● మాజీ మంత్రి హరీశ్‌రావు
● ఎల్‌నినోపై ప్రభుత్వానికి
ముందుచూపులేదని విమర్శ
నర్సాపూర్ రూరల్: రాష్ట్రంలో కాంగ్రెస్‌తోనే కరువొచ్చిందని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. శనివారం మండలంలోని కాగజ్‌మద్దూర్‌లో ఆయా గ్రామాలకు చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు బీఆర్‌ఎస్‌లో చేరగా, వారికి బీఆర్‌ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎల్‌నినోపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందుచూపు లేదన్నారు. విద్యుత్ సరఫరా కోసం ముందస్తు ప్రణాళిక లేక రైతుల ఉసురు తీస్తున్నారని మండిపడ్డారు. థర్మల్ విద్యుత్ కోసం కావాల్సిన 40 వేల మెట్రిక్ టన్నుల బొగ్గులు మాయం చేశారన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి తన వారి భూముల ధరలు పెంచుకునేందుకే ఫ్యూచర్ సిటీకి రోడ్ల కోసం రూ.10 వేల కోట్లు మంజూరు చేరన్నారు. మంత్రుల నియోజకవర్గాల్లో కూడా రోడ్లు సరిగా లేవని, కాగజ్ మద్దూర్ రోడ్డు గుంతలమయంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఇప్పటికీ అమలు చేయలేదన్నారు. సాగుకు కేవలం 5 గంటల విద్యుత్ మాత్రమే వస్తుందన్నారు. దేవాదుల, కల్వకుర్తి, శ్రీశైలం, సమ్మక్క–సారలమ్మ, మేడిగడ్డ ప్రాజెక్టుల్లో నీరు ఉన్నా ఎత్తిపోయడం లేదన్నారు. పింఛన్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వడం లేదని మండిపడ్డారు. అనంతరం ఎమ్మెల్యే సునీతారెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధిని గుర్తు చేశారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి సముచిత గౌరవం ఇస్తామని హామీ ఇచ్చారు. నిరుద్యోగులకు లక్ష్మారెడ్డి ట్రస్టు ద్వారా పోటీ పరీక్షలకు ఉచితంగా శిక్షణ ఇప్పిస్తామన్నారు. ఇందుకోసం యాప్‌ను ఏర్పాటు చేయించి హరీశ్‌రావుతో ప్రారంభింపజేశారు. కార్యక్రమంలో మాజీ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, బీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి దేవేందర్‌రెడ్డి, జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ అశోక్‌గౌడ్, మాజీ జిల్లా కో ఆప్షన్ సభ్యుడు మన్సూర్, నాయకులు భోగ శేఖర్, పంబల భిక్షపతి, బాల్‌రెడ్డి, నయీమ్, శ్రీనివాస్‌రెడ్డి, అశోక్‌గౌడ్, వెంకటయ్య, రాజు, జితేందర్‌రెడ్డి, మధుకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మహ్మదాబాద్ సర్పంచ్ బిందు, ఉప సర్పంచ్ సాలి, కాగజ్‌మద్దూర్ వార్డు సభ్యులతో పాటు పలువురు నాయకులు బీఆర్‌ఎస్‌లో చేరిన వారిలో ఉన్నారు.


