పంటల బీమా.. ధీమా | - | Sakshi
Sakshi News home page

పంటల బీమా.. ధీమా

Oct 6 2026 8:31 AM | Updated on Oct 6 2026 8:31 AM

న్యూస్‌రీల్‌

మంగళవారం శ్రీ 6 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026

పాపన్నపేట(మెదక్‌): వినియోగ వస్తువులు మొదలుకొని మనిషి జీవితం వరకు బీమా ఉంది. కానీ పూర్తిగా ప్రకృతిని నమ్ముకొని సాగు చేస్తున్న పంటలకు మాత్రం బీమా లేకపోవడంతో వ్యవసాయం జూదంలా మారింది. పంట ఇంటిని చేరే వరకు నమ్మకం లేని పరిస్థితి నెలకొంది. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ మంత్రుల సమావేశంలో కేంద్ర మంత్రి శివరాజ్‌ సింగ్‌ విస్మయం వ్యక్తం చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనలో పడింది. వచ్చే యాసంగి నుంచి పంటల బీమా ప్రవేశపెట్టే దిశగా కార్యాచరణ ప్రారంభించింది. ముఖ్యంగా ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ చర్యగా భావిస్తోంది.

ఫసల్‌ బీమాకు రాం రాం

2015 నుంచి 2019 వరకు రాష్ట్రంలో ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా పథకం అమల్లో ఉండేది. ఈ పథకంలో 50 శాతం కేంద్రం, మరో 50 శాతం రాష్ట్రం భరించేది. బీమా అమలుకు కంపెనీ ఎంపిక రాష్ట్రం చేతుల్లోనే ఉండేది. కానీ అప్పట్లో పంట నష్ట పరిహారం చెల్లించాలంటే గ్రామాన్ని కాకుండా మండలాన్ని యూనిట్‌గా తీసుకునే వారు. దీంతో ఒక గ్రామంలో పంట మొత్తం నష్టపోయినా, మండలం యూనిట్‌గా తీసుకొని పంట నష్టాన్ని అంచనా వేసే వారు. దీంతో చాలా మంది రైతులకు పరిహారం అందేది కాదు. అధిక ఆర్థిక భారం, క్లెయిం సెటిల్‌మెంట్‌లో జాప్యంతో రైతులకు సాయం అందకపోవడం లాంటి కారణాలతో 2020 ప్రధాన మంత్రి బీమా పథకం నుంచి రాష్ట్రం వైదొలిగింది.

కసరత్తు ప్రారంభించిన ప్రభుత్వం

ఎల్‌నినో నేపథ్యంలో నెలకొన్న తీవ్ర వర్షాభావం పరిస్థితుల్లో పంట బీమాను ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. భారత వ్యవసాయ బీమా కంపెనీ సగం ప్రీమిమం చెల్లిస్తే, బీమా అమలు చేసేందుకు ముందుకు రావడంతో ఆదిశగా చర్యలు ప్రారంభించింది. పరిహారం, నిర్వహణ ఖర్చులు పోనూ మిగులు, క్లెయిం చేయని ప్రీమియాన్ని సైతం చెల్లించేందుకు సంస్థ ముందుకు రావడంతో యాసంగి నుంచి పంట బీమా అమల్లోకి రానున్నట్లు తెలుస్తుంది. జిల్లాలో వర్షాకాలంలో 3.68 లక్షల ఎకరాల్లో 3,00,058 రైతులు పంటలు వేశారు. యాసంగిలో ఈ సంఖ్య తగ్గే అవకాశం ఉంది. ఈ విషయమై జిల్లా వ్యవసాయాధికారి దేవ్‌కుమార్‌ను వివరణ కోరగా పంటల బీమా పథకం అమలు దిశగా చర్యలు ప్రారంభమయ్యాయని, ఇంకా పూర్తి వివరాలు వెల్లడి కాలేదని చెప్పారు.

హవేళిఘణాపూర్‌ మండలంలో దెబ్బతిన్న వరి పంట (ఫైల్‌ )

ఎల్‌నినోతో రైతులకు ఆసరా

యాసంగి నుంచి అమలు

ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షణ

జిల్లాలో 3,00,058 మంది రైతులు

‘మరో వారం రోజుల్లో చేతికొచ్చే పంటను చూసి అన్నదాత సంబురపడ్డాడు. విరగగాసిన వరి గెలను చూసి ఇక తన కష్టం తీరినట్టే ఆశపడ్డాడు. కానీ ఉన్నట్టుండి ప్రకృతి ఉరిమింది. వడగండ్ల వర్షం కురిసింది. అరగంట వ్యవధిలో ధాన్యపు రాశులు నేల రాలాయి. సుమారు 800 ఎకరాల్లో వరి పంట ధ్వంసమైంది. పాపన్నపేట మండలం కుర్తివాడలో 2016లో చోటు చేసుకున్న ఈ ప్రకృతి ప్రకోపం, వందలాది మంది రైతన్నలకు కన్నీటి కడగండ్లు మిగిలించింది. అప్పటి మంత్రి హరీశ్‌రావు పంట చేలను పరిశీలించి పరిహారం ఇప్పిస్తామని హామీ ఇచ్చినా అవి నీటి మూటలే అయ్యాయి.’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement