లు కాలిపోతున్నాయి. దీంతో నీటితడులు అందక పంటలు ఎండిపోతున్నాయి. బోనస్‌ ఆశతో తలకు మించిన పెట్టుబడులు పెట్టిన రైతులు పంటపై గంపెడాశలు పెట్టుకున్నారు. తీరా అవి చేతికందే సమయంలో ఎండిపోతుండటంతో కర్షకులు ఆందోళన చెందుతున్నారు.

నిత్యం 212 మెగావాట్లు అదనం

గతేడాది అక్టోబర్‌లో రోజుకు 350 మెగావాట్ల విద్యుత్‌ వినియోగించగా, ప్రస్తుతం 562 పైచిలుకు మెగావాట్ల విద్యుత్‌ వినియోగిస్తున్నట్లు సంబంధిత ట్రాన్స్‌కో అధికారులు చెబుతున్నారు. అంటే నిత్యం 212 మెగావాట్ల విద్యుత్‌ అదనంగా వినియోగిస్తున్నట్లు అధికారుల చెబుతున్నారు.

చిలప్‌చెడ్‌(నర్సాపూర్‌): ఎన్నో ఆశలతో సాగు చేసిన వరి కొన్ని రోజుల క్రితం వరకు పచ్చగా కళకళలాడింది. ప్రస్తుతం సాగు నీరు అందక ఎండిపోయింది. దీంతో ఆవేదనకు గురైన రైతు వరి పంటను పశువులకు మేతగా వదిలేశాడు. మండల పరిధిలోని గంగారం తండాకు చెందిన రైతు తనకున్న మూడెకరాల్లో బోరుబావి సహాయంతో వరి సాగు చేశాడు. తీరా పంట చేతికి వచ్చే సమయానికి భూగర్భజలాలు అడుగంటాయి. కరెంట్‌ కోతలతో బోరు సైతం సక్రమంగా నడవకపోవడంతో ఎండిన పొలాన్ని శుక్రవారం పశువులకు మేతగా వదిలేశాడు.

ఎల్‌నినో కారణంగా సరైనా వర్షాలు కరువక ప్రాజెక్టులు నిండలేదు. దీంతో విద్యుత్‌ ఉత్పత్తి గణనీయంగా తగ్గింది. కరెంట్‌ సరఫరా తగ్గటంతో లోఓల్టేజీ సమస్య ఉత్పన్నం అవుతుంది. వచ్చిన దాంట్లోనే సర్దుబాటు చేస్తున్నాం.

– నారాయణ నాయక్‌, ట్రాన్స్‌కో ఎస్‌ఈ

నడవని మోటార్లు.. ఎండుతున్న పంటలు

ఆందోళనలో అన్నదాతలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement