మెదక్ కలెక్టరేట్: దేశంలోనే మొదటిసారి జాతీయ రహదారి వెంట 35 వేల జీడీ మామిడి మొక్కల ప్లాంటేషన్‌ను గవర్నర్ శివప్రతాప్ శుక్లా మంగళవారం జిల్లాలో ప్రారంభిస్తారని కలెక్టర్ ప్రతిమాసింగ్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో ఎస్పీ డీవీ శ్రీనివాసరావు, అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రామాయంపేట– సిద్దిపేట మధ్య జాతీయ రహదారి వెంట భారీ ప్లాంటేషన్ కార్యక్రమన్ని గవర్నర్, ఎంపీ రఘునందన్‌రావు ప్రారంభిస్తారని తెలిపారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని, అధికారుల సమన్వయంతో గవర్నర్ పర్యటనను విజయవంతం చేయాలని అధికారులకు సూచించారు. అలాగే కలెక్టరేట్‌లో వివిధ కార్యక్రమాల్లో గవర్నర్ పాల్గొంటారని తెలిపారు.
డ్రిప్ ద్వారా మొక్కలకు నీరు
రామాయంపేట(మెదక్): ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా మంగళవారం రామాయంపేటలో మొక్కలు నాటే కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా హాజరవుతారని ఎంపీ రఘునందన్‌రావు తెలిపారు. సోమవారం రామాయంపేటలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘సేవా సంకల్ప్ అభియాన్’ పేరిట పలు కార్యక్రమాలు చేపట్టామని వివరించారు. తాము నాటే మొక్కలకు డ్రిప్ ద్వారా నీరు అందిస్తామని, ఈమేరకు బోర్లు తవ్వకం పనులు పూర్తయినట్లు వెల్లడించారు. గవర్నర్ బహిరంగ సభ నిర్వహణకు గాను కళాశాల మైదానాన్ని ఆర్డీఓ రమాదేవి, తూప్రాన్ డీఎస్పీ నరేందర్‌గౌడ్, సీఐ సైదా, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాగి రాములు, కౌన్సిలర్ శంకర్‌గౌడ్ తదితరులతో కలిసి పరిశీలించారు.
నేడు గవర్నర్ చేతుల మీదుగా ప్లాంటేషన్
వివరాలు వెల్లడించిన కలెక్టర్ ప్రతిమాసింగ్


