నర్సాపూర్: అక్రమ తవ్వకాలతో గుట్టలు కనుమరుగవుతున్నాయి. అక్రమార్కులు ప్రభుత్వ ఆస్తులను కొల్లగొడుతున్నారు. నియోజకవర్గ కేంద్రంలో ఆయాశాఖల అధికారులు ఉన్నా చర్యలకు వెనుకాడుతున్నారు. తాజాగా పట్టణంలోని 76 సర్వే నంబర్‌లోని ప్రభుత్వ భూమిలో ఎలాంటి అనుమతి పొందకుండా మట్టి అక్రమ తవ్వకాలు చేపడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గుట్టను తవ్వడంతో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. గుట్టపై ఉన్న చెట్లను సైతం కూల్చివేశారు. జేసీబీలతో మట్టిని తవ్వి టిప్పర్ల ద్వారా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.
అక్రమ పేలుళ్లు
గుట్టను తవ్వే సమయంలో అక్రమార్కులు పెద్ద పెద్ద బండరాళ్లను పేల్చివేస్తున్నారు. తమకు అవసరం ఉన్న సైజులో ముక్కలుగా చేసి విక్రయిస్తున్నారు. ఎలాంటి అనుమతి పొందకుండా అక్రమంగా పేలుడు పదార్థాలు సైతం వినియోగిస్తున్నారు. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఇటీవల మండలంలో పేలుడు పదార్థాల వినియోగం సైతం పెరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పట్టణం మీదుగా మట్టి రవాణా
పట్టణాన్ని ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూమిలోని గుట్టను రాత్రి సమయంలో తవ్వి టిప్పర్ల ద్వారా తరలిస్తున్నారు. పలు వీధుగా గుండా మట్టి టిప్పర్లు తిరిగినా అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. కాగా, గతంలో మున్సిపాలిటీలోని హన్మంతాపూర్ శివారులోని అసైన్డ్ భూముల నుంచి అక్రమంగా మట్టి తవ్వకాలు జరిగినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శలు వస్తున్నాయి. దీంతో అక్రమార్కులు ఇష్టానుసారంగా ప్రభుత్వ భూముల్లో మట్టి అక్రమ తవ్వకాలు చేపడుతూ ప్రభుత్వ ఆస్తులను కొల్లగొడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి.
అడ్డగోలుగా అక్రమ తవ్వకాలు
అనుమతి లేకుండా బండరాళ్ల పేల్చివేత
చర్యలకు వెనుకాడుతున్న అధికారులు


