సివిల్‌ సప్లై దూకుడు | - | Sakshi
Sakshi News home page

సివిల్‌ సప్లై దూకుడు

Oct 4 2026 7:20 AM | Updated on Oct 4 2026 7:20 AM

● గ్యాస్‌ అక్రమ దందాపై ఉక్కుపాదం

● జిల్లాలో 605 ఎల్‌పీజీ సిలిండర్లు స్వాధీనం

● 4,669 క్వింటాళ్ల పీడీఎస్‌ రైస్‌ పట్టివేత

మెదక్‌ కలెక్టరేట్‌: జిల్లాలో సివిల్‌ సప్లై అధికారులు దూకుడు పెంచారు. గ్యాస్‌ అక్రమ దందా, పీడీఎస్‌ అక్రమ రవాణ అరికట్టేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా గత మూడు నెలల్లో 605 అక్రమంగా నిల్వ చేసిన ఎల్పీజీ గ్యాస్‌ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు. మరోవైపు సివిల్‌ సప్లై విజిలెన్స్‌ అధికారులు రైస్‌ మిల్లుల్లో దాడులు చేస్తూ అక్రమాలను వెలికి తీస్తున్నారు. ఇదే సమయంలో పీడీఎస్‌ రైస్‌ అక్రమ తరలింపును అడ్డుకునేందుకు విస్తృతంగా తనిఖీలు చేస్తూ అక్రమార్కులను పట్టుకుంటున్నారు. ఇప్పటివరకు 23 మందిపై కేసు నమోదు చేశారు.

ఆరుగురు డీలర్లపై కేసులు

రేషన్‌ బియ్యంలో అక్రమాలకు పాల్పడుతున్న ఆరుగురు డీలర్లపై కేసులు నమోదు చేశారు. 4,669 క్వింటాళ్ల పీడీఎస్‌ రైస్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల వెల్దుర్తి మండల కేంద్రంలో అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్‌ రైస్‌ను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు జిల్లాలో ఎక్కడా అక్రమంగా ఎల్పీజీ గ్యాస్‌ రీఫిల్లింగ్‌ జరగకుండా కఠిన చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా మనోహరాబాద్‌ మండలం కాళ్లకల్‌లోఇటీవల 269 ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు. గత నెల 28న చిన్నశంకరంపేట మండల కేంద్రంలో 7 సిలిండర్లను పట్టుకున్నారు. అలాగే ఇటీవల జిల్లా కేంద్రంలోని హోటళ్లపై దాడులు నిర్వహించి 240 గ్యాస్‌ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు.

విజిలెన్స్‌ దూకుడు

మరోవైపు సివిల్‌ సప్లై విజిలెన్స్‌ అధికారులు జిల్లాలోని రైస్‌ మిల్లుల్లో ఆకస్మిక తనిఖీలు చేపడుతూ మిల్లర్ల అక్రమాలను బయటపెడుతున్నారు. ఇందులో భాగంగా కొల్చారం మండల కేంద్రంలో నిర్వహించిన తనిఖీల్లో రూ.7 కోట్ల విలువైన ధాన్యం గల్లంతైనట్లు గుర్తించారు. ఇటీవల చిన్నశంకరంపేట మండలంలోని రైస్‌మిల్లులో తనిఖీలు చేపట్టి రూ.3 కోట్ల విలువైన ధాన్యం మాయం అయినట్లు గుర్తించారు. ఈ మేరకు ఆయా మిల్లుల యజమానులపై కేసులు నమోదు చేయడంతో పాటు రీకవరీ చేసేందుకు ఆర్‌ఆర్‌యాక్ట్‌ అమలు చేయనున్నారు. అధికారుల ఆకస్మిక తనిఖీలతో రైస్‌ మిల్లర్లలో భయాందోళన నెలకొంది.

అక్రమాలను అరికడతాం

జిల్లాలో అక్రమంగా ఎల్‌పీ జీ గ్యాస్‌ విక్రయాలు, పీడీఎస్‌ అక్రమ రవాణను అరికట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. ఇందులో భాగంగా జిల్లాలో విస్తృతంగా దాడులు, తనిఖీలు చేస్తున్నాం. అలాగే రైస్‌ మిల్లుల్లో జరుగుతున్న అక్రమాలను విజిలెన్స్‌ అధికారుల ద్వారా అరికడుతున్నాం.

– నిత్యానంద్‌, జిల్లా సివిల్‌ సప్లై అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement