సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: మున్సిపాలిటీలకు చెందిన విలువైన భూములు.. లేఅవుట్లలోని 10 స్థలాలపై కమిషనర్, డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (సీడీఎంఏ) దృష్టి సారించింది. ప్రధానంగా ము న్సిపాలిటీల నుంచి అనుమతులు పొందిన లేఅవుట్లలో ప్రజా అవసరాల కోసం కేటాయించిన 10 శాతం భూములపై ఆరా తీసింది. ఈ మేరకు మున్సిపాలిటీలకు చెందిన భూములు, భవనాలు, ఇతర స్థిరాస్తుల వివరాలను పంపాలని సీడీఎంఏ నుంచి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలకు ఆదేశా లు అందాయి. ప్రత్యేక ఫార్మాట్‌లో ఆయా మున్సిపాలిటీల అధికారులు ఈ స్థిరాస్తుల వివరాలను పంపారు.
రూ.కోట్లు విలువ చేసే స్థలాలు
జిల్లాలో మొత్తం 11 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇస్నాపూర్, ఇంద్రేశం, గడ్డపోతారం, గుమ్మడిదల, జిన్నారంలు గతంలో గ్రామ పంచాయతీలు ఉండగా, వాటిని ప్రభుత్వం మున్సిపాలిటీలుగా ప్రకటించింది. మెదక్ జిల్లాలో మూడు బల్దియాలు ఉన్నాయి. ఆయా పట్టణాల్లో మున్సిపాలిటీలకు రూ.కోట్లు విలువ చేసే స్థలాలు ఉన్నాయి. అలాగే లేఅవుట్లలో పార్కులు, ఆరోగ్య కేంద్రాలు, బడులు, గుడులు వంటి వాటి కోసం కేటాయించాల్సిన 10 శాతం భూములు కూడా చాలా ఉన్నాయి. అయితే ఈ స్థలాలు చాలా మట్టుకు అన్యాక్రాంతమయ్యాయి. నేతలు, అధికారులు కలిసి పార్కుల స్థలాలను కబ్జాలకు పాల్పడ్డారు. చాలా చోట్ల పార్కులు ఆనవాళ్లు కోల్పోయాయి. మరోవైపు ఆయా లేఅవుట్లలోని ప్రజా అవసరాల కోసం వదిలేసిన విలువైన స్థలాలను కూడా కబ్జాలకు పాల్పడ్డారు. అలాగే మున్సిపాలిటీ స్థలాలను కొందరు నేతలు, వారి బీనామీలు లీజుకు తీసుకున్నారు. నామమాత్రపు మొత్తాన్ని చెల్లించి దశాబ్దాల తరబడి ఈ విలువైన స్థలాల్లో వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలు కొనసాగిస్తూ రూ.కోట్లు దండుకుంటున్నారు. కొన్ని స్థలాలనైతే రెవెన్యూ అధికారులకు పెద్ద మొత్తంలో ముడుపులు ముట్టజెప్పి తమ పేర్ల మీదికి మార్చుకున్నారు. ఇప్పుడు సీడీఎంఏ ఈ స్థలాలపై దృష్టి సారించింది.
లేఅవుట్లలో ప్రజావసరాలకు కేటాయించిన స్థలాలు
లీజుకు ఇచ్చిన భూములపై ఆరా
డీజీపీఎస్ సర్వేకు సీడీఎంఏ శ్రీకారం
వివరాలు పంపాలని మున్సిపాలిటీలకు ఆదేశం
శాటిలైట్ మ్యాపులతో అనుసంధానం
ఈ స్థలాలపై ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సర్వే చేపట్టాలని నిర్ణయించింది. డీజీపీఎస్ విధానంలో సర్వే చేసి మ్యాపులు, వాటి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. శాటిలైట్ మ్యాపులతో అనుసందిస్తారు. తద్వారా ఎంత విస్తీర్ణంలో లీజుకు ఇచ్చారు. ఎంత విస్తీర్ణంలో కబ్జాలు ఉన్నాయనేది తేల్చాలని సీడీఎంఏ భావిస్తోంది.
కోర్టు వివాదాల్లో ఉంటే..
మున్సిపాలిటీలకు చెందిన కొన్ని విలువైన స్థలాలు కోర్టు వివాదాల్లో ఉన్నాయి. లీజుదారులతో అధికారులు కుమ్ముకై ్క కోర్టుల్లో బలమైన సాక్షాలను చూపించి.. లీజుదారులను తొలగించడంలో కావాలని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ వ్యవహరంలో అధికారులకు, పాలకవర్గాల ప్రజాప్రతినిధులకు పెద్ద మొత్తంలో ముడుపులు అందుతున్నాయి. దీంతో దశాబ్దాల తరబడి రూ.కోట్లు విలువ చేసే ఈ స్థలాలను స్వాధీనం చేసుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఇలాంటి వివాదాలు ఉన్న స్థలాలపైనా సీడీఎంఏ ఆరా తీసింది. సీడీఎంఏ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు మున్సిపల్ స్థలాల వివరాలను పంపామని సంగారెడ్డి, ఇంద్రేశం టౌన్‌ప్లానింగ్ అధికారి విశాల్ ‘సాక్షి’ ప్రతినిధితో తెలిపారు.


