సంగారెడ్డి జోన్/మెదక్ కలెక్టరేట్/నర్సాపూర్: తెలంగాణ ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మెదక్ రీజియన్ పరిధిలో ఏర్పాటుచేసిన 8 పోలింగ్ కేంద్రాల్లో ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. శుక్రవారం ఉదయం 5 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. మెదక్ రీజియన్ పరిధిలో 8 డిపోలు, ఒకటి ఉమ్మడి మెదక్ రీజియన్ కార్యాలయం ఉంది. మొత్తం 1,805 మంది ఓటర్లు ఉండగా, 1,797 మంది ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఉత్సాహంగా ఓటింగ్
పదేళ్ల తర్వాత ఎన్నికలు జరగడంతో ఆర్టీసీ ఉద్యోగులు ఉత్సాహంగా ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఆయా డిపోల పరిధిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో బారులు తీరి ఓటు హక్కు వినియోగించుకున్నారు. గుర్తింపు ఎన్నికల్లో 12 యూనియన్లు బరిలో ఉండగా, మూడు కూటముల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ప్రభుత్వం విడుదల చేసిన ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఈనెల 17న గుర్తింపు సంఘం ఎన్నికల ఫలితాలను అధికారికంగా ప్రకటించనుంది. శుక్రవారం జరిగిన పోలింగ్ అనంతరం ఓట్ల లెక్కింపు జరిపారు. సంగారెడ్డి, జహీరాబాద్‌తో పాటు మిగితా డిపోలో కాంగ్రెస్ మద్దతుతో బరిలో ఉన్న తెలంగాణ వర్కింగ్ యూనియన్‌కు అత్యధిక ఓట్లు పోలై, ముందంజలో ఉంది. గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలుపు దిశగా ఉండటంతో ఆ యూనియన్ నేతలు సంబరాలు జరుపుకున్నారు. అధికారిక ఫలితం కొరకు ఆశాఖ ఉద్యోగులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మెదక్ ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ) ముందంజలో ఉన్నట్లు తెలిసింది. నర్సాపూర్ డిపో పరిధిలో టీడబ్ల్యూయూ సంఘానికి భారీ మెజారిటీ దక్కిందని ఆ యూనియన్ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. సంఘం గౌరవ అధ్యక్షుడు ఆవుల రాజిరెడ్డి డిపో కార్యదర్శి వెంకట్‌గౌడ్‌తో పలువురు నాయకులను సన్మానించారు. మెదక్‌లో 242 మంది కార్మికులు ఓటు హక్కు వినియోగించుకున్నారు, పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఇద్దరు ఓటేశారు. నర్సాపూర్ 108 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఓటేసిన 1,797 మందిఉద్యోగులు
మెదక్‌లో ఈయూ.. నర్సాపూర్‌లో టీడబ్ల్యూయూ హ వా!
17న అధికారికంగా ఫలితాల ప్రకటన


