లక్ష్మాపూర్ వద్ద రైతుల రాస్తారోకో
రామాయంపేట(మెదక్): విద్యుత్ కోతలకు నిరసనగా చేపట్టిన ఆందోళనలతో శుక్రవారం రామాయంపేట అట్టుడికింది. మండలంలోని లక్ష్మాపూర్ స్టేజీ వద్ద రైతులు, బీఆర్‌ఎస్ శ్రేణులు రామాయంపేట– మెదక్ రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనలో మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డి పాల్గొన్నారు. సుమారు రెండు గంటలకు పైగా సాగిన ఈ ఆందోళనతో రోడ్డుకు ఇరువైపులా పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. ఈసందర్భంగా పద్మారెడ్డి మాట్లాడుతూ.. రోజుకు నాలుగైదు గంటలకు మించి విద్యుత్ సరఫరా కాకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయన్నారు. పంటలు చేతికొచ్చే సమయంలో ప్రభుత్వం చేతులెత్తేసిందని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో ఎలాంటి కోతలు లేకుండా విద్యుత్ సరఫరా చేశారని తెలిపారు. నాణ్యమైన 12 గంటల విద్యుత్ సరఫరా చేస్తేనే పంటలు దక్కుతాయన్నారు. ట్రాన్స్‌కో ఏడీ ఆదయ్య నాయకులతో మాట్లాడారు. కోతలు లేకుండా విద్యుత్ సరఫరా చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అలాగే మండలంలోని కోనాపూర్ వద్ద రైతులు రాస్తారోకో నిర్వహించారు. సబ్‌స్టేషన్ ఎదుట రామాయంపేట– సిద్దిపేట రోడ్డుపై బైఠాయించారు. ట్రాన్స్‌కో ఏఈ తిరుపతిరెడ్డి ఆందోళనకారులతో చర్చలు జరిపారు. రెండు రోజుల్లో సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో శాంతించారు.
కరెంటు కోతలపై అట్టుడికిన రామాయంపేట
లక్ష్మాపూర్, కోనాపూర్‌లో అన్నదాతల రాస్తారోకో
పాల్గొన్న పద్మారెడ్డి, శేరి సుభాశ్‌రెడ్డి


