మెదక్ కలెక్టరేట్: ప్రజావాణి దరఖాస్తులను అధికారులు తక్షణమే పరిష్కరించాలని డీఆర్‌ఓ అంబదాస్ రాజేశ్వర్ అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్‌లో అర్జీలను స్వీకరించారు. భూభారతి 24, ఇందిరమ్మ ఇళ్ల కోసం 15, పెన్షన్లు 3, ఇతర 37 మొత్తం 79 అర్జీలు వచ్చాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించాలన్నారు. కార్యక్రమంలో డీఎఫ్‌ఓ జోజి, డీఆర్డీఓ శ్రీనివాసరావు, ఏఓ యూనస్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
మెదక్ కలెక్టరేట్: ఓటుచోరికి బాధ్యత వహిస్తూ కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్ వెంటనే రాజీనామా చేయాలని డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లేశం డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇండియా కూటమి నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. జ్ఞానేశ్ కుమార్ నిర్ణయంతో సర్ ప్రక్రియ ద్వారా దేశంలో లక్షలాది ఓట్లు తొలగించే కుట్ర జరుగుతుందన్నారు. దీనిని నిరసిస్తూ ఇండియా కూటమి ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ రాధిక, వైస్ చైర్మన్ నరేశ్‌గౌడ్, కాంగ్రెస్ పట్టణ పార్టీ అధ్యక్షుడు గంగాధర్, సీపీఎం నాయకులు షౌకత్, మల్లేశం, మహేందర్ రెడ్డి, కౌన్సిలర్ హరిత, నాయకులు బొజ్జ పవన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
కౌడిపల్లి(నర్సాపూర్): నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని టీజీఎస్‌పీడీసీఎల్ సీఎండీ జితీశ్ వి పాటిల్ తెలిపారు. సోమవారం కౌడిపల్లిలో 132 కేవీ సబ్‌స్టేషన్‌ను తనిఖీ చేసి విద్యుత్ సరఫరాను పరిశీలించారు. ఎంత కరెంట్ వస్తుంది..? ఎంత సరఫరా అవుతుంది అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సాగుకు, గృహాలకు నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. సబ్‌స్టేషన్‌లో పనులు చేసేటప్పుడు విధుల పట్ల నిర్లక్ష్యం వహించొద్దని సూచించారు. కార్యక్రమంలో చీఫ్ ఇంజనీర్ బాలస్వామి, ఎస్‌ఈ నారాయణనాయక్, డీఈ రామేశ్వరస్వామి, ఏఈ సాయికుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
హత్నూర(సంగారెడ్డి): వీఓఏలపై అధికారుల వేధింపులు ఆపకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు నగేశ్ అన్నారు. సోమవారం హత్నూర ఐకేపీ కార్యాలయం వద్ద పెద్దఎత్తున ఆందోళన నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హత్నూర మండలం కాసాల వీఓఏపై సీసీ వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు. 24 ఏళ్లుగా కష్టపడుతున్న వీఓఏలకు నేటికీ కనీస వేతనం లేదని వాపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీ ప్రకారం కనీస వేతనాలు ఇవ్వాలన్నారు. ఉద్యోగ భద్రత, చట్టపరమైన సౌకర్యాలు అమలు చేయాలని కోరారు. నల్గొండ జిల్లాలో మాధవిపై అన్యాయంగా దాడి చేసిన మాజీ సర్పంచ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఏపీఎం రాజశేఖర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి సాయిలు, యూనియన్ నాయకులు మంజుల, ఆంజనేయులు, కిష్టయ్య, లక్ష్మయ్య, నరేందర్ గౌడ్, కృష్ణ, భాగ్యలక్ష్మి, మల్లయ్య, ప్రవీణ్, మల్లారెడ్డి, విజయ తదితరులు పాల్గొన్నారు.


