నర్సాపూర్: రైతుల కరెంట్ కష్టాలను తీర్చాలన్న సోయి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని ఎమ్మెల్యే సునీతారెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆమె పట్టణంలో విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ హయాంలో రైతులకు 24 గంటల పాటు మెరుగైన కరెంట్ సరఫరా చేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం రోజుకు ఐదారు గంటలే ఇస్తున్నారని మండిపడ్డారు. అది కూడా సరిగా ఇవ్వకపోవడంతో బోరు మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతున్నాయని వాపోయారు. సింగరేణి గనుల్లో లభిస్తున్న నాణ్యమైన బొగ్గును ప్రభుత్వం ఇతర రాష్ట్రాలకు అమ్ముకుంటుందన్నారు. నాణ్యత లేని బొగ్గుతో కరెంటు ఉత్పత్తి చేయడంతో లో ఓల్టేజీ సమస్య వస్తుందని ఆరోపించారు. సమావేశంలో బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.
కౌడిపల్లి(నర్సాపూర్): విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని డీఎల్‌పీఓ సురేశ్‌బాబు హెచ్చరించారు. శుక్రవారం కౌడిపల్లి ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా పాఠశాల పరిసరాలతో పాటు మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. అనంతరం ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు తనిఖీ చేశారు. మినరల్ వాటర్ ప్లాంట్ నిర్వహణ లోపంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనితీరు సరిగా లేదని, ఇటీవల మండల సర్యసభ్య సమావేశంలో ఫిర్యాదులు వచ్చాయని హెచ్‌ఎం లలితాదేవిని హెచ్చరించారు. కార్యక్రమంలో సర్పంచ్ చంద్రం కృష్ణాగౌడ్, పంచాయతీ కార్యదర్శి నగేశ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
కిక్కిరిసిన బస్టాండ్లు
నర్సాపూర్: దసరా పండుగను పురస్కరించు కుని ప్రభుత్వం పాఠశాలలు, కాలేజీలకు సెలవులు ప్రకటించింది. దీంతో పట్టణంలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ హాస్టళ్ల విద్యార్థులు శుక్రవారం సొంతూళ్లకు ప్రయాణమయ్యారు. దీంతో నర్సాపూర్ బస్టాండ్ ప్రయాణికులతో రద్దీగా మారింది.


